జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు 2026ను పార్లమెంటు ఆమోదించింది. కాగా, దీనిపై ప్రధాని మోడీ స్పందించారు. ‘జీవన సౌలభ్యం’ మరియు ‘వ్యాపార సౌలభ్యం’కు ఒక పెద్ద ప్రోత్సాహమని పేర్కొన్న ఆయన జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు 2026ను పార్లమెంటు ఆమోదించడం అత్యంత సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ బిల్లు రూపకల్పనకు తమ సూచనలు అందించి, పార్లమెంటులో దీనికి మద్దతు తెలిపిన వారందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. ఈ బిల్లు మన పౌరులకు సాధికారత కల్పించే విశ్వాస ఆధారిత వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. ఇది కాలం చెల్లిన నియమ నిబంధనలకు ముగింపు పలుకుతుందని అదే సమయంలో, ఇది కేసుల వేగవంతమైన పరిష్కారాన్ని నిర్ధారిస్తుందని పేర్కొన్నారు. ఈ బిల్లును సంప్రదింపుల విధానంతో రూపొందించడం కూడా గమనార్హం. భారత ప్రభుత్వం వ్యాపార సౌలభ్యం (Ease of Doing Business) మరియు జీవన సౌలభ్యాన్ని (Ease of Living) మెరుగుపరచడమే లక్ష్యంగా జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు, 2026″ని తీసుకువచ్చింది. దీని ప్రధాన ఉద్దేశ్యం చిన్నపాటి తప్పులకు లేదా సాంకేతిక లోపాలకు క్రిమినల్ శిక్షలను తొలగించి, వాటిని సివిల్ నేరాలుగా పరిగణించడం. ఈ బిల్లు ద్వారా దాదాపు 23 మంత్రిత్వ శాఖలకు చెందిన 79 చట్టాల్లోని 784 నిబంధనలను సవరించారు. ఇందులో భాగంగా సుమారు 717 నిబంధనల నుండి జైలు శిక్షను తొలగించి, వాటి స్థానంలో జరిమానాలను ప్రవేశపెట్టారు.