ఉగ్రవాదులను వెతికి వెతికి వేటాడుతోన్న భద్రతా బలగాలు.. డ్రోన్ వీడియో వైరల్..

Spread the love

జమ్ముూకశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత .. ఓ వైపు ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పీవోకేలో ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేస్తే.. ఇటు కశ్మీర్ లో ఉన్న ఉగ్రమూకలను భద్రతా బలగాలు ఏరిపారేస్తున్నాయి. వరుస ఎన్ కౌంటర్లతో ఉగ్రవాదుల భరతం పడుతున్నాయి భద్రతా బలగాలు. అయితే ఉగ్రవాదుల వేటలో కొత్త టెక్నాలజీ వాడుతున్నారు. ఆ టెక్నాలజీ ఏంటి..? పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన TRFను భారత్ ఏం చేయనుంది…?

జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాల ఉగ్రవేట జోరందుకుంది. మూడు రోజుల వ్యవధిలోనే రెండు ఎన్ కౌంటర్ లు జరిగాయి. వెంటాడి వేటాడి మరీ ఉగ్రవాదులను మట్టుపెడుతున్నారు. థ్రాల్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్లో డ్రోన్‌ చిత్రీకరించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. జైషే మొహమ్మద్‌ సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను దళాలు చుట్టు ముట్టాయి. వారిలో ఒక ఉగ్రవాది నిర్మాణంలో ఉన్న కట్టడంలోని బేస్‌మెంట్‌కు వెళ్లి దాక్కొన్నాడు. దీంతో అతడి ఆచూకీ కనుగొనేందుకు భద్రతా దళాలు డ్రోన్‌ కెమెరాను రంగంలోకి దించాయి. ఉగ్రవాది ఓ పిల్లర్‌ చాటున నక్కినట్లు దీనిలో స్పష్టంగా కనిపించింది. అనంతరం దళాలు అతడిని మట్టుబెట్టాయి. థ్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు దళాలకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో తనిఖీలు చేశారు.

దీంతో హఠాత్తుగా ఉగ్రవాదులు కాల్పులు మొదలుపెట్టడంతో ఎన్‌కౌంటర్‌ మొదలైంది. కొన్ని గంటలపాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఎట్టకేలకు ముగ్గురు ఉగ్రవాదులను దళాలు హతమార్చాయి. చనిపోయిన ఉగ్రవాదులు ఆసిఫ్‌ అహ్మద్‌ షేక్‌, అమిర్‌ నజిర్‌ వని, యావర్‌ అహ్మద్‌ భట్‌గా గుర్తించారు. వీరంతా జమ్మూకశ్మీర్లోని పుల్వామా ప్రాంతానికి చెందిన వారే. గత 48 గంటల్లో జరిగిన రెండో ఎన్‌కౌంటర్‌ ఇది. దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లాలో జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు టాప్‌ లష్కరే ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిని షహిద్‌ కుట్టా, అద్నాన్‌ షఫిగా గుర్తించాయి. షహిద్‌ 2023లో లష్కరేలో చేరాడు. గతేడాది ఏప్రిల్‌ ఓ రిసార్ట్‌ వద్ద కాల్పుల ఘటనకు ఇతడే బాధ్యుడు. ఈ ఘటనలో ఇద్దరు జర్మనీ పర్యటకులు, వారి డ్రైవర్‌ గాయపడ్డారు. ఓ సర్పంచి హత్య కేసులో కూడా ప్రధాన నిందితుడు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి తర్వాత షహిద్‌ ఇంటిని భద్రతా దళాలు పేల్చేశాయి.

మరోవైపు పహల్గామ్ మారణహోమానికి తామే బాధ్యులమని లష్కరే తయ్యిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌- TRF ప్రకటించుకున్నట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో దానిని ఉగ్రసంస్థగా ప్రకటించేలా ఐరాసలో భారత్‌ కీలక చర్యలు ప్రారంభించింది. ఐరాస ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రసంస్థల జాబితాలో చేర్చేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న మన ప్రతినిధుల బృందం.. ఆంక్షల పర్యవేక్షణ బృందం, యూఎన్‌లోని ఇతర భాగస్వామ్య దేశాలతో చర్చలు జరిపింది. అలాగే యూఎన్‌ ఆఫీస్‌ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్‌తో భేటీ అయింది. ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ అనేది పాకిస్థాన్‌కు చెందిన లష్కర్‌ ఏ తయ్యిబాకు అనుబంధ సంస్థ. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఉద్భవించిన కొత్త ఉగ్రవాద సంస్థ ఇది.

2019 అక్టోబర్‌లో ఏర్పాటైన ఈ సంస్థకు ఉగ్రవాది షేక్‌ సాజిద్‌ గుల్‌ సుప్రీం కమాండర్‌గా, చీఫ్‌ ఆపరేషనల్‌ కమాండర్‌గా బాసిత్‌ అహ్మద్‌ దార్‌ వ్యవహరిస్తున్నారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌, లష్కరే సభ్యులతో తొలుత టీఆర్‌ఎఫ్‌ ఏర్పడింది. జమ్మూకశ్మీర్‌లో TRను కేంద్ర హోంశాఖ గతంలోనే ఉగ్రసంస్థగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి జనవరి 6, 2023న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా యువతను నియమించుకుంటోందని.. ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడుతోందని తెలిపింది. జమ్మూ-కశ్మీర్‌ ప్రజలు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభావితం చేస్తోందని, ప్రజలు, భద్రతా దళ సభ్యుల హత్యలకు కుట్రలు పన్నుతోందని పేర్కొంది.

మరోవైపు సైనిక పరంగా చర్యలు తీసుకుంటు.. ఉగ్రవాదులను మట్టుపెడుతోన్న భారత్.. అటు వ్యూహాత్మకంగాను వ్యవహరించి పాక్ ను ఎండగడుతోంది. సింధూ జలాల ఒప్పందంపై వెనక్కి తగ్గేది లేదని చెబుతోంది. పాకిస్థాన్ తో కాల్పుల విరమణ ఒప్పందాం ఉన్నా.. సింధూ జలాల అంశంపై మాత్రం అలాగే నిలబడింది. దీంతో సింధూ జలాల ఒప్పందం నిలిపివేత వల్ల జరిగే నష్టం ఏంటో పాకిస్థాన్‌కు తెలుసొచ్చింది. మొన్నటి వరకు ఈ అంశంలో తీవ్ర స్వరంతో మాట్లాడిన దాయాది ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్‌.. సింధూ జలాల విషయంలో వెనక్కి తగ్గేదే లే అని ప్రకటించడంతో ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చింది. నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలంటూ కోరింది.

ఈ మేరకు భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. సింధూ జలాలు నిలిపివేస్తే పాక్‌లో తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాక్‌ జలవనరుల శాఖ లేఖ రాసినట్లు సమాచారం. ఈ విషయంలో చర్చించేందుకు పాక్‌ సిద్ధంగా ఉందని పేర్కొంది. ప్రోటోకాల్‌లో భాగంగా ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్లు తెలుస్తోంది. అయితే, రక్తం, నీరు రెండూ కలిసి ప్రవహించలేవంటూ ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టంచేశారు. పాక్‌తో చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పైనే అని పేర్కొన్నారు.

పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడి అనంతరం సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు భారత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. సింధూ, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి వరల్డ్ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్థాన్‌ మధ్య ఒప్పందం 1960లో కుదిరింది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని నెహ్రూ, పాకిస్థాన్‌ అధ్యక్షుడు అయూబ్‌ ఖాన్‌ సంతకాలు చేశారు. ఈ డీల్ ప్రకారం సింధు ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్‌ నదులపై భారత్ కు హక్కులు లభించాయి. సింధూ నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్థాన్‌కు హక్కులు దక్కాయి. ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.