కీలక మ్యాచ్ లో లక్నో చేతిలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్

Spread the love

ఐపీఎల్ సీజన్ 19 గ్రూప్ లీగ్ ముగింపు దశకు చేరుకోవడంతో రసవత్తరంగా సాగుతోంది. తాజాగా లక్నోలోని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియం  వేదికగా లక్నో సూపర్ జెయింట్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది. కీలక మ్యాచ్ లో చెన్నై తడబడింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. కార్తీక్ శర్మ 71 (42; 6×4, 5×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. సంజూ శాంసన్ (20) పరుగులు చేయగా…రుతురాజ్ గైక్వాడ్ (13), ఉర్విల్ పటేల్ (6) నిరాశ పరిచారు. బ్రెవిస్ (25) పర్వాలేదనిపించాడు. ఇక ఆఖర్లో శివమ్ దూబే 32 నాటౌట్ (16; 3×4, 2×6) ధాటిగా ఆడాడు.  ప్రశాంత్ వీర్ (13 నాటౌట్) పరుగులు చేశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఒక గౌరవప్రదమైన స్కోరు సాధించింది. లక్నో బౌలర్లలో ఆకాష్ మహారాజ్ సింగ్ 3 వికెట్లు, మహమ్మద్ షమీ 1వికెట్, షాబాజ్ అహ్మద్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన లక్నో 16.4 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 188 పరుగులు చేసి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. మార్ష్ 90 (38; 9×4, 7×6) విధ్వంసక ఇన్నింగ్స్ తో చెలరేగాడు. జోస్ ఇంగ్లిస్ 36 (32; 3×4, 1×6), నికోలస్ పూరన్ 32 నాటౌట్ (17; 1×4, 4×6) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ముఖేశ్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అన్షుల్ కాంబోజ్ 2.4 ఓవర్లలో 63 పరుగులు ఇచ్చాడు. ఆడిన 12 మ్యాచ్ లలో 6 విజయాలతో ఉన్న చెన్నై ఇక ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలి ఉన్న రెండు మ్యాచ్ లు ఖచ్చితంగా గెలిచి తీరాలి. అయినా ప్లే ఆఫ్ చేరడం కష్టంగానే కనిపిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *