బాసర ఆలయ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను సీఎంకు అధికారులు వివరించారు. మాస్టర్ ప్లాన్ పై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. భవిష్యత్ అవసరాలను, రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని సీఎం ఆదేశించారు. తిరుమలలో లాగా అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలన్నారు. ఈ నెల 6 న బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు.