బీజేపీతో హీరో విజయ్ కలుస్తారా..? పవన్ కల్యాణ్, విజయ్ కలిసి ప్రచారం చేస్తారా..? ఆసక్తి రేపుతోన్న తమిళ రాజకీయం..!!

Spread the love

తమిళనాడులో 2026 జరిగే అసెంబ్లీ ఎన్నికలు రాజకీయంగా ఎంతో ఆసక్తిని రేకెత్తిసున్నాయి. ఈ ఎన్నికల కోసం అక్కడి రాజకీయ పార్టీలు ఎలా సిద్ధమవుతున్నాయి? హీరో విజయ్ ఏర్పాటు చేసిన తమిళగ వెట్రి కళగం పార్టీ, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటుందా? వీరు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తారా? ఒకవేళ ఈ మూడు పార్టీలు కలిస్తే, తమిళనాడు రాజకీయాలు ఎలా మారతాయి? ఈ పొత్తు కుదిరితే ప్రస్తుత రూలింగ్ పార్టీ డీఎంకే పరిస్థితి ఏమవుతుంది? బీజేపీ తమిళనాడు రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పుతోంది? ఇటీవల పవన్ కల్యాణ్ లాంటి నాయకులు తమిళనాడులో బీజేపీ ఆధ్వర్యంలో పర్యటించడం దేనికి సంకేతం?

తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక మలుపుగా నిలవనున్నాయి. ఎందుకంటే, ఈసారి ఎన్నికలు బహుముఖ పోటీగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీ, హీరో విజయ్ ఏర్పాటు చేసిన తమిళగ వెట్రి కళగం, సీమాన్ నాయకత్వంలోని నామ్ తమిళర్ కచ్చి వంటి పార్టీలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. డీఎంకే తమ సంకీర్ణంలో కాంగ్రెస్, విసీకే, ఐయూఎంఎల్, లెఫ్ట్ పార్టీలతో బలమైన కూటమిగా ఉంది. అన్నాడీఎంకే కూడా డీఎండీకేతో కలిసి ఉంది, కానీ ఈ కూటమి బలహీనంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇక బీజేపీ, పీఎంకే, ఓ. పన్నీర్‌సెల్వం, వీకే శశికళ వంటి నాయకులతో కూటమి కట్టింది, కానీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధించలేదు.

తమిళనాడు రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులుకదుపుతున్నాయి. డీఎంకే, తమిళ గుర్తింపు, హిందీ విధానం, డీలిమిటేషన్ వంటి అంశాలను ఎత్తిచూపుతూ, బీజేపీని తమిళనాడుకు వ్యతిరేకమని చిత్రీకరిస్తోంది. సీఎం ఎంకే స్టాలిన్, ఈ అంశాలను ఎన్నికల్లో కీలక ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నారు. డీఎంకే ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవాలని అన్నాడీఎంకే భావిస్తోంది. 2026 ఎన్నికల్లో డీఎంకే 200 సీట్లు గెలుస్తామని చెప్పడం పగటి కలలు కనడం అని అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి కె. పళనిస్వామి విమర్శించారు. బీజేపీ కూడా అన్నాడీఎంకేతో మళ్లీ చేతులు కలిపి, డీఎంకేని ఎదుర్కోవాలని సన్నాహాలు చేస్తోంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అన్నాడీఎంకే-బీజేపీ కూటమిని ప్రకటించారు. ఈపీఎస్ నాయకత్వంలో ఈ కూటమి 2026 ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారు.

ఇక హీరో విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ, 2026 ఎన్నికల్లో అన్ని సీట్లలో పోటీ చేయనుంది. టీవీకే, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటుందని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, టీవీకే నాయకులు ఈ వార్తలను ఖండిస్తున్నారు. ఇటీవల టీవీకే ఉప ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున, డీఎంకే, బీజేపీ, అన్నాడీఎంకేలతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు కూడా. ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీలతో ఎందుకు కలవాలి అని ప్రశ్నించారు. టీవీకే స్వతంత్రంగా పోటీ చేస్తుందని, విజయ్ నాయకత్వంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆధవ్ అర్జున చెప్పారు. అయితే రాబోయే రోజుల్లో టీవీకే, అన్నాడీఎంకే, బీజేపీతో చేతులు కలపవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనికి కొన్ని లెక్కలు కూడా చెబుతున్నారు.

టీవీకే నాయకత్వం ఎలాంటి పొత్తూ లేకుండా స్వతంత్రంగా పోటీ చేయాలని చెబుతున్నప్పటికీ, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ మూడు పార్టీలు కలిస్తే డీఎంకేకు గట్టి సవాలు ఎదురవుతుందని అంటున్నారు. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఇప్పటికే ఖరారైంది. ఈ కూటమిలో టీవీకే కూడా చేరితే, ఎన్నికలు మరింత హోరాహోరీగా మారతాయని భావిస్తున్నారు. టీవీకేతో కలిస్తే, అన్నాడీఎంకే బలమైన శక్తిగా మారి, డీఎంకేని ఓడించే అవకాశం ఉందని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు. అమిత్ షా కూడా ఈ కూటమి తమిళనాడులో డీఎంకే అవినీతి, విభజన రాజకీయాలను రూపుమాపుతుందని.. దీనికోసం పొత్తులకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు.

టీవీకే, అన్నాడీఎంకే, బీజేపీ కలిస్తే, తమిళనాడు రాజకీయాలు పెను మార్పు చెందే అవకాశం ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమి 47% ఓట్లతో 39 సీట్లను గెలుచుకుంది. అన్నాడీఎంకే 20.6%, బీజేపీ కూటమి 18% ఓట్లు సాధించాయి. ఒకవేళ ఈ రెండు కూటములు కలిసి ఉంటే, 84 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యం సాధించి ఉండేవని అంటున్నారు. ఇక టీవీకే 10% ఓటు షేర్‌ను తెచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఈ మూడు పార్టీలు కలిస్తే, డీఎంకే కూటమి 45-47 శాతం ఓట్లతో ఉన్నప్పటికీ, పోటీ చాలా టఫ్ గా మారుతుంది. ముఖ్యంగా మొదటిసారి ఓటర్లు, ఆంటీ-డీఎంకే ఓటర్లు, అన్నాడీఎంకే సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఈ కూటమికి బలం చేకూర్చవచ్చు.

తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకేతో టీవీకే పొత్తుకు ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి..? టీవీకే స్వతంత్రంగా పోటీ చేయాలనే గట్టి నిర్ణయంతో ఉంది. అయితే హీరో విజయ్, డీఎంకే, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేస్తూ, అన్నాడీఎంకేపై మాత్రం నోరు మెదపలేదు, ఇది కొంత ఊహాగానాలకు తావిస్తోంది. అయితే, టీవీకే స్పష్టంగా పొత్తు వద్దని చెబుతోంది. మరోవైపు, అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో కూడా సమస్యలు ఉన్నాయి. అన్నాడీఎంకేలోని కొందరు నాయకులు బీజేపీతో కలవడం వల్ల తమ ఓటు బ్యాంక్, ముఖ్యంగా మైనారిటీ ఓట్లు కోల్పోతామని భయపడుతున్నారు. అన్నాడీఎంకే, బీజేపీ కార్యకర్తల మధ్య కెమిస్ట్రీ కుదరకపోవడం కూడా ఒక సమస్యగా చెప్పబడుతోంది. ఈ కూటమి అరిథ్‌మెటిక్ సరిగా ఉన్నా, కెమిస్ట్రీ లేకపోతే ఫలితం ఇవ్వదని అన్నాడీఎంకే నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ టీవీకే, అన్నాడీఎంకే, బీజేపీ కలిస్తే, డీఎంకే పరిస్థితి చాలా కష్టతరంగా మారుతుంది. డీఎంకే కూటమి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 159 సీట్లతో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో 39 సీట్లతో సత్తా చాటింది. కానీ, ఈ కొత్త కూటమి ఏర్పడితే, ఆంటీ-డీఎంకే ఓట్లు ఒకచోట చేరి, డీఎంకే ఓటు షేర్‌ను తగ్గించే అవకాశం ఉంది. పార్టీలు వీడివిడిగా పోటీ చేస్తే డీఎంకే గెలుస్తుంది, కానీ ఒకే కూటమిగా పోటీ ఉంటే అన్నాడీఎంకే కూటమి గెలిచే అవకాశం ఉంది. టీవీకే, ముస్లిం, క్రిస్టియన్, పల్లర్, పరయర్ కమ్యూనిటీల నుంచి 33నుంచి 37% ఓట్లు తెచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇవి సాంప్రదాయకంగా డీఎంకే, విసీకే, ఎన్టీకే ఓటు బ్యాంక్‌లు. ఇది డీఎంకేకు పెద్ద దెబ్బ కావచ్చు.

ప్రస్తుతం డీఎంకే పాలనపై తమిళనాడులో మిశ్రమ స్పందనలు ఉన్నాయి. ఎంకే స్టాలిన్ వ్యక్తిగతంగా పాపులర్‌గా ఉన్నప్పటికీ, ఆంటీ-ఇన్‌కంబెన్సీ పెరుగుతోందని అంటున్నారు. చట్టం, శాంతి భద్రతలు, మహిళల భద్రత వంటి అంశాలపై డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు ఉన్నాయి. ఇదే అంశాలపై విమర్శిస్తూ, రాబోయే ఎన్నికల్లో టీవీకే, డీఎంకే మధ్యే పోటీ అని టీవీకే చీఫ్ విజయ్ సవాల్ విసిరారు. మరోవైపు, డీఎంకే తమ కూటమిలోని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో బలమైన సంబంధాలను కొనసాగిస్తోంది. 2024 ఆగస్టులో జరిగిన కరుణానిధి శతజయంతి ఉత్సవాల్లో బీజేపీ నాయకుడు రాజ్‌నాథ్ సింగ్ పాల్గొనడం, డీఎంకే-బీజేపీ మధ్య సీక్రెట్ పాక్ట్ ఉందని అన్నాడీఎంకే ఆరోపించింది, కానీ డీఎంకే దీన్ని ఖండించింది. ఆ తర్వాత బీజేపీ, డీఎంకే నాయకులు విమర్శలు చేసుకున్నారు.

తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ చక్రం ఎలా తిప్పగలదా..? ఇప్పటి వరకు తమిళనాడులో బలహీనంగా ఉన్న బీజేపీ, అన్నాడీఎంకే వంటి పెద్ద పార్టీలతో కలిసి తన ఉనికిని పెంచుకోవాలని చూస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 2.6% ఓటు షేర్‌తో 4 సీట్లు గెలిచింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 11.24% ఓటు షేర్ సాధించింది, కానీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇప్పుడు అన్నాడీఎంకేతో కలిసి, ఆంటీ-డీఎంకే ఓట్లను ఏకం చేసి, డీఎంకేని ఎదుర్కోవాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ కొత్త స్టేట్ ప్రెసిడెంట్ నైనార్ నాగేంద్రన్, దక్షిణ తమిళనాడులోని తేవర్ కమ్యూనిటీ నుంచి ఓట్లను సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త కూటమి తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. తమిళనాడులో అన్నాడీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలతో కూటములు, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనతో పొత్తులు ఈ వ్యూహంలో భాగమే. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగించిన వ్యూహాన్నే తమిళనాడులో అనుసరిస్తోంది. ఏపీలో టీడీపీ పెద్ద భాగస్వామిగా, బీజేపీ చిన్న భాగస్వామిగా ఉంది. అలాగే, తమిళనాడులో అన్నాడీఎంకే నాయకత్వంలో బీజేపీ జూనియర్ భాగస్వామిగా ఉంటుంది. బీజేపీ, హిందీ విధానం, డీలిమిటేషన్ వంటి అంశాలపై దక్షిణాది రాష్ట్రాల్లో వ్యతిరేకతను తగ్గించేందుకు, ఈ అంశాలపై తన వైఖరిని మృదువుగా మార్చుకోవాలని చూస్తోంది. దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల ఉత్తర రాష్ట్రాలకు రాజకీయ ఆధిపత్యం పెరుగుతుందని భయపడుతున్నాయి. దీన్ని డీఎంకే, టీవీకే వంటి పార్టీలు ఎన్నికల్లో ఆయుధంగా వాడుకుంటున్నాయి. కానీ బీజేపీ వేరే విధంగా తమిళులకు దగ్గర కావాలని చూస్తోంది.

ఇటీవల తమిళనాడులో పవన్ కల్యాణ్ లాంటి నాయకులు బీజేపీ ఆధ్వర్యంలో పర్యటించడం ఒక ముఖ్యమైన సంకేతం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తమిళనాడు రాజకీయాల్లో బీజేపీకి కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్, సనాతన ధర్మం, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ను ప్రశంసించడం, హిందీ విధానాన్ని వ్యతిరేకిస్తూ తమిళ రాజకీయ నాయకులపై విమర్శలు చేయడం ద్వారా, బీజేపీ తమిళనాడులో తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇది బీజేపీ దక్షిణాదిలో తన పాతుకు పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగం. పవన్ కల్యాణ్ పర్యటన, అన్నాడీఎంకేకు మద్దతుగా, డీఎంకే వ్యతిరేక ఓట్లను ఏకం చేసేందుకు బీజేపీ చేస్తున్న సన్నాహాలను సూచిస్తుంది.

టీవీకే, అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు వార్తలపై డీఎంకే కౌంటర్లు ఇస్తోంది. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ప్రకటన తర్వాత, సీఎం ఎంకే స్టాలిన్ దానిపై విమర్శలు చేశారు. ఈడీ దాడుల భయంతో అన్నాడీఎంకే బీజేపీతో జట్టు కట్టిందని విమర్శించారు. మొత్తంగా చూస్తే, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఒక రాజకీయ యుద్ధభూమిగా మారనున్నాయి. టీవీకే, అన్నాడీఎంకే, బీజేపీ కలిసే అవకాశం ప్రస్తుతానికి తక్కువగా ఉన్నప్పటికీ, అలా జరిగితే డీఎంకేకు గట్టి సవాలు ఎదురవుతుంది. డీఎంకే ప్రభుత్వంపై ఆంటీ-ఇన్‌కంబెన్సీ, బీజేపీ దక్షిణాది వ్యూహాలు, టీవీకే లాంటి కొత్త పార్టీల ఆవిర్భావం, ఈ ఎన్నికలను హోరాహోరీగా మార్చనున్నాయి. ఈ పరిస్థితి తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని రాసే అవకాశం ఉంది.