అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్నఉద్రిక్తతలు ఒక సున్నితమైన ప్రాంతాన్ని మరింత విస్తృతమైన ఘర్షణ వైపు నెట్టుతున్నాయని దాదాపు ఒక కోటి మంది భారతీయులతో సహా, కోట్ల మంది ప్రజలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. భద్రతాపరమైన ఆందోళనలు వాస్తవమైనవే అయినప్పటికీ, సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తాయన్నారు. ఇరాన్ పై జరుగుతున్న ఏకపక్ష దాడులతో పాటు, ఇతర మధ్యప్రాచ్య దేశాలపై ఇరాన్ చేస్తున్న దాడులను కూడా ఖండించాల్సిందేనని రాహుల్ స్పష్టం చేశారు. హింస హింసకు దారితీస్తుందని చర్చలు మరియు సంయమనం మాత్రమే శాంతికి ఏకైక మార్గమని పేర్కొన్నారు.
భారతదేశం నైతిక స్పష్టతతో ఉండాలి. అంతర్జాతీయ చట్టాలను మరియు మానవ ప్రాణాలను కాపాడటంలో మనం స్పష్టంగా మాట్లాడే ధైర్యాన్ని ప్రదర్శించాలని అన్నారు. మన విదేశీ విధానం సార్వభౌమాధికారం మరియు వివాదాల శాంతియుత పరిష్కారంపై ఆధారపడి ఉందని అది అలాగే కొనసాగాలన్నారు. ప్రధాని మోదీ తప్పనిసరిగా స్పందించాలన్నారు. ప్రపంచ క్రమాన్ని నిర్ణయించడానికి ఒక దేశాధినేతను హత్య చేయడాన్ని ఆయన సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు మౌనంగా ఉండటం ప్రపంచ దేశాల ముందు భారతదేశం యొక్క ప్రతిష్టను తగ్గిస్తుందని పేర్కొన్నారు.