
Ahmedabad Plane Crash Uk Media report: అహ్మదాబాద్ విమానం తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఎంతోమంది చనిపోయారు. చనిపోయిన వారి డెడ్ బాడీలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు చేశారు. ఆ తర్వాత బంధువులకు అప్పగించారు. అయితే బ్రిటన్‌లోని బాధిత కుటుంబాలకు వారి బంధువుల మృతదేహాలు కాకుండా వేరే వారి మృతదేహాలు అందడంతో దుమారం రేగింది. అసలు మృతదేహాలు ఎందుకు మారిపోయాయి..? ఈ విషయాన్ని ఎలా కనిపెట్టారు.? మరి బ్రిటన్ కు పంపిన మృతదేహాలు ఎవరివి..? ఈ తప్పుపై అధికారులు ఏం అంటున్నారు.?
విమాన ప్రమాదంలో తమ వారు మరణించారనే బాధ ఒకవైపు.. కనీసం డెడ్ బాడీలను అప్పగిస్తే అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చనే ఆశ మరోవైపు. అయితే ఆ ఆశ నిరవేరలేదు సరికదా.. ఆ బాధ మరింత పెరిగింది. తమ వద్దకు చేరిన మృతదేహాలు తమ అయిన వారివి కాదని తెలిసి .. బంధువులు మరింత దుఖ:లో మునిగిపోయారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 260 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందులో 241 మంది విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది, 19 మంది విమానం కూలిన భవనంలోని స్థానికులు ఉన్నారు. గుజరాత్ ఆరోగ్య శాఖ నివేదికల ప్రకారం, ఇప్పటివరకు 260 మృతదేహాల్లో 259 మందిని గుర్తించి, వారి కుటుంబాలకు అప్పగించారు. ఈ గుర్తింపు ప్రక్రియలో 254 మందిని డీఎన్ఏ పరీక్షల ద్వారా, 6 మందిని ముఖ గుర్తింపు ఆధారంగా ధృవీకరించారు. అయితే, ఒక మృతదేహం ఇంకా డీఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తించబడలేదు. బ్రిటన్‌కు చెందిన 53 మంది బాధితుల మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు యూకే ప్రభుత్వం, వారి కుటుంబాలతో కలిసి ప్రత్యేక ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటివరకు 12 మృతదేహాలు భారత్ నుంచి యూకేకు తరలించబడ్డాయి.
అయితే బ్రిటన్‌లోని రెండు కుటుంబాలు తమకు అందిన మృతదేహాలు తమ కుటుంబ సభ్యులవి కావని అంటున్నాయి. లండన్‌లో కుటుంబ సభ్యుల డీఎన్ఏ నమూనాలతో మృతదేహాలను పరిశీలించగా, ఈ రెండు కేసుల్లో తప్పిదాలు బయటపడ్డాయి. ఒక కుటుంబానికి గుర్తుతెలియని మృతదేహం అందించడంతో అంతిమ సంస్కారాలను రద్దు చేసుకున్నారు. మరో కుటుంబానికి కూడా రెండు వేర్వేరు వ్యక్తుల మృతదేహ భాగాలు ఒకే పెట్టెలో పెట్టి అందడంతో వాటిని వేరు చేయాల్సిన దుర్భర పరిస్థితి ఎదురైంది. అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డీఎన్ఏ నమూనాల సేకరణ, లేబులింగ్‌లో జరిగిన లోపాలు, అధికంగా కాలిపోయిన మృతదేహాలను సరైన గుర్తించకుండా పెట్టెలలో ఉంచడం, కుటుంబ సభ్యులకు డీఎన్ఏ పరీక్షలు చేయకుండానే మృతదేహాలను తరలించడం వంటివి ఈ సమస్యకు కారణంగా తెలుస్తోంది. ఈ లోపాల వల్ల బాధిత కుటుంబాలు తీవ్ర మానసిక వేదనను ఎదుర్కొంటున్నాయి.
బ్రిటన్‌లో బాధిత కుటుంబాలు డీఎన్ఏ ఆధారిత గుర్తింపు కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. బ్రిటన్‌లోని స్థానిక కమ్యూనిటీలు, మానవ హక్కుల కార్యకర్తలు ఈ పొరపాటుపై స్పష్టత కోరుతున్నాయి. యూకే అధికారులు ఇప్పుడు డీఎన్ఏ పరీక్షలను తప్పనిసరి చేసి, ఖచ్చితమైన గుర్తింపు ప్రక్రియను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన బ్రిటన్‌లో మీడియా, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది, బాధితుల న్యాయం కోసం ఒత్తిడి పెరుగుతోంది. Ahmedabad Plane Crash Uk Media report.
భారత విదేశాంగ శాఖ తమ అధికారిక ప్రకటనలో మృతదేహాలకు పోస్టుమార్టం మెడికల్ గైడెన్స్ ప్రకారం, బాధితుల గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహించినట్లు తెలిపింది. మృతదేహాల గుర్తింపు ఉన్నత ప్రమాణాలతో జరిగిందని, యూకే అధికారులతో సమన్వయంతో సమస్యలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. డీఎన్ఏ గుర్తింపు, కుటుంబ సభ్యులతో సమన్వయం, అంత్యక్రియల నిర్వహణలో ఎయిర్ ఇండియా సహకారం అందించిందని వివరించారు. అయితే, యూకే న్యాయవాదులు, బాధిత కుటుంబాలు ఈ ప్రక్రియలో లోపాలపై పూర్తి విచారణ కోరుతున్నాయి. ఈ ఆరోపణలపై విచారణ, సహాయం కొనసాగిస్తామని భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ప్రస్తుతం 260 మృతదేహాల్లో 259 మందిని అధికారికంగా గుర్తించారు, కేవలం ఒక మృతదేహం డీఎన్ఏ ఫలితాల కోసం ఉంచారు. గుజరాత్ ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని ధృవీకరించింది. అటు ఈ ప్రమాదంపై దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇటీవల ప్రమాదంపై వస్తున్న అనేక ఫేక్ వార్తలపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ, లోక్‌సభలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రమాదంపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తాము నిజం తెలుసుకోవాలనుకుంటున్నాం. తుది నివేదిక వచ్చే వరకు ఎలాంటి అనుమానాలు, ఊహాగానాలకు తావు ఇవ్వకూడదు అని ఆయన స్పష్టం చేశారు. బ్లాక్ బాక్స్ డేటాను భారత్‌లోనే డీకోడ్ చేసినందుకు AAIBని ప్రశంసించారు, ఇది భారత విమానయాన రంగంలో పురోగతిని సూచిస్తుందన్నారు. అలాగే పైలట్లపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
ఈ ప్రమాదంపై విదేశీ మీడియా, ముఖ్యంగా ది వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ వంటి సంస్థలు పైలట్ తప్పిదమే కారణమని ఆరోపించాయి. బ్లాక్ బాక్స్ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో ఒక పైలట్ మరొకరిని ఇంధన సరఫరా ఎందుకు నిలిపావు? అని అడిగిన సంభాషణ ఆధారంగా విదేశీ వార్త సంస్థలు కొన్ని కథనాలు ప్రసారం చేశాయి. ఆ సమయంలో మరో పైలట్ తాను ఆఫ్ చేయలేదు అని సమాధానం ఇచ్చారు. ఈ సంభాషణ ఆధారంగా పైలట్ ఉద్దేశపూర్వకంగా ఇంధన సరఫరా నిలిపివేశాడని విదేశీ మీడియా వార్తలు రాసింది. రామ్మోహన్ నాయుడు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. విదేశీ మీడియా తమ స్వంత ఎజెండాతో కథనాలు ప్రచురిస్తోంది. AAIB దర్యాప్తును నమ్మండి, ఊహాగానాలకు పోకండి అని పార్లమెంట్‌లో అన్నారు. ఈ దుష్ప్రచారం భారత విమానయాన రంగంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆయన హెచ్చరించారు.