ఆ నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదు:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 

Spread the love

కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  ఈ నిర్ణయం అనేక రంగాల పై ప్రతికూల ప్రభావం చూపుతుందని  నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన,  అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైందని విమర్శించారు.  ఆత్మ నిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమేనని ఫలితాలు తెచ్చిన పాలసీ కాదు అన్నది తేలిపోయిందని ఆక్షేపించారు.  చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయని  యువత ఉపాధికి గ్యారెంటీ లేని పరిస్థితి వచ్చిందన్నారు. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న హామీ ఒట్టి మాటగానే ఉందన్నారు. గడిచిన 10 సంవత్సరాలుగా రూపాయి విలువ పతనమవుతూ వస్తోందని  ఇప్పుడు ఆ పతనం పరాకాష్ఠకు చేరిందని ఆక్షేపించారు.  

ప్రస్తుతం ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమేనని విమర్శించారు. ప్రపంచంలో భారత్ ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని ఘనంగా ప్రకటించుకుంటున్న మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుంది? అని రేవంత్ ప్రశ్నించారు. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం “పెట్రోలియం ప్రొడక్ట్స్  ధరలు పెంచం” అని ప్రకటించిందని అయితే ఫలితాలు వచ్చి పది రోజులు కూడా గడవకముందే రూ.3 కు పైగా ధరలు పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచించడమేనని అన్నారు.  కేవలం ఓట్ల కోసం, ఎన్నికల్లో విజయం కోసం మోదీ అబద్ధాలు చెబుతారని ప్రజలు భావిస్తున్నారని  ఇది విశ్వాస ఘాతుకం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *