జపాన్‌ లో చరిత్ర సృష్టించిన వృద్ధుల సంఖ్య, లక్ష మార్కును దాటిన శతాధిక వృద్ధులు

Spread the love

అత్యధికంగా 100 సంవత్సరాల వయసు వారు ఉన్న దేశంగా జపాన్ కు పేరున్న సంగతి తెలిసిందే. ఈ సెప్టెంబర్ లో  ఆ దేశంలో 100 అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారి సంఖ్య లక్ష దాటింది. ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించే ప్రజలు నివసించే దేశంగా తొలిసారిగా లక్ష మార్కును దాటడం ఆరోగ్య నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది. జపాన్ ఆరోగ్య, కార్మిక మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ 1 నాటికి దేశంలో 1,07,677 మంది వంద లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 7,914 మంది పెరిగింది. ఇలా శతాధిక వృద్ధుల జనాభా దేశంలో వరుసగా 56వ సంవత్సరం కూడా నిలకడగా పెరగడం కనిపిస్తోంది. 1963 సంవత్సరంలో జపాన్ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమ చట్టాన్ని మొదటిసారి అమలు చేసినప్పుడు దేశవ్యాప్తంగా కేవలం 153 మంది మాత్రమే 100 ఏళ్లు వృద్ధులు ఉండేవారు. ఆ తర్వాత కాలక్రమేణా ఈ సంఖ్య వేగంగా పెరుగుతూ వచ్చి, 1981 నాటికి వెయ్యికి, 1998 నాటికి పది వేలకు, 2012 నాటికి యాభై వేలకు చేరింది. అప్పటి నుండి నేటి వరకు ప్రతీ ఏడాదీ ఈ సంఖ్య స్థిరంగా పెరుగుతూ వస్తోంది. ఇక ఈ వృద్ధుల జాబితాలో మహిళల సంఖ్యే అత్యధికంగా ఉండటం విశేషం. దాదాపు 87.6 శాతానికి పైగా మహిళలే ఉన్నారు. పురుషుల సంఖ్య 13,379గా నమోదైంది. అంతేకాకుండా, రాబోయే ఆర్థిక సంవత్సరంలో మరో 54,294 మంది ప్రజలు వంద సంవత్సరాల మైలురాయిని అధిగమించనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ అసాధారణ దీర్ఘాయువును కాపాడుకునేందుకు జపాన్ ప్రభుత్వం 2019 సంవత్సరంలో ఒక ప్రత్యేక నేషనల్ టార్గెట్ ను పెట్టుకుంది. మరోవైపు ఈస్థాయిలో నమోదవుతున్న వయసుపైబడిన వారి గణాంకాలు దేశ ఆర్థిక, సామాజిక రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. వృద్ధుల జనాభా భారీగా పెరుగుతుండటంతో, హెల్త్  మరియు వెల్ఫేర్ సెక్టార్లు  ప్రభుత్వంపై ఆర్థిక భారం విపరీతంగా పెరుగుతోంది. పని చేసే యువ జనాభా క్రమంగా తగ్గిపోతుండటం అక్కడి ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారుతోంది. దేశంలో సంతానోత్పత్తి రేటు పడిపోతుండటం కూడా కలవరపెడుతోంది. ఈ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు జపాన్ ప్రభుత్వం అనేక ప్రత్యామ్నాయ చర్యలను పరిశీలిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *