
రోజులు కాదు నెలలు కాదు..
సంవత్సరాలు.. ఏకంగా అక్షరాల 18 సంవత్సరాలు..
రాముడి వనవాసం 14 సంవత్సరాలు చేస్తే..
ఆర్సీబీ కప్పు కోసం ఏకంగా 18 సంవత్సరాలు వేచి చూసింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ స్టార్స్ ప్లేయర్స్ కి కొదవలేదు.. రికార్డ్స్ కి తిరుగులేదు.. ఫ్యాన్స్ కి పేరు పెట్టలేం..
2008లో ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆర్సీబీ లో భాగమైన కోహ్లీ ఈ 18 ఏళ్లూ అదే జట్టు తరఫున ఆడాడు. ఆర్సీబీతో అంతలా ఎమోషనల్ గా పెనవేసుకుపోయాడు. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ కోసం చెమటోడ్చాడు. ఒకరకంగా రక్తం ధారబోశాడు. ఇన్నేళ్లుగా ఒకే ఫ్రాంఛైజ్ కు కట్టుబడి ఆడిన ఏకైక ఆడగాడు విరాట్ కోహ్లీ అనడంలో సందేహం లేదు.
విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రస్థానంలో అండర్ 19 వరల్డ్ కప్ నుంచి మొదలు పెడితే.. వన్డే, టి20 వరల్డ్ కప్ లు, చాంపియన్స్ ట్రోఫీ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక టోర్నీలలో విజేత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. సచిన్ టెండూల్కర్ తరువాత అంతటి ప్రతిభ, ప్రావీణ్యం ఉన్న ఆటగాడిగా ప్రపంచవ్యాప్తంగా లెంజడరీ క్రికెటర్లందరి ప్రశంసలూ కోహ్లీ అందుకున్నాడు. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుని కింగ్ కోహ్లీ అయ్యాడు.

అటువంటి విరాట్ కోహ్లీకి ఐపీఎల్ ట్రోఫీ ఇంతకాలం అందని ద్రాక్షలా మారి ఊరించింది. వరుసగా 17ఏళ్ల పాటు ట్రోఫీ గెలవలేకపోయిన జట్టుకు.. మరే జట్టుకూ లేనంత బలమైన ఫ్యాన్ బేస్ ఉందంటే అందుకు కారణం.. విరాట్ కోహ్లీయే!
నాడు 2009 ఐపిఎల్ పిడికిలిలో నుంచి ఇసుక జారిపోయినట్లు గెలుపు జారిపోయింది. ఇక 2011 సీజన్ మొత్తం బెస్ట్ టీంగా ఉన్నా అది చేజారిపోయింది. మళ్ళీ 2016లో జస్ట్ 8 రన్స్ తేడాతో విన్నింగ్ కల చెదిరిపోయింది. ఇక ఇప్పుడు 2025 ఐపీఎల్ లో పంజాబ్ రాయల్స్ తో తలపడి 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఆర్సీబీ విజయంతో క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ కరిగి కన్నీరయ్యాడు. ఉద్వేగానికి లోనయ్యాడు. 18 ఏళ్లుగా ఆర్సీబీ విజయం కోసం తన సర్వశక్తులూ ధారపోసిన కోహ్లీ.. విజయం సాధించిన అనంతరం ఆనందం పట్టలేక మైదానంలో మోకాళ్ల మీద కూలబడి కన్నీరుమున్నీరయ్యాడు.

18 ఏళ్ల ఐపీఎల్ ప్రస్థానంలో ఇంతటి భావోద్వేగమైన ముగింపు.. ఇంతటి కిక్ మరే సీజన్ లోనూ దక్కలేదు. పలుసార్లు ట్రోఫీ గెలిచిన జట్లకు కూడా లేనంత బలమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న జట్టు ఆర్సీబీ. గత 18 ఏళ్లలో మూడుసార్లు ఫైనల్స్ వరకూ వచ్చి, మరెన్నోసార్లు లీగ్ దశ దాటి నాకౌట్ దశకు వచ్చినప్పటికీ కప్ అందుకోవాలన్న కల కలగానే మిగిలిపోయింది. ఎట్టకేలకు నాలుగోసారి ఫైనల్ ఆడుతూ కప్పును ముద్దాడింది. అయితే ఇది కేవలం టైటిల్ విజయం కాదు.. 17 ఏళ్ల పోరాటానికి దక్కిన ఫలితం. ఎన్నో అవమానాలకు, ట్రోలింగ్ లకు బదులు చెప్పిన సమాధానం. వీటన్నిటి వెనుకా ఉన్నది ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీ.