పాకిస్తాన్ అస్థిరతకు మారుపేరు అనేది తెలిసిందే. అక్కడ ఏ ప్రధాని పూర్తి పదవీకాలం అధికారంలో ఉండరు.. ఏ నాయకుడు సైన్యాన్ని ఎదిరించి ఏం చేయలేరు. ఇప్పుడు పరిస్థితి అంతకు మించిపోయింది. తెరవెనుక ఉండి ప్రభుత్వాన్ని నడిపించే పాక్ ఆర్మీ.. ఇప్పుడు ఏకంగా నేరుగా క్యాబినెట్ మీటింగ్ లలోనే కూర్చుని రాజ్యమేలుతోంది. దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు కనీసం స్వతంత్రంగా ఒక్క నిర్ణయం తీసుకునే హక్కు కూడా లేకుండా పోయింది. ఈ షాకింగ్ నిజాలను బయటపెట్టింది సామాన్యులు కాదు, పాక్ రాజకీయాల్లో దశాబ్దాలుగా కింగ్ మేకర్ గా వెలుగొందుతున్న మౌలానా ఫజ్లుర్ రెహమాన్. 1971లో పాక్ సైన్యం లొంగుబాటును గుర్తుచేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ ను కుదిపేస్తున్నాయి.
పాకిస్తాన్ లో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసినా, రావల్పిండిలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో ఉండే ఆర్మీ చీఫే. అయితే మౌలానా ఫజ్లుర్ రెహమాన్ చెబుతున్న దాని ప్రకారం.. ఇప్పుడున్నది కేవలం సైనిక జోక్యం కాదు, పూర్తిస్థాయి ఆధిపత్యమే. యునైటెడ్ అపోజిషన్ సమావేశంలో మౌలానా ఫజ్లుర్ రెహమాన్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు ఎలాంటి స్వతంత్ర అధికారాలు మిగలలేదని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాథమిక అధికారాలను సైతం సైనిక నాయకత్వానికి అప్పగించేశారని ఆరోపించారు.పాక్ సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ కీలక అధికారుల నియామక నిబంధనలను ప్రభుత్వం నుంచి లాగేసుకున్నారు. గతంలో సైనికాధికారుల సెలవులు మంజూరు చేసే హక్కు సివిల్ ప్రభుత్వానికి ఉండేది, ఇప్పుడు దాన్ని కూడా ఆర్మీ చీఫ్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రధానికి సలహాదారు ముసుగులో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నేరుగా మంత్రుల క్యాబినెట్ భేటీల్లోనే కూర్చుని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన మౌలానా.. అసిమ్ మునీర్ ప్రస్తుతం ఒక ఆర్మీ చీఫ్‌గా మాత్రమే కాకుండా రక్షణ శాఖ అధిపతిగా, ఒక ఫీల్డ్ మార్షల్ లాగా సర్వాధికారాలు చెలాయిస్తున్నారని విమర్శించారు. 1988లో జనరల్ జియా-ఉల్-హక్ మార్షల్ లాకు వ్యతిరేకంగా పోరాడిన తనకు, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ సైనిక ఆధిపత్యంపై పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. పాక్ సైన్యానికి దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పే అలవాటు ఎప్పట్నుంచో ఉందంటూ.. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధాన్ని ప్రస్తావించారు. 1971 డిసెంబర్‌లో భారత సైన్యం దెబ్బకు తట్టుకోలేక 93 వేల మంది పాకిస్తాన్ సైనికులు ఆయుధాలు కింద పడేసి ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటుకు గురయ్యారు. ఆ చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేసిన మౌలానా ఫజ్లుర్ రెహమాన్.. నాటి సైనిక పాలకుడు జనరల్ యాహ్యా ఖాన్ తీరుపై విమర్శలు గుప్పించారు. 1971లో లొంగిపోవడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు వరకు కూడా.. జనరల్ యాహ్యా ఖాన్ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ, చివరి శ్వాస వరకు పోరాడతాం.. శత్రువును చిత్తు చేస్తాం అని ప్రజలకు అబద్ధాలు చెప్పారు. కానీ మరుసటి రోజే లొంగిపోయి ఆయుధాలు కింద పడేశారని అన్నారు.
ఇప్పుడు కూడా దేశంలో అదే తరహా పరిస్థితులు నెలకొన్నాయని.. పాక్ సైన్యం ప్రజలను మభ్యపెడుతూ, దేశాన్ని అంధకారంలోకి నెడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. సొంత సైన్యంపైనే, ఒక సీనియర్ పాక్ రాజకీయ నేత ఈ స్థాయిలో చారిత్రక నిజాలు మాట్లాడటం పాకిస్తాన్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పాకిస్తాన్ రాజకీయాల్లో జేయూఐ-ఎఫ్ అధినేత మౌలానా ఫజ్లుర్ రెహమాన్‌కు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అసలు పొసగదు. గతంలో ఇమ్రాన్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో మౌలానాదే కీలక పాత్ర. అయితే, ఇప్పుడు ఉమ్మడి శత్రువు పాక్ సైన్యం కావడంతో.. ఈ బద్ధ శత్రువులు ఇద్దరూ ఒక్కటవుతున్నారు. సైనిక నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఒకే తాటి పైకి తెచ్చేందుకు మౌలానా ప్రయత్నిస్తున్నారు. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీతో సహా ఇతర చిన్న పార్టీలను ఏకం చేసి.. అపరిమిత అధికారాలు పొందుతున్న సైనిక నాయకత్వం పై ఐక్య పోరాటానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు ప్రజల్లో ఉన్న విపరీతమైన క్రేజ్, మౌలానాకు ఉన్న రాజకీయ వ్యూహాలు కలిస్తే పాక్ ఆర్మీకి ఇదొక అతిపెద్ద సవాలుగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.మరోవైపు పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇలాంటి సమయంలో దేశాన్ని గాడిలో పెట్టాల్సిన సైన్యం.. ఏకంగా రాజకీయ వ్యవస్థపై ఆధిపత్యం చెలాయించడం దీనిపైనే ఇప్పుడు ప్రతిపక్షాలు సంయుక్తంగా పోరాటాన్ని ప్రకటించాయి. రాబోయే రోజుల్లో పాకిస్తాన్‌లో సైన్యానికి, ప్రతిపక్షాలకు మధ్య జరిగే ఈ ఆధిపత్య పోరు.. ఎటు తీసుకెళ్తుందనేది చూడాలి.