పశ్చిమాసియాలో ప్రస్తుతం పరిస్థితి గురించి తెలిసిందే. ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా దాడులతో పాటు అమెరికా-ఇరాన్ మధ్య ఎప్పుడు ఏ క్షణాన డైరెక్ట్ యుద్ధం వస్తుందో తెలియని టెన్షన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే సెప్టెంబర్ నెలలో ఆయన నేరుగా మన భారతదేశానికి రానున్నారు. న్యూఢిల్లీ వేదికగా జరగబోతున్న ప్రతిష్టాత్మక 18వ బ్రిక్స్ సదస్సు లో ఆయన పాల్గొనబోతున్నారు. ఈ ఏడాది బ్రిక్స్ కూటమికి మన భారత్ అధ్యక్షతన జరగనుంది. ఒకప్పుడు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా అనే కేవలం ఐదు దేశాలతో మాత్రమే ఉన్న ఈ కూటమి ఇప్పుడు ఒక మహాశక్తిగా ఎదిగింది. 2024 అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఈ కూటమిలోకి ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి కొత్త దేశాలు అధికారికంగా చేరాయి. ఆ తర్వాత 2025 లో ఇండోనేషియా కూడా పూర్తిస్థాయి సభ్యత్వం పొందడంతో ఇప్పుడు బ్రిక్స్ సభ్యదేశాల సంఖ్య ఏకంగా 11కి చేరింది. ఇలాంటి ఒక పవర్ఫుల్ కూటమికి ఇండియా నేతృత్వం వహిస్తున్న సమయంలో, ఇరాన్ అధ్యక్షుడు ఢిల్లీకి రావడం వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత ప్రధాని మోడీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు మధ్య మంచి స్నేహమే ఉంది. గతంలో 2024 కజాన్ బ్రిక్స్ సదస్సు సమయంలోనే వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అప్పట్లోనే ఈ రెండు దేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ భద్రతా అంశాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నాయి. చబహార్ పోర్ట్ అభివృద్ధి లాంటి ఆర్థిక అంశాలు కూడా వీరి భేటీలో కీలకంగా మారాయి. ఇప్పుడు సెప్టెంబర్‌లో ఢిల్లీ వేదికగా జరగనున్న సదస్సులో ఈ ఇద్దరు అగ్రనేతలు మరోసారి సమావేశం కానున్నారు. అమెరికా ఆంక్షల వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న ఇరాన్, భారత్ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో సంబంధాలు బలపరుచుకోవడం ద్వారా ఆ గండం నుంచి గట్టెక్కాలని పక్కా మాస్టర్ ప్లాన్ వేస్తోంది. అయితే ఈ పర్యటన వెనుక కేవలం వ్యాపార, వాణిజ్య కోణం మాత్రమే లేదు. దీని వెనుక ఒక అతిపెద్ద జియో-పాలిటికల్ గేమ్ ఉందనే టాక్ వినిపిస్తోంది. దానికి పునాది జూన్ నెలలోనే పడింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్వయంగా భారత్ కు వచ్చారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి. అంతర్జాతీయ వేదికపై భారత్‌కు రోజురోజుకూ పెరుగుతున్న ప్రభావాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే.. అరబ్ దేశాలతో , ఇరాన్‌తో కూడా చెక్కుచెదరని స్నేహాన్ని నెరపుతున్న ఏకైక దేశం మన భారతదేశం. అందుకే ఇప్పుడు ఇరాన్ కూడా మోదీ వైపే చూస్తోంది. సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరగబోయే 18వ బ్రిక్స్ సదస్సు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.