ఆర్ఎస్ఎస్ చీఫ్ సరికొత్త నినాదం..!

Spread the love

RSS chief Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్ ఒక కొత్త చర్చకు తెరలేపారు. ప్రతి భారతీయ కుటుంబం కనీసం ముగ్గురు పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. జనాభా పెరుగుదల అవసరమని, లేకపోతే సమాజం అంతరించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సమాజంలో తీవ్ర చర్చను రేకెత్తించాయి. అసలు జనాభా పెరుగుదల కోసం మోహన్ భాగవత్ ఇచ్చిన నినాదం ఏంటి? ఎందుకు ఆయన జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..? జనాభా తగ్గిపోతే ఎదురయ్యే సమస్యలు ఏంటి..?

ఇటీవల దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరుసలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా ఉన్నారు. మోహన్ భాగవత్ నాగ్ పూర్ లో జనాభా సంతులనం గురించి మాట్లాడుతూ, ప్రతి భారతీయ కుటుంబం కనీసం మూడు పిల్లలను కనాలని సూచించారు. దీని కోసం హమ్ దో హమారే తీన్ అని నినాదాన్ని ఫాలో కావాలన్నారు. ఒక సమాజంలో ఫెర్టిలిటీ రేట్ 2.1 కంటే తక్కువగా ఉంటే, ఆ సమాజం క్రమంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. 0.1 అనేది పిల్లవాడు కాదు, కాబట్టి కుటుంబానికి ముగ్గురు పిల్లలు తప్పనిసరి అని మోహన్ భాగవత గణిత లాజిక్‌తో వివరించారు.

మోహన్ భాగవత్ తన వాదనను లోక్‌సంఖ్యా శాస్త్రంతో ముడిపెట్టారు. ఫెర్టిలిటీ రేట్ 2.1 కంటే తక్కువగా ఉన్న పలు దేశాలు వాటికవే త్వరలో అంతరించిపోతాయని హెచ్చరించారు. చరిత్రలో ఎన్నో భాషలు, సంస్కృతులు జనాభా తగ్గడం వల్ల కనుమరుగైన ఉదాహరణలను ఆయన గుర్తు చేశారు. భారత్‌లో ప్రస్తుతం జనాభా పెరుగుదల రేటు తగ్గుతోందని, ముఖ్యంగా కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఫెర్టిలిటీ రేట్ 1.8 కంటే తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ధోరణి కొనసాగితే, భవిష్యత్‌లో దేశ జనాభా సంతులనం దెబ్బతినవచ్చని, ఆర్థిక, సామాజిక వ్యవస్థలు కుదేలవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా పెరుగుదల సరిగా నిర్వహిస్తే అది భారం కాదు, ఒక వనరుగా మారుతుందని ఆయన నొక్కి చెప్పారు.

మోహన్ భాగవత్ జనాభా పెరుగుదల కుటుంబ వ్యవస్థకు కూడా ఉపయోగమన్నారు. ముగ్గురు పిల్లలున్న కుటుంబాల్లో పిల్లలు ఇతరులతో సామాజిక సంబంధాలను అభివృద్ధి చేసుకోవడం నేర్చుకుంటారని తెలిపారు.. కుటుంబంలో రకరకాల వయసు గల వారుంటే.. సామాజిక ప్రవర్తన, సహకారం, బాధ్యత వంటి లక్షణాలు పిల్లల్లో అభివృద్ధి చెందుతాయని మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు. ఒకే పిల్లవాడు లేదా ఇద్దరు పిల్లలున్న కుటుంబాల కంటే, ముగ్గురు పిల్లలున్న కుటుంబాలు సామాజిక బంధాలను, విలువలు మరింత బలంగా ఉంటాయన్నారు.

మోహన్ భాగవత్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చను రేకెత్తించాయి. విపక్ష పార్టీలు ఈ విధానాన్ని తీవ్రంగా విమర్శించాయి. బీజేపీ జనాభా నియంత్రణ గురించి మాట్లాడుతుండగా, RSS మూడు పిల్లల విధానాన్ని ప్రోత్సహిస్తోందని, వీరి మధ్య ఈ వైరుధ్యం ఏంటని రాష్ట్రీయ జనతా దళ్ నేతలు విమర్శించారు. జనాభా నియంత్రణలో మహిళల విద్య, సాధికారత ద్వారా విజయం సాధించారని, ఈ విధానం దేశానికి ఆదర్శమని జనతా దళ్ యునైటెడ్ నేతలు అంటున్నారు. RSS chief Mohan Bhagwat.

మోహన్ భాగవత్ జనాభా సమస్యపై గతంలో కూడా పలు సందర్భాల్లో మాట్లాడారు. 2022లో జనాభా అసమతుల్యత ప్రమాదాన్ని హెచ్చరించారు. చైనా ఒక్క పిల్లల విధానం వల్ల జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొందని, ఇప్పుడు రెండు లేదా మూడు పిల్లలను ప్రోత్సహిస్తోందని ఉదాహరణగా చెప్పారు. భారత్ కూడా జనాభా విధానంపై దీర్ఘకాలిక దృష్టి పెట్టాలని, 50 సంవత్సరాల తర్వాత దేశం ఎంతమందిని పోషించగలదో ఆలోచించాలని సూచించారు.

జనాభా తక్కుదలపై లెక్కలు ఏం చెబుతున్నాయి..?
భారత్‌లో జనాభా పెరుగుదల రేటు తగ్గుతోందని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 డేటా స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం దేశ ఫెర్టిలిటీ రేట్ 2.0 దగ్గర ఉంది, ఇది రీప్లేస్‌మెంట్ లెవల్ కంటే తక్కువ. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ రేట్ 1.8 లేదా అంతకంటే తక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో యువ జంటలు ఒక్క పిల్లవాడిని కూడా కనడానికి సంకోచిస్తున్నారని భాగవత్ గమనించారు. ఆర్థిక ఒత్తిళ్లు, జీవనశైలి మార్పులు, విద్య, ఉద్యోగ అవకాశాలు వంటివి కుటుంబ పరిమాణాన్ని తగ్గిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత్ ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం, దీనికి తోడు ఆర్థిక ఒత్తిళ్లు, వనరుల కొరత, నిరుద్యోగం వంటి సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, మూడు పిల్లల విధానం ఆర్థికంగా, సామాజికంగా ఎలా అమలవుతుందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే, RSS దీర్ఘకాలిక దృష్టిలో జనాభా విధానం ఒక కీలక అంశంగా ఉంది. భాగవత్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ అంశాన్ని వివిధ సమావేశాల్లో చర్చిస్తూ వస్తున్నారు. జనాభాను సరైన రీతిలో ఉపయోగిస్తే అది దేశానికి ఒక వనరుగా మారుతుందని, కానీ నియంత్రణ అతిగా ఉంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ కోల్పోతామని ఆయన హెచ్చరిస్తున్నారు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q