
Jalebi and Samosa: జిలేబీ, సమోసా.. అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.. అయితే ఈ రకమైన వంటకాల్లో నూనె, చక్కెర స్థాయులు ఎక్కువగా ఉంటున్నాయని అందువల్ల సిగరెట్ ప్యాకెట్లపై పెట్టిన హెచ్చరిక బోర్డుల్లాగే.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు వార్తలు రావడం మనం చూసే ఉంటాం. కాగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని.. ప్రతి విషయం వైరల్ ఐపోతుంది. కాగా కేంద్రం ఈ వార్తల్ని పూర్తిగా కొట్టిపారేసింది. సాధారణ ఆరోగ్య సలహా మాత్రమే జారీ చేశామని, సంబంధిత వంటకాల పేర్లను ప్రస్తావించలేదని క్లారిటీనిచ్చింది. ఈ నేపథ్యంలో అసలు జిలేబీ, సమోసాలు నిజంగా భారతీయ వంటకాలేనా? ఇంకెక్కడినుంచైనా వచ్చాయా? అని చాలా మంది తెలుసుకోవడం మొదలుపెట్టారు? Jalebi and Samosa.
నిజానికి సమోసా అనేది మధ్యఆసియా, ఆఫ్ఘనిస్థాన్ ల నుంచి మన దేశానికి వచ్చింది. దీనిని అక్కడ ‘సంబుసా’గా పిలిచేవారు. పైగా లోపల స్టఫ్ గా ఆలు, ఆనియన్ వంటివి కాకుండా సమోసాను మాంసంతో నింపేవాళ్లు. ఇకపోతే 19-14 శతాబ్దాల కాలంలో ఢిల్లీ సుల్తాన్ల పాలనలో ఇది ఇండియాకు వచ్చింది. ఆ తర్వాత కాలంలో దానికి స్థానిక రుచులు తోడయ్యాయి. మాంసం బదులు బంగాళాదుంపలు, ఇతర కూరగాయలను సమోసాలో నింపడం మొదలు పెట్టారు. కొన్ని నివేదికల ప్రకారం.. భారత్ యేటా 2100 కోట్ల సమోసాలను విక్రయిస్తున్నట్లు అంచనా!
జిలేబీని కొందరు దేశీయ వంటకంగా చెబుతుంటారు. కానీ దీని మూలాలు పశ్చిమాసియాలోనివి. అక్కడ దీనిని ‘అలేబియా’ అని పిలిచేవాళ్లు. భారత్ కు ఈ వంటకు పరిచయం కాకముందు.. ఇరాన్, అరేబియా దేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. మొగల్ చక్రవర్తులు భారతదేశాన్ని పాలించిన 15వ శతాబ్దకాలంలో ఈ వంటకం భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే వంటకాల్లో ఒకటిగా పేరు గాంచింది. భారత్ లో యేటా 34కోట్ల జిలేబీ విక్రయాలు సాగుతున్నట్లు ఓ నివేదిక చెబుతోంది.
మరి ఇంత ఫేమస్ అయిన ఈ రెండు వంటకాలు.. ఇప్పుడు నిజంగా ఇవి ఆరోగ్యానికి హానికరమేనా? అంటే,
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. జిలేబీ, సమోసా, లడ్డూలలో అధిక మొత్తంలో నూనె, చక్కెరస్థాయులు ఉండటం వాస్తవమే. వీటిని మోతాదుకు మించి తీసుకుంటే ఆనారోగ్యానికి దారి తీయొచ్చు. ఉదాహరణకు ఒక గులాబ్ జామ్ లో దాదాపు నాలుగైదు టీస్పూన్ల చక్కెర ఉంటుంది. అదే ఒక సమోసాలో 11 నుంచి 12 గ్రాముల అయిల్ ఉంటుందని అంచనా. అలాంటి ఆహార పదార్ధాలు రోజూ తింటూ ఉంటే మటుకు ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. అలాగని వీటిపై నిషేదం విధించాలన్న ఆలోచన ప్రభుత్వాలకు లేదు. కాకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం చెబుతున్నాయి.