నిన్న ప్రధాని మోడీ ప్రజలకు చేసిన బంగారం కొనడం, విదేశాలకు వెళ్లడం, వంట నూనె వినియోగాన్ని తగ్గించడం వంటి సూచనలపై లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. మోదీ జీ నిన్న ప్రజల నుండి త్యాగాలను కోరారు – బంగారం కొనకండి, విదేశాలకు వెళ్లకండి, పెట్రోల్ వాడకం తగ్గించండి, ఎరువులు మరియు వంట నూనె వినియోగాన్ని తగ్గించుకోండి, మెట్రోలో ప్రయాణించండి, ఇంటి నుండే పని చేయండి (వర్క్ ఫ్రమ్ హోమ్) అని చెప్పారు. ఇవి కేవలం హితబోధలు కావని ఇవి వైఫల్యానికి నిదర్శనాలని విమర్శించారు. గడిచిన 12 ఏళ్లలో, దేశాన్ని ఆయన ఎంతటి స్థితికి తీసుకొచ్చారంటే.. ప్రజలు ఏమి కొనాలి, ఏమి కొనకూడదు, ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడికి వెళ్లకూడదు అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిసారీ, తమ బాధ్యత నుండి తప్పించుకోవడానికి వారు ప్రజలపై భారాన్ని నెట్టేస్తుంటారని ఆక్షేపించారు. దేశాన్ని నడపడం అనేది ఇక ఒక అశక్తుడైన ప్రధానమంత్రి వల్ల సాధ్యం కాదని విమర్శించారు. అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో కూడా బంగారం కొనుగోలు వంటి అంశాలపై అప్పటి మంత్రులు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పటి వీడియోలు, పాత న్యూస్ ఆర్టికల్స్ ను కొందరు చూపిస్తూ అప్పుడు కాంగ్రెస్ నేతలు చేసిందేంటని ప్రశ్నిస్తున్నారు.