పార్టీ ఫిరాయింపుల అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ నేత హరీష్ రావు లేఖ రాశారు. ఈ మేరకు ఆయన పేర్కొంటూ మీరు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ రాజ్యాంగాన్ని కాపాడటమే మీ లక్ష్యమని చాటిచెబుతున్నారు. పార్లమెంటులో, బహిరంగ సభల్లో మరియు ఎన్నికల ప్రచారాల్లో రాజ్యాంగ విలువల రక్షణే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కర్తవ్యమని పదే పదే ప్రకటిస్తున్నారు. ప్రజా తీర్పును గౌరవించేందుకు, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేస్తామని మరియు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేస్తామని మీ పార్టీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చింది. అయితే, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు మీరు జాతీయ స్థాయిలో ఇచ్చే ఉపన్యాసాలకు, అధికారం ఉన్న చోట మీ పార్టీ అనుసరిస్తున్న విధానాలకు మధ్య ఉన్న పొంతనలేని వైఖరిని స్పష్టంగా బయటపెడుతున్నాయని హరీష్ రావు విమర్శించారు. బీ.ఆర్.ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, కాంగ్రెస్ జారీ చేసిన అధికారిక ‘బి-ఫామ్’ తో లోక్‌సభ ఎన్నికల్లో బహిరంగంగా పోటీ చేశారు. ఇది బహిరంగంగా రికార్డుల్లో ఉన్న వాస్తవమని అయినప్పటికీ, మీ పార్టీకి చెందిన తెలంగాణ శాసనసభ స్పీకర్ మాత్రం ఫిరాయింపులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని వాదిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షించే తీరు ఇదేనా?మీరు దేశానికి హితబోధ చేసే “రాజ్యాంగ నైతికత” ఇదేనా? అని ప్రశ్నించారు. దురదృష్టవశాత్తు, రాజ్యాంగాన్ని కాపాడాల్సింది పోయి, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఓటర్ల తీర్పును అవహేళన చేస్తోందని విమర్శించారు. రాజకీయ అవకాశవాదం నుండి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికే ఫిరాయింపుల నిరోధక చట్టం ఏర్పడిందని ఒక పార్టీ తరపున ఎన్నికైన ప్రతినిధి, మరో పార్టీ గుర్తుపై పోటీ చేస్తూ కూడా అనర్హతకు గురికాకుండా ఎమ్మెల్యేగా కొనసాగుతుంటే, రాజ్యాంగ స్ఫూర్తి కేవలం ఒక రాజకీయ నినాదంగా మారిపోతుందన్నారు. మీరు ఢిల్లీలో రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతూ, తెలంగాణలో మీ పార్టీ అదే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడం సరికాదని అన్నారు. తెలంగాణ సీఎం,స్పీకర్‌కు, దానం నాగేందర్ పై ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని మీరు సూచిస్తారా? లేదా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతుందని దేశం భావించాలా? అని రాహుల్ ను ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు మరియు ఈ దేశం ఒక నిజాయితీతో కూడిన సమాధానం కోరుకుంటున్నారు.రాజ్యాంగం కేవలం ఉపన్యాసాల ద్వారా రక్షించబడదని రాజకీయంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, దానిని చేతల ద్వారా అమలు చేసినప్పుడే గౌరవించబడుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.