దుబ్బాక నియోజకవర్గం హబ్సిపూర్ చౌరస్తా వద్ద రైతు సమస్యలపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ పార్టీ ‘రైతు పొలికేక’ కార్యక్రమంతో కదంతొక్కింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదేళ్లు కేసీఆర్ నాయకత్వంలో అంతా చల్లగా ఉన్నాం. కానీ, ఈ రేవంత్ రెడ్డి పుణ్యమా అని రైతులు మళ్లీ వంటా వార్పుతో రోడ్ల మీదకు ఎక్కాల్సిన ఖర్మ పట్టిందని దుయ్యబట్టారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో కరెంట్ 24 గంటలు ఉండేదన్నారు. ఎనిమిది గంటలు కూడా సరిగ్గా కరెంట్ రాక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఇందిరమ్మ పాలన, పాత రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి.. నిజంగానే కరెంట్ కష్టాలతో పాత రోజులను వెనక్కి తెచ్చాడని ఫైర్ అయ్యారు. లాక్ డౌన్ లో ఇళ్లలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ రైతుబంధు ఆగనివ్వలేదు. ఎమ్మెల్యేల జీతాలు, ఉద్యోగుల జీతాలు సగం ఆపినా, కాంట్రాక్టర్ల బిల్లులు ఆపినా రైతులకు మాత్రం పక్కాగా రైతుబంధు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఓట్ల కోసం కేసీఆర్ ఏనాడు రైతుబంధు ఇస్తానని మాట ఇవ్వలేదు. కానీ రైతుల కష్టం చూసి రైతుబంధు ప్రారంభించారు. రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ రూ.10 వేలు ఇస్తే నేను రూ.15 వేలు ఇస్తానని చెప్పి, ఉన్నదాన్నే ఎగ్గొట్టాడన్నారు. ఈ మూడేళ్లలో రేవంత్ రెడ్డి రైతులకు ఎగ్గొట్టిన రైతుబంధు అక్షరాలా రూ. 29 వేల కోట్లు.రైతు బీమా ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు ఈ నెల 13న ప్రీమియం కట్టకుండా రేవంత్ రెడ్డి రైతుల బీమాను బంద్ చేశాడని విమర్శించారు. యూరియా దొరకని దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీఏపీ ధరలను రూ. 900 నుంచి రూ. 2200కి పెంచితే, రాష్ట్ర ప్రభుత్వం యాప్ లతో రైతుల ఉసురు తీసుకుంటోందని మండిపడ్డారు. అసెంబ్లీలో తరుగు తీస్తే తోలు తీస్తానన్న ముఖ్యమంత్రి.. నేడు మిల్లర్లకే వత్తాసు పలుకుతున్నాడు.మేడిగడ్డ దగ్గర చిన్న పిల్లర్ మరమ్మతు చేయకుండా, మోటార్లు ఆన్ చేయకుండా కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టును పడుకోబెట్టాడు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కేవలం రేవంత్ రెడ్డి తెచ్చిన కరువని విమర్శించారు. 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో 1000 అబద్ధాలు, కబ్జాలు, మోసాలు తప్ప మరేమీ లేదు. దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి మాట తప్పిన రేవంత్ రెడ్డి మనిషేనా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాలుగు వేల పెన్షన్ ఇస్తానని మోసం చేయడమే కాకుండా, ఉన్న 3 లక్షల 50 వేల పెన్షన్లు తొలగించారు. కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. తులం బంగారం పేరుతో ఆడబిడ్డలను నిలువునా మోసం చేశాడని ఫైర్ అయ్యారు. కరెంట్, రైతుబంధు, రైతుబీమా ఇవన్నీ మళ్లీ పక్కాగా రావాలంటే కేసీఆర్ నాయకత్వం మళ్లీ రావాలి. కాంగ్రెస్ మోసాలకు రైతులు, మహిళలు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని హరీష్ రావు పిలుపునిచ్చారు.