నువ్వెంత అంటే నువ్వెంత..?!

Spread the love

United Medak District: పార్టీల పరంగా నియోజకవర్గ పరంగా రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మాములే. కానీ ఇటీవల రాజకీయ పార్టీల మధ్య దాయాదుల పోరు కంటే ఎక్కువైంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే విధంగా మెదక్ జిల్లాలో రాజకీయ నేతల మాటలు హద్దులు దాటుతున్నాయట. ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు నోటి దురుసు వ్యాఖ్యలతో జనంలో చులకన అవుతున్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దూకుడు మీద ఉన్నారట. ఆ దూకుడు కొంత శృతి మంచి మాటలు హద్దులు కూడా దాటుతున్నాయట. ఇటీవల మెదక్ కలెక్టరేట్ ఎదుట బిఆర్ఎస్ నిర్వహించిన రైతు సంఘాల ధర్నాలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వివేక్‌, జగ్గారెడ్డి ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గడ్డాలు మీసాలు పెంచిన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి కమిషన్లు రావట్లేదని ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు. కమిషన్ల కోసం కాదు రైతుల కోసం ఏడవాలంటూ కామెంట్ చేశారు. ఇక మంత్రులకు బుద్దిలేదు అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. అంతేకాదు, ఆయన అనే బదులు వాడు అన్న పదం కూడా వాడటం అందరినీ ఆశ్చర్యపర్చిందట. పనిలోపని కలెక్టర్ మీద కూడా నాలుగు మాటలు అనేశారట ప్రభాకర్ రెడ్డి.

ఇక ప్రభాకర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి, చెరుకు శ్రీనివాసరెడ్డి. జగ్గారెడ్డి మాత్రం ఓ మతిమరుపు నేత అంటూ కొంచెం సున్నిత భాషలో వార్నింగ్ ఇచ్చారట. కోట్ల ఆస్తులు ఉండగానే సరికాదన్న జగ్గారెడ్డి, కొంచెం బుద్ది కూడా ఉండాలంటూ మాట్లాడారట. ఇక శ్రీనివాసరెడ్డి మాత్రం అరే తురే దాకా వెళ్లారట. ఖడడ్దార్, ఏం పీకతావు, ఊళ్లో తిరగనివ్వం అంటూ రెచ్చిపోయారట శ్రీనివాసరెడ్డి. అంతేకాదు, హరీష్ రావు బూట్లు నాలుకతో తుడిచావంటూ నోరు పారేసుకున్నారట. ఇక మైనంపల్లి కూడా తన రాజకీయ ప్రత్యర్ధుల మీద ఓ రేంజిలో చెలరేగారట. చెత్తగాళ్లు, రేపిస్టులు… ఇలా నోటికొచ్చిన ఆయన తీరు చూసి జనం బిత్తర పోయారట. United Medak District.

ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా నేతల మధ్య కొంతకాలంగా జరుగుతోన్న మాటల యుద్ధం శ్రుతిమించడంపై జనం పెదవి విరుస్తున్నారట. హద్దులు మీరి మాట్లాడటాన్ని ప్రశ్నిస్తున్నారట. ఇప్పటికైనా తమ జిల్లా నేతలు పద్దతి మార్చుకోవాలంటూ హితవు పలుకుతున్నారట.