ఈ సీజన్ లో కోల్ కతా తీరు ఇంకా మారలేదు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆ జట్టు తాజాగా మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు ఓటములతో సీజన్ ను ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో గెలుపును కైవసం చేసుకుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ కోల్ కతా నైట్ రైడర్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 48 (32; 4×4, 3×6), బ్రెవిస్ 41 (29; 4×4, 2×6), ఆయుష్ మాత్రే 38 (17; 6×4, 2×6), సర్ఫరాజ్ ఖాన్ (23) పరుగులు చేశారు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో కార్తీక్ త్యాగి 2 వికెట్లు, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. రమణ్ దీప్ సింగ్ (35), రోవ్ మన్ పావెల్ (31 నాటౌట్), అజింక్య రహానే (28), అంగ్క్రిష్ రఘువన్షీ (27), సునీల్ నరైన్ (24) పరుగులు చేశారు. కామెరూన్ గ్రీన్ (0) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ చెన్నై బౌలర్లు కోల్ కతా బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. దీంతో తక్కువ పరుగులకే కట్టడి చేయగలిగారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు, అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లు, ఖలీల్ అహ్మద్, అకెల్ హోసెన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.