ఐపీఎల్ సీజన్ 19లో మొదట పేలవ ప్రదర్శనతో డీలా పడిన చెన్నై సూపర్ కింగ్స్ క్రమంగా పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగుపరుచుకుంటోంది. తాజాగా ఆ జట్టు మరో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో గెలిచి సత్తా చాటింది. ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ 40 నాటౌట్ (24 బంతుల్లో; 4×6) టాప్ స్కోరర్. స్టబ్స్ 38 (31; 1×4, 2×6) పర్వాలేదనిపించాడు. టాప్ ఆర్డర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాతుమ్ నిస్సంక (19), కే.ఎల్.రాహుల్ (12), నితీష్ రాణా (15), కరుణ్ నాయర్ (13), అక్షర్ పటేల్ (2), అశుతోష్ శర్మ (14) పరుగులు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు, గుర్జప్నీత్ సింగ్, జెమీ ఓవర్టన్, అకియెల్ హోస్సేన్, ముకేశ్ చౌదరి ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ (6), ఉర్విల్ పటేల్ (17) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరినా సంజూ శాంసన్ 87 నాటౌట్ (52 బంతుల్లో; 7×4, 6×6) మరోసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. కార్తీక్ శర్మ 41 నాటౌట్ (31; 4×4, 2×6) పరుగులతో నిలిచాడు. వీరిద్దరూ కలిసి ఎక్కడా తడబడకుండా చెన్నైను విజయతీరాలకు చేర్చారు. చెన్నై 17.3 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. ఢిల్లీ బౌలర్లలో అక్సర్ పటేల్, లుంగీ ఎంగిడి ఒక్కో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో 10 మ్యాచ్ లలో 5 గెలుపులు 5ఓటములతో 10 పాయింట్లు సాధించి 6వ స్థానంలో కొనసాగుతోంది.