రాజస్థాన్ రాయల్స్ ఈ ఐపీఎల్ సీజన్ లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా ఆ జట్టు గువాహటి వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 27 పరుగుల తేడాతో విజయం సాధించి సత్తా చాటింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ 77 నాటౌట్ (32;10×4, 4×6), వైభవ్ సూర్యవంశీ 39(14; 1×4, 5×6)లు మొదటి ఓవర్ నుండే విధ్వంసక బ్యాటింగ్ తో చెలరేగారు. రియాన్ పరాగ్ 20 (10; 1×4, 2×6)లు చేశాడు. ముంబై బౌలర్లలో గజన్ఫార్ కు 2 వికెట్లు, శార్దూల్ ఠాకూర్ కు ఒక వికెట్ తీశారు. ఇక టార్గెట్ ఛేజింగ్ లో ముంబై 11 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. నమన్ ధీర్ (25), రూథర్ఫర్డ్ (25) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. రికెల్టన్ (8), రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (6),హార్దిక్ పాండ్య (9), తిలక్ వర్మ (14) స్వల్పస్కోర్లకే ఓటయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్ పాండే 1 వికెట్ చొప్పున తీశారు. ఈ మ్యాచ్ విజయంతో వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచిన రాజస్థాన్ 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.