ప్రపంచ ఐటీ రంగంలో తిరుగులేని పవర్ గా దూసుకెళ్తున్న భారత్

Spread the love

ప్రపంచ ఐటీ రంగంలో భారత్ తిరుగులేని పవర్ గా ఎదిగిందని ప్రపంచ టెక్ దిగ్గజం జెన్సెన్ హువాంగ్ అన్నారు. ఎన్విడియా ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ రూపంలో సరికొత్త టెక్నాలజీ వైపు దూసుకెళ్తోందన్నారు. ప్రధాని మోదీ పదేళ్ల క్రితమే దూరదృష్టితో అలోచించి ఏఐ గురించి మాట్లాడారన్నారు. భారతీయ కంపెనీలు, స్టార్టప్ లు ఏఐ టెక్నాలజీని మరింతగా అందిపుచ్చుకోవాలని  అభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. బలమైన ఏఐ ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు భారత్ కు  చాలా మంచి అవకాశాలు ఉన్నాయని హువాంగ్ తెలిపారు. నార్త్ కరోలినాలోని చాపెల్ హిల్ లో జీ20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సమావేశం సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు.

విద్యుత్ మరియు ఇంటర్నెట్ ఏ విధంగా ప్రపంచ రూపురేఖలను మార్చేశాయో, అదే విధంగా  ఏఐ కూడా రాబోయే కాలంలో సమూల మార్పులు తీసుకువస్తుందని ఆయన విశ్లేషించారు. ఇక భారత్ కూడా సరికొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుని శరవేగంగా దూసుకెళ్తోంది. భారత్ లో  ప్రభుత్వ పరంగా చూస్తే, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు ‘ఇండియా ఏఐ మిషన్’ వంటి కార్యక్రమాలు దేశంలో టెక్నాలజీ ఎదుగుదలకు  పటిష్టమైన పునాది వేస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు పరిశ్రమలకు అనుకూలంగా ఉండటం వల్ల విదేశీ పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ నార్త్ దేశాలతో సమానంగా భారత్ తన డేటా సెంటర్లు, కంప్యూటింగ్ శక్తిని పెంచుకుంటోంది. నిపుణుల అంచనాల ప్రకారం, రాబోయే ఐదేళ్లలో ఏఐ  రంగం ద్వారా భారతదేశ జిడీపీ గణనీయంగా పెరిగే  అవకాశం ఉంది. ఫైనాన్షియల్ మరియు ఇండస్ట్రియల్ రంగాల నిపుణులు విశ్లేషిస్తున్న ప్రకారం, భారత్‌లో అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ ప్రతిభ మరియు తక్కువ ఖర్చుతో కూడిన డేటా ప్రాసెసింగ్ సామర్థ్యాలు అంతర్జాతీయ సంస్థలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి గ్లోబల్ దిగ్గజాలు ఇప్పటికే మన దేశంలో ఏఐ  రీసెర్చ్ సెంటర్ల కోసం భారీ  పెట్టుబడులను ప్రకటించాయి. ఇక దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు కూడా ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్ కోర్సులను సిలబస్‌ లో భాగం చేస్తున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద పాఠశాల స్థాయి నుంచే ఆ దిశగా  విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. టెక్నాలజీ రంగంలో ఎదురవుతున్న నైపుణ్య కొరతను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ‘స్కిల్ ఇండియా’ కింద ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తోంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల యువతకు సైతం అత్యాధునిక డిజిటల్ నైపుణ్యాలు అందుబాటులోకి వస్తున్నాయి.

టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, కంట్రోల్ చేయడంలో  సవాళ్లు కూడా అంతే స్థాయిలో ఉంటున్నాయి. ఈ అంశంపై స్పందిస్తూ, ప్రభుత్వాలు మరియు నియంత్రణ సంస్థలు కేవలం ఊహాజనిత నష్టాల గురించి ఆందోళన చెందకుండా, వాస్తవంగా జరిగే నష్టాలను నివారించడంపై దృష్టి పెట్టాలని హువాంగ్ హితవు పలికారు. టెక్నాలజీడెవలప్మెంట్ ను ఆపలేమని, ప్రతి దేశం మరింత వేగంగా స్పందించి తగిన విధానాలను రూపొందించుకోవాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో భారత్ కేవలం వినియోగదారుడిగా మాత్రమే కాకుండా, గ్లోబల్ ఏఐ లీడర్‌గా అవతరించే అన్ని లక్షణాలను సంతరించుకుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. జెన్సెన్ హువాంగ్ లాంటి దిగ్గజాలు ప్రశంసించడం మన దేశ పవర్‌ ను ప్రపంచానికి చాటిచెబుతోంది. రాబోయే కాలంలో భారత్ గ్లోబల్ టెక్ లీడర్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *