పాక్ వక్రబుద్ధి.. మళ్ళీ పాత బుద్ధే..!

Spread the love

అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూనే ఉంటాయి. ఒక పక్క శాంతిని వల్లెవేస్తూ మరోపక్క దాని దుష్టబుద్ధిని చూపించడం ఆ దేశానికి అలవాటుగా మారింది. ప్రపంచ దేశాలేవీ పాక్ ను విశ్వసించే సాహసం చేయవనేది తెలిసిందే.  ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న కీలక చర్చల్లో సైతం ఇరాన్ అప్రమత్తంగా ఉండటానికి కారణం ఇదే. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఎప్పుడు మాట మారుస్తుందో తెలియని అయోమయం అక్కడ కనిపిస్తుంది. విశ్వాస ఘాతుకం  అనేది ఆ దేశ విదేశాంగ విధానంలో అంతర్లీనంగా ఉంటుందని  విశ్లేషకులు సైతం విమర్శిస్తారు. తాజాగా జరిగిన పరిణామాలు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. శాంతి చర్చలు అసంపూర్తిగా మిగిలిపోవడానికి ప్రధాన అడ్డంకి ఆ దేశ డబుల్ స్టాండర్డ్స్ అనే చర్చ నడుస్తోంది. చైనా మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం జరిగి జరగగానే  శాంతిని పునరుద్ధరిస్తామని మాటిచ్చిన రోజులలోనే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. బోర్డర్ లో కాల్పుల విరమణకు ఒప్పుకుని తిరిగి దాడులకు తెగబడడం అంతర్జాతీయ సమాజాన్ని విస్మయానికి గురిచేయడంతో పాటు పాకిస్తాన్ వైఖరిపైనా అసహ్యం కలిగించేలా చేస్తుంది.  ఆ దేశం ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా తన పాత పద్ధతులను మాత్రం వదులుకోవడం లేదు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఈ ఉల్లంఘన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చైనా లాంటి అగ్రరాజ్యం హామీ ఇచ్చినా సరే, పాకిస్తాన్‌లో వైఖరిలో మార్పు రాలేదని స్పష్టమవుతోంది. ఈ ఉద్రిక్తతలు ఇరుగుపొరుగు దేశాల మధ్య సంబంధాలను మరింత బలహీనపరుస్తున్నాయి.  ఆఫ్ఘనిస్తాన్‌లోని విద్యా దేవాలయంపై జరిగిన దాడి అమానుష చర్యగా నిలిచింది.  ఒక యూనివర్సిటీని టార్గెట్ గా చేసుకుని దాడులు చేయడంతో అమాయక విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ అమానుష దాడిలో ఏడుగురు మరణించగా, 85 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులకు పాల్పడింది తాము కాదని పాకిస్తాన్ బుకాయిస్తున్నా, సాక్ష్యాలు మాత్రం వేరేలా ఉన్నాయి. దాడి జరిగిన వెంటనే ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆఫ్ఘనిస్తాన్ ఆధారాలతో సహా ఆరోపిస్తుంటే, పాకిస్తాన్ మాత్రం ఎదురుదాడికి దిగుతోంది. తప్పు తన వైపు పెట్టుకుని పక్కవారిని వేలెత్తి చూపడం పాకిస్తాన్ కు మొదటి నుండి ఉన్న గుణమే. ఉగ్రవాదాన్ని ఏరివేస్తామంటూ పాకిస్తాన్ చేసే దాడుల్లో ఎప్పుడూ సామాన్య పౌరులే బలైపోతున్నారు. టీటీపీ స్థావరాల పేరిట సరిహద్దు గ్రామాల్లో జరిపే దాడులు పసిపిల్లలు, మహిళల ప్రాణాలను తీస్తున్నాయి. సొంత గడ్డపై పెంచి పోషించిన పాక్ కు ఇప్పుడు ఆ దేశానికే శాపంగా మారింది. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలు కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కావు. దక్షిణాసియా మొత్తానికి ఇది ఒక పెద్ద భద్రతా సమస్యగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా భారత్, చైనా వంటి పొరుగు దేశాల సరిహద్దు భద్రతపై కూడా దీని ప్రభావం పడుతోంది. ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగితే అది మొత్తం ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. పాకిస్తాన్ తన తీరు మార్చుకోనంత కాలం ప్రపంచ దేశాల్లో దానిమీద ఉన్న భావం తొలగదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *