యూ.ఎన్ సెక్యూరిటీ కౌన్సిల్  పనితీరుపై సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అసంతృప్తి 

Spread the love

ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్  పనితీరుపై సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంశంగా మారాయి. భద్రతా మండలి పనితీరుపై యూ.ఎన్  సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెక్యూరిటీ కౌన్సిల్ లో ఉన్న అగ్రదేశాలే అంతర్జాతీయ చట్టాలను ఇష్టారీతిగా ఉల్లంఘిస్తున్నాయని, అందువల్లే ఈ ఐక్య  వేదిక నిస్తేజంగా మారిందని అనడం ప్రపంచ దేశాలను ఆలోచించేలా చేస్తోంది. మొత్తం ఇందులో 15 దేశాలు కాగా, ఐదు శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలిక సభ్య దేశాలు సభ్యులుగా ఉండే ఈ అంతర్జాతీయ వేదికను తక్షణమే సంస్కరించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఈ వేదిక ఇప్పటి  ప్రపంచ పరిస్థితులకు తగిన విధంగా లేదని అభిప్రాయపడ్డారు. నేటి భౌగోళిక రాజకీయ  పరిస్థితులను ప్రతిబింబించడం లేదని, దశాబ్దాల క్రితం నాటి ప్రపంచాన్ని ప్రతిబింబిస్తోంది  విమర్శలు గుప్పించారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ (యూఎన్ జీఏ) 81వ సమావేశాలు వచ్చే వారం ప్రారంభం కానున్న నేపథ్యంలో గుటెరస్ తాజాగా మీడియాతో మాట్లాడారు. మల్టీలేటరలిజమ్   ద్వారా ప్రపంచ సంక్షోభాలను పరిష్కరించవచ్చనే భరోసాను కీలక దేశాలు ఇస్తున్నాయని ఇటీవలి బ్రిక్స్ ఢిల్లీ డిక్లరేషన్ ను ఉద్దేశించి గుటెరస్ పేర్కొన్నారు. ఇక రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి, భవిష్యత్తులో యుద్ధాలు రాకుండా నివారించడానికి 1945 అక్టోబరు 24న ఐక్యరాజ్యసమితిని స్థాపించబడింది. ప్రపంచంలోని దాదాపు అన్ని స్వతంత్ర దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. ప్రపంచ శాంతి మరియు భద్రతను పరిరక్షించడం దేశాల మధ్య సత్సంబంధాలను పెంపొందించడం, అంతర్జాతీయ సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించడం మరియు మానవ హక్కులను రక్షించడం దీని ప్రధాన ఉద్దేశాలు. అలాగే పేదరికం నిర్మూలన, విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ మరియు శరణార్థుల సంక్షేమం కోసం ఇది  విస్తృతంగా కృషి చేస్తుంది. అప్పట్లో ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు నేడు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సమీకరణాలు, పరిణామాలు ఈ సంస్థ పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. 1945 నాటి పరిస్థితులకు ఈ కొత్త శతాబ్దపు పరిస్థితులకు మధ్య ఎక్కడా సారూప్యత  లేదు. ముఖ్యంగా కొన్ని దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక, భద్రతా సమస్యలకు తగిన స్పందన లభించకపోవడం వల్ల ఈ వేదికల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *