కాల్పుల విరమణకు ఆ క్షిపణే కారణం..

Spread the love

భారత్, పాకిస్థాన్ ల మధ్య హఠాత్తుగా కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొన్నటి వరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాకిస్థాన్ భారత్ కొట్టిన దెబ్బకు చేతులెత్తేసింది. యుద్ధమంటే .. LOC దగ్గర మిషన్ గన్ లు, రాకెట్ లాంఛర్లతో కాల్పులు జరపడం కాదు.. దాని లెక్క వేరే విధంగా ఉంటుందని పాకిస్థాన్ కు అర్థమైంది. కాదు భారత్ అర్థమయ్యేలా చేసింది. ఇంతలా భారత్ పాకిస్థాన్ ను భయపెట్టేలా ఏం చేసింది..? సామాన్య ప్రజలకు ఎటువంటి హానీ కలగకుండా… పాకిస్థాన్ లోని ఏ కీలక స్థావరాలపై భారత్ దాడి చేసింది..? ఈ దాడులు పాకిస్థాన్ కు వెన్నులో వణుకు పుట్టించడానికి కారణం ఏంటి..?

పాకిస్థాన్ తోక లేని తారాజువ్వల్లాంటి లక్ష్యం లేని క్షిపణులు ఎన్ని ప్రయోగించినా.. నిర్దేశిత లక్ష్యంతో భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ ఒకటి చాలు వాటికి సమాధానం చెప్పడానికి. తమ దగ్గర అణుబాంబు ఉంది… చైనా ఇచ్చిన అత్యాధునిక క్షిపణులు ఉన్నాయి.. అని మొన్నటి వరకు విర్రవీగిన పాకిస్థాన్ కు భారత్ షాక్ ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పై దాడులు చేసిన పాక్ కు భారత్ ఆర్మీ సత్త ఏంటో తెలిసింది. పాకిస్థాన్ ఎన్ని డోన్లు, క్షిపణులు ప్రయోగించిన అవి భారత్ కు నష్టాన్ని కలిగించలేదు. భారత్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతలా వాటిని అడ్డుకుంది. ఇజ్రాయిల్ ఐరెన్ డ్రోమ్ లాగా భారత్ దగ్గర ఉన్న S-400 సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులు మన భూభాగంలోకి రాగానే కూల్చివేసింది. దీంతో పాకిస్థాన్ ఎన్ని డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించిన ఉపయోగం లేకుండా పోయింది. అవి రెక్కలు తెగిన పక్షుల్లా నేలవాలాయి. భారత్ ఎంత సంయమనం పాటించినా .. పాకిస్థాన్ మాత్రం క్షిపిణి దాడులతో దుందుడుకు ప్రదర్శించింది. దీంతో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. అయితే పాకిస్థాన్ లా పౌరులపై దాడి చేయకుండా భారత్.. పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని తెగబడింది. అంతే పాకిస్థాన్ ఖేల్ ఖతం.

ఎక్కడ కొడితే పాకిస్థాన్ దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అక్కడే భారత్ కొట్టింది. అది కూడా సరైన ఆయుధంతో.. అంతే పాకిస్థాన్ చేతులెత్తేసింది. పాకిస్థాన్‌ అధికారిక రాజధాని ఇస్లామాబాద్‌ అయినా.. పాలన మొత్తం జరిగేది రావల్పిండి నుంచే. ఇక్కడ చక్లాలాలో ఆర్మీ చీఫ్‌ ఆఫీస్‌ నుంచే అన్ని రకాల సైనిక ఆదేశాలు వెళుతుంటాయి. శనివారం తెల్లవారుజామున పాక్‌లోని ఈ కీలక సైనిక స్థవరాన్ని భారత్‌ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇక్కడ పాక్‌ వాయుసేనకు చెందిన మొబిలిటీ కమాండ్‌ ఉంది. దీంతోపాటు గగనతల రిఫ్యూలర్‌ ట్యాంకర్‌ ఫ్లైట్లు, హెవీ లిఫ్టర్లు ఇక్కడ ఉన్నాయి. ఇది పాకిస్థాన్ కు భారీ షాక్. రక్షణ శాఖ చెందిన కీలక స్థావరానికే పాక్ రక్షణ ఇవ్వలేకపోవడం పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో లోపాలను క్లియర్ గా తెలియజేస్తోంది.

పాక్‌ దుందుడుకు చర్యలకు ప్రతిగా భారత్‌ అత్యాధునిక క్షిపణులు, గైడెడ్‌ మ్యూనిషన్‌, లాయిటరింగ్‌ మ్యూనిషన్‌ను వాడినట్లు తెలుస్తోంది. వీటితో రఫీక్, మురీద్, చక్లాలా, రహీంయార్‌ ఖాన్, సుక్కుర్, చునియన్.. పర్సూర్, సియాల్‌కోట్‌ స్థావరాలపై మన యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇందులో వైమానిక స్థావరాలు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు, రాడార్‌ సైట్లు, ఆయుధ నిల్వ కేంద్రాలున్నాయి. భారత్‌ వాడిన వాటిల్లో హ్యామర్‌ గైడెడ్‌ బాంబులతోపాటు.. స్కాల్స్‌ క్షిపణే కాకుండా.. బ్రహ్మోస్‌ మిసైల్‌ ఉందని అంటున్నారు. యుద్ధ రంగంలో దీనిని ఉపయోగించడం ఇదే తొలిసారి కావొచ్చు. భారత్‌ నిమిషాల వ్యవధిలో పాక్‌కు చెందిన కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం ఆ దేశంలో గుబులు రేపింది. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని రఫికీ వైమానిక స్థావరం షోర్కోట్‌లో ఉంది. పాకిస్థాన్ కు చెందిన అత్యాధునిక విమానాలు ఇక్కడే ఉంటాయి. ఇది ఇస్లామాబాద్‌కు 337 కిలోమీటర్ల దూరంలో ఉంది. 10,000 అడుగుల రన్‌వే ఇక్కడి ప్రత్యేకత. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ స్ట్రిప్‌లు ఉన్నాయి. పంజాబ్‌లోని చక్వాల్‌లో మురీద్‌ ఉంది. పాక్‌ ఆపరేషనల్‌ ఫ్లయింగ్‌ బేస్‌గా దీనికి పేరుంది. దీంతోపాటు మానవ రహిత సాయుధ డ్రోన్లు ఇక్కడ ఉన్నాయి. ఈ స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది.

అలాగే పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌కు అత్యంత సమీపలోని రావల్పిండిలో చక్లాలా వైమానిక స్థావరం ఉంది. పాక్‌ కీలక జనరల్స్‌ ఇక్కడే ఉంటారు. ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌ కార్యాలయం కూడా చక్లాలాలోనే ఉంటుంది. పాకిస్థాన్‌ అధికారిక రాజధాని ఇస్లామాబాద్‌ అయినా.. పాలన మొత్తం జరిగేది రావల్పిండి నుంచే. ఇక్కడ చక్లాలాలో ఆర్మీ చీఫ్‌ ఆఫీస్‌ నుంచే ఆదేశాలు వెళుతుంటాయి. దీంతోపాటు గగనతల రిఫ్యూలర్‌ ట్యాంకర్‌ ఫ్లైట్లు, హెవీ లిఫ్టర్లు ఇక్కడ ఉన్నాయి. పాక్‌లోని ఈ స్థావరాన్ని భారత్‌ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇక్కడ పాక్‌ వాయుసేనకు చెందిన మొబిలిటీ కమాండ్‌ ఉంది. ఇతర క్షిపణులతో పాటు.. బ్రహ్మోస్ ను కూడా పాక్ పై భారత్ ప్రయోగించిందని చెబుతున్నారు. యూపీలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ..ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని వెల్లడించారు. ఆ సమయంలో ఈ క్షిపణులకున్న శక్తి ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు. దీని ప్రభావం గురించి తెలియని వారెవరైనా ఉంటే.. పాకిస్థాన్‌ను అడిగి తెలుసుకోవాలని సూచించారు. అంటే బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం జరిగినట్టు అర్థమవుతోంది.

అటు పాక్ మిత్ర దేశం చైనా.. తమ మిత్రుడికి జరిగిన నష్టాన్ని తెలియజేసింది. చైనా శాటిలైట్ చిత్రలు పాకిస్థాన్ సైనిక స్థావరాలకు జరిగిన నష్టాన్ని క్లియర్ గా చెబుతున్నాయి. భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై ఖచ్చితమైన దాడులు చేసి, అక్కడి సౌకర్యాలను, గ్రౌండ్ వాహనాలను నాశనం చేసింది. చైనాకు చెందిన ఓ సంస్థ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రం, మే 8 నుంచి 10 వరకు భారత్‌ ఆపరేషన్ సిందూర్‌లో ఈ సైనిక స్థావరానికి జరిగిన నష్టాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, పాకిస్తాన్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌కు దగ్గరలో ఉంటూ, వారి ఎయిర్ మొబిలిటీ కమాండ్‌కు కీలక కేంద్రంగా పనిచేస్తుంది. ఈ దాడి పాకిస్తాన్‌కు వ్యూహాత్మకంగా, సాంకేతికంగా గట్టి ఎదురుదెబ్బ తగిలించింది. ఇది వారి వైమానిక రక్షణ వ్యవస్థలో లోపాలను, ఈ ముఖ్యమైన స్థావరాన్ని కాపాడలేని బలహీనతను బయటపెట్టింది. నూర్ ఖాన్‌లో సాబ్ ఎరీఐ ఎయిర్‌బోర్న్ హెచ్చరిక వ్యవస్థలు, C-130 రవాణా విమానాలు, IL-78 ఇంధన నింపే విమానాలు వంటి కీలక ఆస్తులు ఉన్నాయి. ఈ వ్యవస్థలు నిఘా, లాజిస్టిక్స్, సరిహద్దు ఆపరేషన్లలో వైమానిక సమన్వయానికి చాలా ముఖ్యం. అలాగే ఉపగ్రహ చిత్రాలు, భారత దాడుల తర్వాత పాకిస్తాన్‌లోని భోలారీ ఎయిర్‌బేస్‌కు జరిగిన నష్టాన్ని చూపిస్తున్నాయి. మే 10న పాకిస్తాన్‌ పంజాబ్‌లోని రహీం యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత దాడి తర్వాత, దాని ఏకైక రన్‌వే వారం పాటు పనిచేయలేదు. అయితే ఈ స్థవరాలపై బ్రహ్మోస్ క్షిపణిని ఉపయోగించినట్టు తెలుస్తోందీ. ఈ దెబ్బకే పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి పరుగులు పెట్టిందని అంటున్నారు.