ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 0 – 10 సంవత్సరాల వయసు మధ్య పిల్లలలో పౌష్టికాహార లోపం, తీసుకోవాల్సిన చర్యల పై చర్చించారు. రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయనకు సీఎం రేవంత్ వివరించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం ప్రవేశ పెట్టబోతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అంగన్వాడీల్లో పిల్లలకు పోషకాహారం అందజేసేందుకు కార్తీక్ మురళీధరన్ పలు సూచనలు చేశారు. ఆయన సూచించిన అంశాలను కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని 29 స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.
సీఎం రేవంత్ ను కలిసిన ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే టీమ్
ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో చేపడుతున్న “ప్రజా వాణి” కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయికి వికేంద్రీకరించడం పై ఈ భేటీలో చర్చించారు. రాజస్థాన్ ప్రభుత్వం చేపడుతున్న “జన్ సూచన పోర్టల్“ తరహాలో తెలంగాణ లోనూ “ప్రజా సూచన పోర్టల్” ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సూచించారు. తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్ ను నిఖిల్ డే ప్రశంసించారు. ఈ బిల్ దేశంలోనే చారిత్రాత్మకంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.