ఉగ్ర ముద్ర.!

Spread the love

Salman Khan: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ కు ఘోర అవమానం జరిగింది. గత కొన్ని రోజులుగా దాయాదీ దేశం పాకిస్థాన్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆయన. పాక్ మరో అడుగు ముందుకేసింది. హీరో సల్మాన్ ఖాన్ ఏకంగా ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆ దేశ చట్టాల ప్రకారం.. ఆయన్ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఏం జరిగింది? పాకిస్థాన్ సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటీ? తెలుసు కోవాలంటే లెట్స్ వాచ్ నౌ

ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌‌పై గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ గుర్రుగా ఉంది. ఆయనపై పాక్‌ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సల్మాన్‌‌ను ఉగ్రవాదిగా ప్రకటించినట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దాని ప్రకారం.. ఆయన్ను ఒక టెర్రరిస్ట్‌గా ముద్రవేశారు.

సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్‌పై చేసిన వ్యాఖ్యల కారణంగా పాకిస్తాన్‌లో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనపై యాంటీ-టెర్రరిజం యాక్ట్ 1997లోని 4వ షెడ్యూల్ కింద కేసు నమోదు చేసినట్లు పలు నివేదికలు తేలింది. ఉగ్రవాదంతో సంబంధాలున్నాయని అనుమానం ఉన్న వ్యక్తుల జాబితా ఇది. 4వ షెడ్యూల్‌లో చేర్చడం అంటే నటుడి కదలికలపై నిశితంగా పర్యవేక్షించడం, ఆంక్షలు విధించడం మరియు చట్టపరమైన చర్యలకు ఛాన్స్ ఉంటుంది. సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన ‘జాయ్ ఫోరమ్ 2025’లో షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్‌తో కలిసి పాల్గొన్న సల్మాన్, మధ్యప్రాచ్యంలో భారతీయ సినిమా పెరుగుతున్న ప్రజాదరణ గురించి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు.

సల్మాన్ ఖాన్ ఇటీవల సౌదీ వేదికగా జరిగిన జాయ్ ఫోరమ్ 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సల్మాన్ బలూచిస్తాన్, పాకిస్తాన్‌ను వేరు చేసి సంబోధించారు. ‘ప్రస్తుతం.. మీరు ఒక హిందీ ఫిల్మ్ తీసి.. అది సౌదీ అరేబియాలో రిలీజ్ చేస్తే.. సూపర్‌హిట్ అవుతుంది. ఒక తమిళ్, తెలుగు లేదా మలయాళీ సినిమా తీసినా.. అది రూ. వందల కోట్ల వ్యాపారం చేస్తుంది. ఎందుకంటే వివిధ దేశాల నుంచి చాలా మంది సౌదీకి వచ్చారు. బలూచిస్తాన్ నుంచి వచ్చారు. ఆఫ్గానిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి కూడా వచ్చిన ప్రజలు ఇక్కడ పని చేస్తున్నారు’ అని సల్మాన్ ఖాన్ అన్నారు.

బలూచిస్తాన్‌ను ఒక దేశం అన్న అర్థంలో సంబోధించడంతో.. కొద్ది సేపటికే సోషల్ మీడియాలో ఆ క్లిప్ వైరల్ అయింది. తీవ్ర చర్చకు దారితీసిని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు.. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అగ్గిమీద గుగ్గిలం చేశాయి. బలూచిస్తాన్‌, పాకిస్థాన్‌లను సల్మాన్‌ఖాన్‌ వేర్వేరుగా చెప్పడం ఏంటి అంటూ భగ్గుమంది దాయాది. పాకిస్థాన్‌కు చెందిన బలూచిస్థాన్‌ను ఇలా వేరు చేసి మాట్లాడటం ఏంటి అంటూ అక్కడి మీడియా సల్మాన్‌పై తీవ్ర విమర్శలు చేసింది.

బలూచిస్తాన్‌ వేర్పాటువాద నాయకులు మాత్రం సల్మాన్‌ చేసిన ప్రకటనను స్వాగతించారు. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ప్రముఖ న్యాయవాది మీర్ యార్ బలూచ్.. సల్మాన్ చేసిన వ్యాఖ్యలు ఆరు కోట్ల బలూచిస్తాన్‌ ప్రజలకు ఆనందాన్ని కలిగించాయన్నారు. ఈ మేరకు సల్మాన్ ఖాన్‌కు కృతజ్ఞత తెలిపారు. ఇలా మాట్లాడేందుకు చాలా దేశాలు వెనకడుగు వేసిన వేళ.. సల్మాన్ మద్దతు ఇవ్వడం సంతోషకరమన్నారు. బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రపంచం గుర్తించేందుకు సల్మాన్ కామెంట్ దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

బలూచిస్తాన్ – పాకిస్తాన్‌లో భూభాగం పరంగా (46%) అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ, జనాభాలో కేవలం 6% మాత్రమే ఉంది. ఈ ప్రాంతం చాలా కాలంగా రాజకీయ మరియు సామాజిక అశాంతికి కేంద్రంగా ఉంది. సహజ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ, ఈ ప్రాంతం దేశంలోనే అత్యంత పేద ప్రాంతాలలో ఒకటిగా ఉంది, ఇక్కడ దాదాపు 70% జనాభా దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆర్థిక నిర్లక్ష్యం మరియు సైనిక అణచివేత ఆరోపణలు ఈ ప్రావిన్స్‌లో వేర్పాటువాద సెంటిమెంట్‌ను పెంచాయి. Salman Khan.

పాక్ నిర్ణయంపై సల్మాన్ అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. “పాక్‌కు ఉగ్రవాది అంటే అర్థమే తెలియదు.” “బలూచిస్తాన్ పేరే వినిపించినా పాక్ గజగజ లాడిపోతోంది.” “సల్మాన్ మాటకు అంత భయం ఉందంటే ఆయన గ్లోబల్ ఇన్‌ఫ్లుయెన్స్ ఎంత ఉందో అర్థం.” ఇలా సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ కు మద్దతు తెలుపుతున్నారు. ఈ వివాదంపై సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయినప్పటికీ, ఆయన చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య సోషల్ మీడియాలో చర్చలను ఆధిపత్యం చేస్తుంది. ఈ సంఘటన, ఒకే వాక్యం సరిహద్దుల మధ్య గుర్తింపు, రాజకీయాలు మరియు కళాత్మక వ్యక్తీకరణపై చర్చలను ఎలా రగిలించగలదో స్పష్టం చేసింది. ఇక ఈ ఘటనతో బాలీవుడ్-పాక్ సంబంధాలను ఏ దిశలోకి తీసుకెళ్తుందో చూడాలి. అలాగే సల్మాన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.