
Trump’s warning to China: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల బెదిరింపులకు దిగారు. రష్యాతో చమురు వ్యాపారం ముగించకుంటే భారత్ భారీగా సుంకాలు చెల్లించాల్సి వస్తుందన్న ట్రంప్.. చైనాను హెచ్చరించారు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ వాణిజ్య వేదికపై అమెరికా , చైనాల మధ్య టారిఫ్‌లు, వాణిజ్యపరమైన ఆంక్షల రూపంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అరుదైన లోహ అయస్కాంతాల సరఫరాను అడ్డుకోవద్దని అమెరికా చైనాకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అమెరికా విధించిన టారిఫ్‌లకు ప్రతిచర్యగా ఈ కీలక లోహాల ఎగుమతులను నియంత్రించాలని చైనా చూస్తోంది. ఈ అరుదైన లోహాల ఉత్పత్తి, శుద్ధి ప్రక్రియలో చైనా ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయిస్తోంది.
ప్రపంచంలోని అరుదైన ఖనిజాల తవ్వకంలో దాదాపు 70%, వాటి శుద్ధిలో 90% వరకు చైనా నియంత్రిస్తోంది. ఈ ఏకఛత్రాధిపత్యం కారణంగా ఈ లోహాలపై ఎగుమతి నియంత్రణలను విధిస్తే అమెరికాపై చైనా గణనీయమైన ప్రభావాన్ని చూపగలదు. ఈ నేపథ్యంలో చైనా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి, టారిఫ్‌లను తగ్గించుకోవడానికి ఈ లోహాల నియంత్రణను ఒక ‘ట్రంప్ కార్డ్’గా ఉపయోగించుకోవాలని చూస్తోంది.
అరుదైన అయస్కాంత లోహాల వివాదం కేవలం వాణిజ్య పరమైన సమస్య కాకుండా ప్రపంచ భద్రత, సాంకేతిక ఆధిపత్యం, గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఈ లోహాలపై చైనాకున్న పట్టు దాన్ని ఒక శక్తివంతమైన భౌగోళిక రాజకీయ ఆయుధంగా మారుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇతర దేశాలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి తమ సొంత అరుదైన లోహాల సరఫరా గొలుసులను బలోపేతం చేసుకోవాలసి వస్తుంది. దీన్ని బేస్ చేసుకుంటూ చైనా ముందుకు సాగుతోంది. అయితే ఇందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు కీలక హెచ్చరికలు జారీ చేశారు.
నవంబర్ 1 నుంచి చైనా ఉత్పత్తులపై 155 శాతం వరకు అదనపు టారిఫ్‌లు విధించనున్నట్లు ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. వైట్ హౌస్‌లో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆల్బనీజ్‌తో సమావేశం సందర్భంగా ట్రంప్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. చైనాతో త్వరగా కొత్త వాణిజ్య ఒప్పందం కుదరని పక్షంలో ఈ నిర్ణయం తప్పదని తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం చైనా 55 శాతం టారిఫ్ చెల్లిస్తోందని, త్వరలో ఇది భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. “గతంలో అమెరికాను ఎన్నో దేశాలు ఉపయోగించుకున్నాయని, ఇకపై అలాంటివి సహించేది లేదని” ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ కఠిన వైఖరి చైనా అనుసరిస్తున్న “దౌర్జన్య వాణిజ్య దృక్కోణం”కు ప్రతిస్పందన అని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా తెలిపారు. ముఖ్యంగా, నవంబర్ 1 నుంచి అన్ని కీలక సాఫ్ట్వేర్లపై ఎగుమతి నియంత్రణలు కూడా అమలులోకి రానున్నట్లు తెలిపారు.
ప్రస్తుతమున్న 55 శాతం టారిఫ్‌లపై అదనంగా 100 శాతం టారిఫ్ విధించనున్నట్టు తెలిపారు, దీంతో మొత్తం టారిఫ్ 155 శాతానికి చేరుకుంటుంది. అమెరికాను గతంలో దోపిడీ చేసినట్లుగా భావిస్తున్న దేశాలపై ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో త్వరలో దక్షిణ కొరియాలో సమావేశమవుతున్నట్టు ట్రంప్ తెలిపారు. ఈ చర్చల ద్వారా “చైనాతో న్యాయంగా, గొప్ప ఒప్పందం చేసుకుంటాం. వారు సోయాబీన్లు కొనుగోలు చేయాలి. ఇది రెండు దేశాలకు, ప్రపంచానికి మంచిదే అవుతుంది” అని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో అమెరికా–ఆస్ట్రేలియా దేశాలు మౌలిక ఖనిజాలు, రక్షణ సహకారం కోసం 8.5 బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య సరఫరా భద్రత, శక్తి స్వావలంబన, రక్షణ సంబంధాలు మరింత బలపడతాయని ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీజ్ తెలిపారు. వాణిజ్య వివాదాల మధ్య అమెరికా తన మిత్ర దేశాలతో రక్షణ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం ఈ సమావేశంలో ప్రధానాంశమైంది. Trump’s warning to China
అయితే, ఈ వాణిజ్య ఉద్రిక్తతల మధ్యే, ట్రంప్‌కు చైనాలో పర్యటించాల్సిందిగా ఆహ్వానం అందినట్లు తెలిపారు. “చైనాకు రావాలంటూ ఆహ్వానం వచ్చింది. త్వరలో అక్కడికి వెళ్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ఈ పరిణామం అమెరికా-చైనా వాణిజ్య చర్చల భవిష్యత్తుపై ఉత్కంఠను పెంచుతోంది. మరి ఏం జరుగుతోందో వేచి చూడాల్సిందే.