
శత్రువులను దెబ్బతీయాలంటే ఎత్తుకు పై ఎత్తు వేయాలి. ఈ యత్తు ఎలా ఉండాలంటే శత్రువు .. మరోసారి కోలుకోకుండా ఉండాలి. పాకిస్థాన్ పై భారత్ దాడులు చేసినప్పుడు వేసిన ఓ వ్యూహం.. ఇప్పుడు సంచలనంగా మారింది. పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నా.. ఆ దేశ సైనిక స్థావరాలపై భారత్ ఎలా దాడి చేయగలిగింది..? పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఎలా మోసగించారు..? తప్పుడు సమాచారంతో పాకిస్థాన్ ను ఎలా బురిడి కొట్టించారు..? తెలుసుకుంటే భారత్ తెలివితేటలకు శభాస్ అనాల్సిందే.
సినిమాల్లో హీరోలు.. విలన్స్ చిత్తు చేయడానికి ఎత్తుకు పై ఎత్తు వేస్తారు. స్టోరీ ఎలా ఉన్నా.. ఆ ఎత్తులు, వ్యూహాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అయితే భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో భారత్ దాడులు చేసి.. పాక్ సైనిక స్థావరాలను ధ్వంసం చేయడానికి ఓ వ్యూహాన్ని పన్నింది. తాజాగా ఆ విషయం వెలుగులోకి వచ్చింది. అసలు భారత్ ఏం చేసింది..? ఎలా పాకిస్థాన్ ను దెబ్బకొట్టిందో తెలిస్తే ప్రతీ ఒక్కరికీ గూస్ బంప్స్ రావడం ఖాయమే.
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ ఎంత సంయమనం పాటించిన పాకిస్తాన్ తన దుందుడుకు చర్యలతో భారత్ పై దాడులకు తెగబడింది. భారత్ సరిహద్దుల్లోని పౌరులే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. వీటిని భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీటుగా ఎదుర్కొంది. అయితే పాకిస్థాన్ కు బుద్ధి చెప్పాలని ప్రతీకార దాడులకు దిగింది భారత్. పాక్‌ను చావుదెబ్బ తీయాలని నిర్ణయంచిన భారత్.. మే 10వ తేదీన ఓ ఎరను దానిపై విసిరింది. అనుకున్నట్లే ఆత్రంగా స్పందించిన పాకిస్థాన్.. భారత్‌కు అడ్డంగా దొరికిపోయి చావు దెబ్బతింది. చైనా విమానాలు.. తుర్కియే డ్రోన్లు అంటూ ఏవో మీడియా గంభీర ప్రకటనలు చేసిన పాక్.. దెబ్బకు కాళ్లబేరానికి వచ్చింది. అత్యంత నాటకీయంగా జరిగిన ఈ పరిణామాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
మే 9-10వ తేదీ రాత్రివేళల్లో భారత్‌లోని పౌర నివాసాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న పాక్.. డ్రోన్లు, ఇతర ఆయుధాలతో దాడి చేసింది. దీంతో ఇక ఏమాత్రం ఊపేక్షించకూడదు అనుకున్న భారత్ పాక్ కీలక స్థావరాలను ధ్వంసం చేయాలని నిర్ణయించింది. అయితే భారత్ దాడులు చేయడానికి పాకిస్థాన్ లోని హెచ్‌క్యూ-9 గగనతల రక్షణ వ్యవస్థ అడ్డంకిగా మారిందని గుర్తించి వెంటనే.. తన డికాయ్ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. వాయుసేన ఫైటర్ జెట్లను తలపించేలా సంకేతాలు పంపే కొన్ని రకాల డ్రోన్లను గాల్లోకి వదిలింది. ఇవి అచ్చు ఫైటర్ జెట్లను పోలి.. అలాంటి సిగ్నిల్స్ నే పంపిస్తాయి. ఇంకేముంది భారత ఫైటర్ జెట్లు దొరికాయనుకుంటూ హెచ్‌క్యూ-9, సహా ఇతర రాడార్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పాక్ యాక్టివేట్ చేసింది. దీంతో ఇవి మోహరించిన ప్రదేశాలను గుర్తించిన భారత్.. హరూప్ తరహా ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించడంతో పాక్‌కు రాడార్ వ్యవస్థ దెబ్బతింది. ఆ వెంటనే పశ్చిమ, నైరుతీ కమాండ్ల నుంచి ఫైటర్ జెట్లు బ్రహ్మోస్, స్కాల్ప్, క్రిస్టల్ మేజ్, ర్యాపేజ్ వంటి ఆయుధాలను భారత్ ప్రయోగించింది. ఇవి ఎటువంటి అడ్డంకీ లేకుండా పాక్ వైమానిక దళ స్థావరాల పైకి దూసుకెళ్లాయి. వీటిల్లో బలమైన షెల్టర్లు, రన్‌వేలు, కమాండ్ సెంటర్లను దెబ్బతీసే పనిని బ్రహ్మోస్ చూసుకుంది. ఈ దాడి తర్వాత పాక్ తమ యుద్ధవిమానాలను సుదూరంలోని ఎయిర్ బేస్‌లకు మార్చేసింది. ఈ దాడికి సుమారు 15 బ్రహ్మోస్ క్షిపణులు వాడినట్లు అంచనా. మొత్తం మీద పాక్‌కు ఉన్న 12 అత్యంత కీలక ఎయిర్ బేసుల్లో 11ను భారత్ దెబ్బతీసింది.
అయితే భారత్ వేసిన ప్లాన్.. భారత్ పైనే ప్రయోగించాలని టర్కీ.. పాకిస్థాన్ ప్రయత్నించాయి. నాగోర్నో-కారోబాఖ్ యుద్ధ సమయంలో అజర్‌బైజన్ కూడా సోవియట్ కాలం నాటి ఏఎన్-2 యుద్ధ విమానాలను డ్రోన్లుగా మార్చి.. అర్మేనియాపై తొలుత ప్రయోగించింది. దాని ఎయిర్ డిఫెన్స్‌లు వాటిని కూల్చాయి. ఈ సమయంలో అజర్‌బైజన్ దళాలు ఆ గగనతల రక్షణ వ్యవస్థ స్థావరాలను గుర్తించి వాటిపై దాడి చేశాయి. దీంతో అర్మేనియా గగనతలానికి రక్షణ లేకుండాపోయింది. అనంతరం అజర్‌బైజన్ డ్రోన్లు విజృంభించి విజయం సాధించాయి. దీనికి టర్కీ వ్యూహరచన చేసింది. తాజాగా భారత్‌పై అలా చేద్దామని పాక్ చూసింది. మే 6-7 తేదీల్లో భారత్ పైకి వందల కొద్దీ టర్కీ డ్రోన్లు పంపి.. ఎయిర్ డిఫెన్స్‌లను గుర్తించేందుకు యత్నించింది. కానీ, మన వ్యవస్థలు వాటిని కుప్పకూల్చి.. పాక్ వ్యూహాన్ని చిత్తు చేశాయి. కానీ, 10వ తేదీన భారత్ ఇలాంటి వ్యూహంతోనే డ్రోన్లు పంపి.. దాని గగనతల రక్షణ వ్యవస్థను కూల్చేసింది.
ఇలాంటి వ్యూహాలను సైనిక భాషలో డికాయ్ ఆపరేషన్ అంటారు. ఇందులో శత్రువును గందరగోళానికి గురిచేయడం, తప్పుదారి పట్టించడం ద్వారా వారి రక్షణ వ్యవస్థలను నాశనం చేయడం జరుగుతుంది. ఈ ఆపరేషన్లలో సాధారణంగా ఫేక్ లక్ష్యాలు, సంకేతాలు, డ్రోన్లు, విమానాల వంటివాటిని ఉపయోగించి శత్రువు రాడార్, గగనతల రక్షణ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తారు. శత్రువు తన రక్షణ వ్యవస్థల స్థానాలను యాక్టివేట్ చేసిన తర్వాత, వాటిని లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేయడం ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం. అంటే ఏదైనా ఒక చిన్న డ్రోన్ ను పంపితే .. దానిని శత్రువు ఎక్కడి నుంచి కూల్చుతున్నాడో తెలుసుకుని.. దానిని ధ్వంసం చేయడం ఇందులో ప్రధాన లక్ష్యం. డికాయ్ ఆపరేషన్లు సాధారణంగా ఎయిర్ ఫైట్, నౌకాదళ ఆపరేషన్లు, భూ ఆధారిత సైనిక చర్యలలో ఉపయోగించబడతాయి.
ఆపరేషన్ సిందూర్ తర్వాతే కాదు.. గతంలోనూ భారత్ అనేక డికాయ్ ఆపరేషన్లు చేసి.. పాకిస్థాన్ బురిడీ కొట్టింది. 1971 భారత్ ఆపరేషన్ ట్రైడెంట్ చేపట్టి పాకిస్థాన్ ను తప్పుదోవ పట్టించింది. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధంలో, భారత నావికాదళం కరాచీ రేవుపై దాడి చేసేందుకు ఆపరేషన్ ట్రైడెంట్‌ను చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో డికాయ్ వ్యూహం కీలక పాత్ర పోషించింది. భారత నౌకలు సోవియెట్ తయారీ స్టిక్స్ క్షిపణులను ఉపయోగించి పాకిస్తాన్ నౌకలను లక్ష్యంగా చేసుకున్నాయి. పాకిస్తాన్ డిస్ట్రాయర్ నౌక ఖైబర్, భారత నౌకల నుంచి వచ్చిన క్షిపణులను యుద్ధ విమానాల దాడిగా భావించి, తన విమాన విధ్వంసక వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. దీని వల్ల ఖైబర్ లోకేషన్ తెలిసిపోయి, భారత నౌకలు దానిని సులభంగా ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్‌లో భారత్ ఎలాంటి నష్టం లేకుండా పాకిస్తాన్ నౌకాదళానికి తీవ్ర నష్టం కలిగించింది, దీని స్మారకంగా భారత్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న నావికా దినోత్సవం జరుపుకుంటుంది. ఇలానే 1984 లో చేపట్టిన ఆపరేషన్ మేఘదూత్ కూడా ఒక డికాయ్ ఆపరేషన్ గా చెప్పొచ్చు. సియాచెన్ ప్రాంతంపై నియంత్రణ సాధించేందుకు భారత సైన్యం 1984లో ఆపరేషన్ మేఘదూత్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో డికాయ్ వ్యూహం కొంతవరకు ఉపయోగించబడింది. ఎందుకంటే భారత సైన్యం పాకిస్తాన్ రాడార్లను తప్పించుకునేందుకు రహస్యంగా దళాలను మోహరించింది. లెఫ్టినెంట్ డి.కె. ఖన్నా నేతృత్వంలోని దళాలు పాకిస్తాన్ రాడార్ నుంచి తప్పించుకునేందుకు జోజి లా పాస్ గుండా నడిచి వెళ్లాయి. దీని వల్ల భారత్ సియాచెన్ గ్లేసియర్‌పై పూర్తి నియంత్రణ సాధించింది. ఈ ఆపరేషన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధరంగంలో జరిగిన విజయవంతమైన చర్యగా పరిగణించబడుతుంది. భారత్ ఈ వ్యూహాన్ని 1971, 1984, 2019లో విజయవంతంగా ఉపయోగించింది. డికాయ్ ఆపరేషన్లు శత్రువును తప్పుదారి పట్టించడంలో, వారి రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.