ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ముసాయిదాను సిద్ధం చేశారు. 15 కీలక అంశాలతో ఇది రూపొందింది. కేవలం సైనిక చర్యలతోనే కాకుండా, కఠినమైన షరతులతో కూడిన శాంతి ఒప్పందాన్ని ట్రంప్ ప్రతిపాదించారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ కు పంపిన ఈ 15 పాయింట్ల ప్రణాళికలో ప్రధానంగా అణ్వాయుధాల నిర్మూలనననే ట్రంప్ ప్రధానంగా ప్రస్తావించారు. ఇరాన్ కు అణ్వాయుధాలు ఉండకూడదని అదే తన మొదటి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ పంపిన ఈ ప్రతిపాదనలో ఇరాన్‌కు కఠినమైన సవాళ్లతో పాటు కొన్ని బెన్ ఫిట్స్ కూడా ఉన్నాయి. ఇరాన్ తన వద్ద ఉన్న అణు సామర్థ్యాన్ని పూర్తిగా వదులుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను తయారు చేయకూడదన్నారు. కీలక అణు పరిశోధనా కేంద్రాలను పూర్తిగా మూసివేయాలి లేదా ధ్వంసం చేయాలన్నారు. ఇక ఇప్పటివరకు ప్రాసెస్ చేసిన యురేనియం మొత్తాన్ని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి అప్పగించాలి. ఇరాన్ తన బాలిస్టిక్ మిస్సైల్ రేంజ్ ను, సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవడం వాటిని కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కు మాత్రమే వాడడాం. మిడిల్ ఈస్ట్‌లోని హమాస్, హిజ్బుల్లా వంటి సాయుధ గ్రూపులకు ఫైనాన్షియల్, సైనిక మద్దతును పూర్తిగా నిలిపివేయాలని పేర్కొన్నారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని అంతరాయం లేకుండా తెరిచి ఉంచాలి. IAEA ప్రతినిధులకు ఇరాన్ లోని ఏ ప్రదేశాన్నైనా సెర్చ్ చేసేందుకు పూర్తి స్వేచ్ఛను కల్పించాలని స్పష్టం చేశారు. బదులుగా ఇరాన్ శాంతియుత అవసరాల కోసం చేపట్టే అణు కార్యక్రమాలకు అమెరికా సహకరిస్తుందన్నారు. ఈ షరతులకు ఒప్పుకుంటే ఆ దేశంపై ఉన్న ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను అమెరికా పూర్తిగా ఎత్తేస్తుందన్నారు. అయితే ట్రంప్ ప్రతిపాదనల పట్ల ఇరాన్ నుండి భిన్నమైన రెస్పాన్స్ వస్తోంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ ఈ వార్తలను ‘ఫేక్ న్యూస్’ అని కొట్టిపారేయగా, మరోవైపు అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశంలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం, ఈ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యానికి కారణమవుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం తన దాడులను ఆపే ప్రసక్తే లేదని, ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతినే వరకు వెనక్కి తగ్గేదెలేదని చెబుతోంది. ట్రంప్ ప్రణాళిక ఇరాన్ కు ఒక రకంగా ఎటూతేల్చుకోలేని పరిస్థితి. అణు కేంద్రాలను ధ్వంసం చేయడం అంటే ఇరాన్ తన రక్షణను వదులుకున్నట్లవుతుంది. దీనికి ఆ దేశ సైన్యం IRGC ఒప్పుకుంటుందా అనేది పెద్ద ప్రశ్న.ఇక ఈ యుద్ధం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఆంక్షలు తొలగితేనే ఆ దేశం ఆర్థికంగా కుదుటపడుతుంది. ఇరాన్ ఈ సందిగ్ద పరిస్థితినే ట్రంప్ ఆయుధంగా వాడుకుంటున్నారు.పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాలు ఇరాన్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది. అయితే, ఇరాన్ ఈ చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ఖండించింది. కాబట్టి ఈ ప్రణాళిక అమలు అవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి ట్రంప్ ప్రతిపాదించిన ఈ 15 పాయింట్లు ఇరాన్‌ను లొంగదీసుకుంటాయా? లేక పశ్చిమాసియాలో మరిన్ని మంటలు రేపుతాయా? అనేది వేచి చూడాలి.