బీహార్ సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఆయన ఇటీవలే రాజ్యసభకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోక్ భవన్ కు చేరుకుని గవర్నర్ కు తన రాజీనామాను సమర్పించారు. కాగా, బీహార్ తదుపరి సీఎంగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ శాసనసభా పక్షం సామ్రాట్ చౌదరిని తమ పార్టీ నేతగా ఎన్నుకుంది. ఇక ఈ నేపథ్యంలో ఆయన రేపు ప్రమాణం చేయనున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఎన్నిక కోసం అబ్జర్వర్ గా వచ్చారు. 1990లో ఆర్జేడీలో సామ్రాట్ చౌదరి తన రాజకీయ ప్రస్థానం మొదలెట్టారు. 1999లో వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన జేడీయూలో చేరారు. అనంతరం ఆయన బీజేపీలో చేరగా, కొన్నాళ్లకే 2018లో బీహార్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2023 మార్చిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు బీహార్ సీఎం పదవిని చేపట్టిన మొదటి బీజేపీ నేతగా నిలవనున్నారు. రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
లోక్ భవన్ లో నితీష్ కుమార్ బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ కి తన రాజీనామాను సమర్పించారు. ఈ సందర్భంగా నితీష్ సేవలకు, సుపరిపాలన పట్ల మీకున్న అంకితభావానికి మరియు ప్రజా ప్రయోజనాల కోసం చేసిన అవిశ్రాంత కృషికి నేడు బీహార్ మొత్తం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోందని బీజేపీ బీహార్ పేర్కొంది. నితీష్ నాయకత్వం, ముందుచూపు మరియు నిబద్ధత ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని తెలిపింది. బీహార్ పురోగతి మరియు అభివృద్ధికి అందించిన సహకారం ఎప్పటికీ గుర్తుండిపోతుందని మీ ఉజ్వల భవిష్యత్తు కోసం మరియు ప్రజా సేవలో చూపిన అచంచలమైన సంకల్పానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది.
