
ఒకప్పుడు కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబమే గుర్తొస్తుంది.. సాయంత్రమైతే చాలు కుటుంబమంతా కథలూ, కబుర్లతో, కలిసి తినడంలో సమయమే తెలియకుండా హాయిగా గడిపేది. కానీ నేడు టెక్నాలజీ యుగంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రతీది మొబైల్ ఫోన్ లోనే.. ఆన్ లైన్ లోనే.
ప్రైవసీ ఎక్కువై.. కలిసి ఉండటం.. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి టైం అనేది దొరకడం లేదు.. దీంతో బంధాలు బీటలు వారి కుటుంబ వ్యవస్థ పూర్తిగా విఛ్ఛిన్నమైపోయింది. ఇప్పుడు మనిషికి రకరకాల వ్యాపకాలకు టైముంది. కానీ కుటుంబంతో కాసేపు ప్రశాంతగా కలసి కూర్చొనేందుకు మాత్రం సమయం లేదు.
అయితే ఇదిలాగే కొనసాగితే రాబోయే తరాలు మరింత దారుణంగా మారే పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి మనం మారాలి. రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలి. కుటుంబ విలువలను తెలియజెప్పాలి. పిల్లలు చూసింది నేర్చుకుంటారు. ముఖ్యంగా తమ తల్లిదండ్రుల్ని ఫాలో అవుతారు. కాబట్టి పరస్పరం వారు చూపించుకునే ప్రేమ, గౌరవం, ఇంట్లో జరిగే సంభాషణలు, పెద్దల పట్ల చూపే మర్యాద ఇవన్నీ వారిని నేరుగా, ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.
కాబట్టి మానవ సంబంధాలు డిజిటల్ సంబంధాలు అయిపోకుండా.. పిల్లలకు ఫోన్ బదులు వారితో టైం స్పెండింగ్, ఆటలు, క్రియేటివ్ యాక్టివిటీస్ తో బిజీ అయ్యేలా చేయాలి. తమ అనుభవాల్ని, ఎమోషన్స్‌నూ పంచుకోవడం, నేర్చుకోవడంలో సాయపడాలి. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించగలగడమే కుటుంబ వ్యవస్థ బలోపేతమయ్యే మార్గం కాబట్టి కుటుంబంలోని పెద్దలు ఎక్కువ సమయం పిల్లలకు కేటాయించగలగాలి. వారితో మాట్లాడాలి.
పెద్దలు యువతరం భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వారికి మార్గదర్శకంగా నిలవాలి. యువత కూడా పెద్దలను గౌరవించడం, వారి అనుభవాల నుంచి ప్రయోజనం పొందడం నేర్చుకోవాలి. అందరూ కలిసి టీ తాగడం, కలిసి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది పెద్ద పనేం కాదు. కానీ దీని ప్రభావం ఎంతో విశేషంగా, గొప్పగా ఉంటుంది.
మన జీవితంలో, సంస్కృతిలో, కుటుంబం అన్నది కేవలం ఒక భౌతిక రూపమే కాదు.. అదొక జీవిత సత్యం, జీవనతత్వం అని గుర్తెరిగి నడుచుకుంటే మానవ సంబంధాల్లో అన్యోన్యత పెరిగి.. అనుబంధాలు బాగుంటాయి.