నేడు లోక్ సభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయి. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్ ఈరోజు సభలో ప్రవేశపెట్టారు. ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. ఇందుకోసం 10 గంటల సమయం కేటాయించారు. అనంతరం తీర్మానంపై ఓటింగ్ చేపట్టనున్నారు. దీనిపై చర్చ సందర్భంగా సభను నడిపేందుకు ప్రత్యేక సభాపతిని నియమించాలని విపక్షాలు కోరాయి. దీనికి అంగీకరించిన కేంద్రం సీనియర్ ఎంపీ, ఛైర్పర్సన్స్ ప్యానెల్ సభ్యుడు జగదాంబికా పాల్ ను నియమించింది. ఆయన నేతృత్వంలో అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో చర్చ జరుగుతోంది. చర్చ తర్వాత అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ తీర్మానం ఆమోదం పొందాలంటే సాధారణ మెజార్టీ అయిన 272 ఓట్లు కావాలి. ప్రస్తుతం లోక్ సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 293 నెంబర్ ఉంది. ప్రతిపక్షాలకు 238 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో విపక్షాలు ఈ తీర్మానం నెగ్గే అవకాశాలు దాదాపు అసాధ్యంగా చెప్పొచ్చు.