తగ్గిన పుతిన్.. ఇక యుద్ధానికి ఎండ్ కార్డ్ పడనుందా..?

Spread the love

రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొననుందా..? రెండు దేశాల మధ్య యుద్ధానికి ఎండ్ కార్డ్ పడనుందా..? 30 రోజుల కాల్పుల విరమణ ఇందుకు ఉపయోగపడనుందా..? రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం .. మిత్ర దేశాలు చేసిన ప్రయత్నాలు ఏంటి.. ? పుతిన్, జెలెన్ స్కీ సడన్ గా శాంతి చర్చలకు ఎందుకు ఒప్పుకున్నారు..? ట్రంప్ చెబితే వినని.. జెలన్ స్కీ ఇప్పుడు మిత్ర దేశాలు చెబితే ఎలా విన్నారు..? చర్చలకు ఏ దేశం వేదిక కానుంది..?

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముంగింపు పలకడానికి కీలక అడుగులు పడుతున్నాయా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు కోసం ప్రయత్నించారు. అయితే పుతిన్ పైకి ఓకే చెప్పినా.. కాస్త వెనక్కు తగ్గారు. తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే చర్చలకు సిద్ధమని చెప్పారు. ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సైతం పుతిన్ తో ప్రత్యక్ష చర్చలకు తాను సిద్ధంగా లేనని చెప్పారు. అయితే ఇప్పుడు రెండు దేశాధ్యక్షులు ప్రత్యక్ష చర్చలకు సిద్ధమంటున్నారు. శాంతి కోసం తాము ముందుకొస్తామని చెబుతున్నారు. వీరిలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి..?

రష్యాతో పూర్తిస్థాయి, బేషరతు కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్, దాని మిత్రపక్ష దేశాలు శనివారం వెల్లడించాయి. సోమవారం నుంచి కనీసం 30 రోజులు కాల్పుల విరమణను పాటించేలా ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చాయి. క్రెయిన్‌ రాజధాని కీవ్‌ పర్యటన సందర్భంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్, బ్రిటన్‌ దేశాల అధినేతలు సమావేశమై చర్చలు జరిపారు. రష్యాతో మూడేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించాల్సిన ఆవశ్యకతను వారు జెలెన్‌స్కీకి వివరించారు. ఉక్రెయిన్‌తో పాటు ఐరోపా దేశాల శాంతి, సుస్థిరతలకు ఇది అవసరమని పేర్కొన్నారు. సంధికి అంగీకరించి, శాంతి చర్చల ప్రక్రియ ప్రారంభమయ్యేలా రష్యాపైనా ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఈ మేరకు నాలుగు దేశాల నేతలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇదే విషయాన్ని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా కూడా నిర్ధారించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్లో జెలెన్‌స్కీ, నాలుగు ఐరోపా దేశాల నేతలు మాట్లాడిన తర్వాతే కాల్పుల విరమణ ప్రతిపాదన చేసినట్లు ఆండ్రీ వెల్లడించారు. అయితే సోమవారం నుంచి మొదలయ్యే 30 రోజుల కాల్పుల విరమణను రష్యా ఉల్లంఘిస్తే.. మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌ సహా పలువురు ఐరోపా నాయకులు వెల్లడించారు.

మిత్ర దేశాలతో సమావేశం తర్వాత .. యుద్ధ విరమణపై జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధినేత పుతిన్‌తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ఎట్టకేలకు యుద్ధం ముగించే విషయాన్ని రష్యా పరిశీలిస్తోందన్నారు. చాలా రోజుల నుంచి ఇందుకోసమే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందన్నారు. యుద్ధం ముగింపులో మొదటి అడుగు కాల్పుల విరమణే అని పేర్కొన్నారు. ఈ మారణకాండను ఒక్కరోజు కూడా కొనసాగించడంలో అర్థం లేదన్నారు. రష్యా కాల్పుల విరమణ ధ్రువీకరణ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. రష్యా ప్రతినిధులను కలిసేందుకు ఉక్రెయిన్‌ సిద్ధంగా ఉందని జెలెన్ స్కీ పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌తో మూడేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి కీవ్‌తో ప్రత్యక్ష చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. ఈ చర్చలు ఇరుదేశాల్లో శాశ్వత శాంతిని నెలకొల్పేలా ఉండాలన్నారు. ఈ మేరకు ఇస్తాంబుల్‌ వేదికగా ఇరుదేశాల చర్చలకు ఆయన ప్రతిపాదించారు. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా కీవ్‌ ప్రత్యక్ష చర్చలను తిరిగి ప్రారంభించాలని తాము కోరుతున్నట్లు పుతిన్‌ ప్రకటించారు. గురువారం ఇస్తాంబుల్‌ వేదికగా చర్చలు జరపాలని ఉక్రెయిన్‌ అధికారులను పుతిన్‌ కోరారు. ఈ విషయంపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో మాట్లాడతానని అన్నారు. ఈ చర్చల ద్వారా పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తాము మానవతా దృక్పథంతో ఉక్రెయిన్‌కు చెందిన ఇంధన వనరులపై దాడులను ఆపేశామని, ఈస్టర్ కాల్పుల విరమణ, విక్టరీ డే కాల్పుల విరమణ వంటివి ప్రకటించామని చెప్పారు. అయినప్పటికీ ఆ సమయాల్లో ఉక్రెయిన్‌ ఈ ఒప్పందాలను ఉల్లంఘించి.. 524 వైమానిక డ్రోన్‌లు, 45 సముద్ర డ్రోన్‌లు, అనేక పాశ్చాత్య క్షిపణులతో రష్యాపై దాడి చేసిందని ఆరోపించారు. తమ సైన్యం కీవ్ దాడులను తిప్పి కొట్టిందని తెలిపారు.

కాల్పుల విరమణ ఒప్పందం జరగాలంటే ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం ఆలోచనలను విరమించుకోవాలని, తాము ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాల నుంచి వారి బలగాలను ఉపసంహరించుకోవాలని పుతిన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఫిబ్రవరి 2022లో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన కొత్తలో ఇరు దేశాలు సంధి కోసం ముసాయిదా ఒప్పందాన్ని చేసుకున్నాయి. నాటి ఒప్పందం గురించి పుతిన్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అప్పట్లో సంధి చర్చలు విరమించుకుంది తాము కాదని..ఉక్రెయిన్‌ వాటి నుంచి వైదొలిగిందన్నారు. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నాలు చేసినందుకుగాను అమెరికా, భారత్‌ చైనా, బ్రెజిల్, ఇతర మధ్యప్రాచ్య, ఆఫ్రికన్‌ దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రయత్నాలను కొనియాడారు. పుతిన్ వ్యాఖ్యలు చూస్తే శాంతి కోసం చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు అర్థమవుతుంది. అయితే గురువారం ఇస్తాంబుల్‌ వేదికగా చర్చలు జరుగుతాయా..? రెండు దేశాల అధ్యక్షులు చర్చలకు హాజరవుతారా..? శాంతి కోసం ఒప్పందాలు చేసుకుంటారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.