ఐపీఎల్ సీజన్ 19లో కోల్ కతా నైట్ రైడర్స్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేసింది. పాతుమ్ నిస్సాంక 50 (29; 5×4, 3×6) హాఫ్ సెంచరీతో ఆకట్టుకుని ఢిల్లీ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. అశుతోష్ శర్మ 39 (28; 3×4, 3×6), కే.ఎల్.రాహుల్ (23) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. కోల్ కతా బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ ఢిల్లీని తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో సఫలమయ్యారు. అనుకుల్ రాయ్ 2 వికెట్లు, కార్తీక్ త్యాగి 2 వికెట్లు, వైభవ్ అరోరా, సునీల్ నరైన్, కామెరూన్ గ్రీన్ 1 వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కేవలం 14.2ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. అజింక్య రహానే (13), అంగ్క్రిష్ రఘువంశీ (1) స్వల్ప పరుగులకే అవుటైనా ఫిన్ అలెన్ 100 నాటౌట్ (47; 5×4, 10×6) సెంచరీతో సత్తాచాటాడు. ఢిల్లీ బౌలింగ్ ను చిత్తుచేస్తూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కామెరూన్ గ్రీన్ 33 నాటౌట్ (27; 2×6) తో కలిసి కోల్ కతా జట్టును గెలిపించాడు. ఢిల్లీ బౌలర్లలో అక్సర్ పటేల్ 1 వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్ విజయంతో కోల్ కతా ఆడిన 11 మ్యాచ్ లలో 4 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ వర్షంతో రద్దవడం వలన వచ్చిన 1 పాయింట్ తో కలిపి మొత్తంగా 9 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్స్‌లో చోటు సంపాదించాలంటే, మిగిలిన 4 మ్యాచ్‌ల్లోనూ గెలిచి 17 పాయింట్లకు చేరుకోవాలి, లేదా కనీసం 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచి మెరుగైన నెట్ రన్ రేట్ కలిగి ఉండాలి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ కెరీర్లోనే 150 మ్యాచ్ లలో ఓడిన తొలి జట్టుగా ముద్రవేసుకుంది.