
Kohinoor Diamond Real Story: కాకతీయుల ఆస్తి…మొఘల్ సామ్రాజ్యపు వైభవం…అఫ్ఘాన్ రాజ్యాల అధికారానికి, వారసత్వానికి చిహ్నం…వారి అంతానికి సాక్షం …సిక్కుల సార్వభౌమత్వానికి ప్రతీక… బ్రిటిష్ రాజకుటుంబ అధికార చిహ్నం…కోహినూరు వజ్రం. కోహినూర్..ఇది కేవలం ఒక వజ్రం మాత్రమే కాదు..శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైమండ్. కోహినూర్ పేరు తెలియని వారుండరేమో కానీ..దాని చరిత్ర గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కోహినూర్ డైమండ్‌పై పవన్ చేసిన కామెంట్స్ తో ప్రస్తుతం ఈ వజ్రం గురించిన విషయాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. దీని చరిత్ర తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ వెలకట్టలేని భారత చరిత్రకు నిలువెత్తు సాక్ష్యమైన ఈ వజ్రం కొల్లూరు గనుల నుంచి మొఘలుల చేతికి ఎలా వచ్చింది? తెలుగు నేలపై లభించిన కోహినూర్ వజ్రం ఇప్పుడు ఎక్కడో లండన్ లో ఉన్న బ్రిటిష్ మహారాణి కిరీటంలోకి ఎలా చేరింది? ఎన్నోరాజ్యాల వినాశనాలను, పతనాలను చూసిన కోహినూర్ డైమండ్ రియల్ స్టోరీ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.
కోహినూర్ వజ్రం కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా. బెల్లంకొండ మండలంలోని కొల్లూరు గనులలో ఈ వజ్రం దొరికిందని చరిత్రకారులు చెప్తారు. ఒకప్పుడు భారతదేశంలో అతి విలువైన వజ్రాలు ఈ గనుల్లోనే లభించేవి. 19 శతాబ్దం వరకూ ఇక్కడ వజ్రాల వేట విస్తృతంగా కొనసాగేది. అయితే ఇప్పుడు ఆ ప్రాంతం పులిచింతల ప్రాజెక్టులో భాగంగా మునిగిపోయింది. కాకతీయ సామ్రాజ్య కాలంలో కొల్లూరు గనుల్లో దొరికిన భారీ వజ్రం గురించి ఆనాటి రాతల్లో ఉంది. కోహినూర్ మొదటి యజమానులు కాకతీయులేనని కొందరు చరిత్రకారులు చెబుతారు. ఆ కాలంలో ఈ వజ్రమే వారి కులదేవతగా ఉండేదంటారు. వరంగల్‌లో ఉన్న భద్రకాళి అమ్మవారి ఆలయంలో అలంకరణగా కోహినూర్ వజ్రం ఉండేదంటారు మరికొందరు. ఇంకొందరు అమ్మవారికి ఎడమ కన్నుగా ఉండేదని చెబుతారు. ఇలా ఇన్ని ఊహాగానాలు ఈ వజ్రం చుట్టూ తిరుగుతున్నాయి.
కాకతీయ సామ్రాజ్యపు చివరి రాజు ..రాజా ప్రతాపరుద్రుడి. ఈయన పాలన కాలంలో కోహినూర్ వజ్రం తురుష్కుల చేతుల్లోకి వెళ్లిపోయిందని తెలుస్తోంది. తురుష్కులు కాకతీయ సామ్రారాజ్యంపై 8 సార్లు దండెత్తినట్లు ఆనాటి శాసనాలు చెబుతున్నాయి. ముస్లిం చరిత్రకారుల రచనల్లో 5 సార్లు దండయాత్ర చేసినట్లు ఉన్నాయి. ఢిల్లీ సుల్తాను అల్లాఉద్దీన్ ఖిల్జీ 1304 లో కాకతీయ రాజ్యంపైకి మాలిక్ కాఫుర్‌ను యుద్ధానికి పంపించాడు.ఆ క్రమంలో కాఫుర్‌తో ప్రతాపరుద్రుడు సంధి చేసుకున్నాడని అందులో భాగంగానే అపారమైన సంపదను ఆయనకు అప్పగించారని అందులో కోహినూర్ వజ్రం కూడా ఉందని చరిత్రకాలు చెబుతారు.
14వ శతాబ్దం మొదలు నుంచి ఖిల్జీ రాజల దగ్గరే ఈ వజ్రం ఉండేదట. ఆ తర్వాత 1526 లో ఇబ్రహీం లోడీని మొఘల్ రాజు బాబర్ ఓడించి ఈ వజ్రాన్ని చేజిక్కించుకున్నాడు. ఈ వజ్రాన్ని సుల్తాన్ ఇబ్రహీం లోడి బహుమతిగా ఇచ్చాడని బాబర్ నామా లో బాబరే ప్రత్యేకంగా రాశాడు . ప్రపంచం మొత్తంమీద ఒక్క రోజు ఉత్పత్తి అయ్యే సంపద..కోహినూర్ వజ్రంతో సమానమని ఆనాడే బాబర్ తెలిపాడంటే…ఈ వజ్రం విలువ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. బాబర్ తర్వాత కోహినూర్ డైమండ్ తాజ్ మహల్ నిర్మించిన షాజహాన్ చేతికి చేరింది. షాజహాన్ ఈ వజ్రాన్ని తన నెమలి సింహాసనంలో పొందుపరిచాడు. ఢిల్లీ ఎర్ర కోటలోని దివాన్-ఇ- ఖస్‌లో ఈ నెమలి సింహాసనాన్ని ఏర్పాటు చేశారు. ఆనాడు మొఘలులు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా ఉండేవారు. అలా ఈ డైమండ్ బాబర్ నుంచి మొఘల్ చక్రవర్తులైన హుమాయూన్, షాజహాన్, ఔరంగజేబు వంటి వారి చేతులు మారుతూ వచ్చింది.
1739లో పర్షియన్ రాజు నాదిర్ షా భారత్ పై దండయాత్ర చేశాడు. ఢిల్లీని జయించి, మొఘలుల సంపదను దోచుకెళ్లాడు. అంతే కాదు అత్యంత ఖరీదైన వజ్రాన్ని నాదిర్ చేతుల్లో పెట్టాడు సుల్తాన్ మహమ్మద్. ఆ వజ్రం నాణ్యత, మెరుపును చూసి దానికి కోహినూర్ అని పేరు పెట్టాడు. కోహినూర్ అంటే వెలుగులు విరజిమ్మే కొండ అని అర్థం. అంతకుముందు వరకూ ఈ వజ్రాన్ని శమంతక మణి అని పిలిచేవారట. ద్వాపర యుగంలో సత్యభామ తండ్రి దగ్గర ఉన్న మణి ఇదేనని కొంత మంది చెబుతుంటారు. కోహినూర్ ను ఎత్తుకెళ్లిన నాదిర్ షా తన బంగారు సింహాసనంలో ఈ వజ్రాన్ని చేర్చాడని అంటారు. ఆ తర్వాత 1747లో నాదిర్ షాను దారుణంగా చంపేశారు. అప్పుడు కోహినూర్ వజ్రం..నాదర్ జనరల్స్‌లో ఒకడైన అహ్మద్ షా దుర్రాని చేతుల్లోకి వెళ్లింది. ఆఫ్గానిస్థాన్‌లో దుర్రాని సామ్రాజ్యాన్ని స్థాపించింది అహ్మద్ షా దుర్రానే . ఇక్కడే దాదాపు 70 ఏళ్ల పాటు కోహినూర్ ఉంది. Kohinoor Diamond Real Story.
1813లో ఈ వజ్రాన్ని అహ్మద్ షా దుర్రాన్ని వారసుడు..షుజా దుర్రాని తిరిగి భారత దేశానికి తీసుకువచ్చాడు. సిక్కు రాజ్యాం స్థాపించిన మహారాజా రంజిత్ సింగ్‌కు ఈ వజ్రాన్ని ఇచ్చాడు. అందుకు ప్రతిఫలంగా అఫ్గాన్ రాజ్యాన్ని షా షుజా దుర్రాని దక్కించుకోవడానికి రంజిత్ సింగ్ సహాయం చేశాడు. ఆనాడు సిక్కుల స్వయం ప్రతిపత్తికి కోహినూర్ ఓ సింబల్‌గా మారింది. ఆ తర్వాత 1849లో రెండో ఆంగ్లో సిక్కు యుద్ధంలో.. బ్రిటిష్‌ర్లు పంజాబ్‌ను పూర్తిగా కైవసం చేసుకున్నారు. ఎంతో విలువైన సంపదను స్వాధీనం చేసుకున్నారు. మహారాజు రంజిత్ సింగ్ చనిపోవడంతో ఆయన భార్య రాణీ జిందన్‌ను ఖైదు చేశారు. ట్రిటీ ఆఫ్ లాహోర్ పేరుతో యువరాజు దులీప్‌సింగ్‌తో.. బ్రిటీషర్లు సంతకాలు చేయించుకున్నారు. దీంతో కోహినూర్ అధికారికంగా వలసదారుల సొంతమైపోయింది. మన దేశం నుంచి బలవంతంగా లాక్కున్న కోహినూర్ ను బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ ఖజానాకు చేరింది. అక్కడి నుంచి ఇంగ్లండ్ కు వెళ్లింది. మన దేశం నుంచి కోహినూర్‌ను..లండన్ కు తీసుకువెళ్లే క్రమంలో ఎన్నో విచిత్రమైన సంఘటనలు జరిగాయని చరిత్ర చెబుతోంది. భారీ నౌకలో వెళ్తున్న సిబ్బందికి కలరా వచ్చిందట. దీని ప్రభావంతో ఎంతో మంది చనిపోయారట.
1850లో చివరగా క్వీన్ విక్టోరియా చెంతకు ఈ విలువైన భారత సంపద చేరింది. కోహినూర్ చరిత్ర తెలిసి దాన్ని కొన్నాళ్లు లండన్‌లో ప్రదర్శనకు ఉంచారు.ఆ తర్వాత దాని మెరుపు తగ్గిందని భావించిన క్వీన్ విక్టోరియా.. 1852లో డచ్ స్వర్ణకారులతో ఈ వజ్రానికి మెరుగులు దిద్దించారు. దీంతో 186 క్యారెట్లుగా ఉన్న కోహినూర్ విలువ 108.93 క్యారట్లకు తగ్గిపోయిందంటారు. ఇదిలా ఉంటే ఈ వజ్రాన్ని ధరించిన రాజులందరూ కాలగర్భంలో కలిసిపోయారని తెలుసుకున్నారు క్వీని విక్టోరియా. దీంతో తమ వారసులెవరూ ఈ వజ్రాన్ని ధరించకుండా జాగ్రత్త పడ్డారు. అందుకోసం ఓ వీలునామా రాశారు. ఆ వీలునామాలో రాజులు ఈ వజ్రాన్ని ధరించవద్దని..ఒకవేళ రాజులు పాలిస్తుంటే..కోహినూర్ ధరించే హక్కు రాణులకు ఉంటుందని రాశారు . క్వీన్ విక్టోరియా మరణానంతరం..కోహినూర్‌ను కేవలం రాణులు మాత్రమే ధరించారు. క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ, క్వీన్ ఎలిజబెత్-2 కిరీటంలో కోహినూర్‌ను ధరించారు. అయితే ఈ వజ్రం చుట్టూ ఉన్న వివాదాలు, దౌత్యపరమైన అంశాల నేపథ్యంలో కింగ్ చార్లెస్ పట్టాభిషేకం సమయంలో ఆయన భార్య క్వీన్ క్యామిలా ఈ కిరీటాన్ని ధరించలేదు.
మన దేశ విలువైన సంపదన..శతాబ్దాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన కోహినూర్ ప్రస్తుతం బ్రిటన్‌లోని టవర్ ఆఫ్ లండన్‌లో ఉంది. ఈ కోహినూర్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కొన్నేళ్లుగా విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇదే క్రమంలో ఈ వజ్రం చుట్టూ ఎన్నో వివాదాలు అలుముకున్నాయి. కోహినూర్ తమదేనని, తిరిగి ఇవ్వాలని భారత్ చేసిన విజ్ఞప్తి చేస్తుంటే దానిని తిరిగి ఇచ్చేందుకు బ్రిటిష్ ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఇదిలా ఉంటే మరోపక్క కోహినూర్ మాదేనంటూ భారత్ తో పాటు ఇటు పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్, ఇరాన్ కూడా వాదిస్తున్నాయి. కోహినూర్ వజ్రం తమ వారసత్వ హక్కు అని చెబుతున్నాయి. మరి కోహినూర్ ఎవరి సొంతం. దీనిని అందుకోవాలంటే యుద్ధాలు జరగాల్సిందేనా? ఆధునిక మానవ చరిత్రకు సజీవ సాక్షంగా నిలుస్తున్న కోహినూర్.. భవిష్యత్తులో మరెన్ని యుద్ధాలు, ఇంకెన్ని పతనాలకు సాక్షిగా నిలుస్తుందో..!వేచి చూడాల్సిందే.