ఆనాటి పోరాట స్ఫూర్తి.. ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో ఇప్పటికీ సజీవంగా ఉంది:మాజీ మంత్రి హరీష్ రావు 

Spread the love

హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద తెలంగాణ ఆత్మగౌరవం ఉప్పొంగిన రోజు.. ఉక్కుపాదం మోపిన సమైక్య పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన చారిత్రక ఘట్టం మన మిలియన్ మార్చ్ అని మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలకంగా నిలిచిన మిలియన్ మార్చ్‌కు 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.  అది సువర్ణాక్షరాలతో లిఖించిన ఘట్టంగా పేర్కొన్నారు.  అడుగడుగునా ముళ్ల కంచెలు వేసినా, లాఠీలు ఝుళిపించినా, టియర్ గ్యాస్ ప్రయోగించినా.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రాణాలకు తెగించి ముందుకుసాగిన తెలంగాణ బిడ్డల తెగువ అదని కొనియాడారు.  పల్లె, పట్టణం నుంచి కదిలివచ్చిన జనప్రవాహంతో ఆనాడు ట్యాంక్ బండ్ ఒక ఉద్యమ సముద్రంలా మారిందని గుర్తు చేసుకున్నారు. ఆ అణచివేతను ఎదిరించి నిలబడ్డ ఆనాటి పోరాట స్ఫూర్తి.. ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో ఇప్పటికీ సజీవంగా ఉందని హరీష్ రావు అన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో మన హక్కుల కోసం, మన అస్తిత్వం కోసం పిడికిలెత్తి ఎలాగైతే కొట్లాడామో.. నేడు మనం సాధించుకున్న తెలంగాణను, మన వనరులను మళ్లీ దోచుకోవాలని చూస్తున్న  దుష్టశక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి.. అదే మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *