తమిళనాడులో రాజకీయ సంచలనంతో దశాబ్దాల ద్రవిడ రాజకీయాలను పక్కకు నెట్టి మార్పు కోసం వచ్చిన విజయ్ పార్టీ ‘టీవీకే’ అతిపెద్ద పార్టీగా ప్రజలు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. అయితే, కింగ్ కావాల్సిన విజయ్‌కు ‘కింగ్ మేకర్లు’ దొరకక ఒకవైపు సందిగ్దత కొనసాగుతుంటే.. మరోవైపు అభ్యర్థుల నేపథ్యాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా ‘ఆటో డ్రైవర్’ అని చెప్పుకుని గెలిచిన రాయపురం ఎమ్మెల్యే విజయ్ దాము అఫిడవిట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాయపురం నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున గెలిచిన విజయ్ దాము ఇప్పుడు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు. ఎన్నికల ముందు తనను తాను ఆటో డ్రైవర్‌గా ప్రచారం చేసుకున్న ఆయన అసలు రంగు బయటపడిందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఆయన సమర్పించిన అఫిడవిట్లో ఎక్కడా ఆటో ప్రస్తావన లేకపోవడం గమనార్హం. కానీ 20 లక్షల విలువైన ఇన్నోవా క్రిస్టా కారు మాత్రం ఆయన ఆస్తుల జాబితాలో ఉంది. ఆదాయం సున్నా అని చూపిస్తూ లక్షల విలువైన వాహనాలు ఎలా కొన్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్‌ను ఓడించిన విజయ్ దాము గెలుపు వెనుక ఇలాంటి మాయాజాలం ఉందా అని జనం చర్చించుకుంటున్నారు. సామాన్యుడి ముసుగులో వచ్చి ఓట్లు కొల్లగొట్టారని విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. అఫిడవిట్ వివరాలు బయటకు రావడంతో టీవీకే పారదర్శకతపై అనుమానాలు మొదలయ్యాయి. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది.
విజయ్ దాము ఆదాయ వివరాలు చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. వార్షిక ఆదాయం సున్నా అని పేర్కొన్న ఆయనకు ఎలాంటి అప్పులు లేకపోవడం విశేషం. స్థిరాస్తులు లేకపోయినా చరాస్తులు మాత్రం దాదాపు 29 లక్షల వరకు ఉన్నాయని అఫిడవిట్ చెబుతోంది. రెండు హోండా బైక్‌లు, ఖరీదైన కారు కలిగి ఉండి సామాన్య డ్రైవర్‌గా చెప్పుకోవడం విమర్శలకు తావిస్తోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయన ఆస్తుల చిట్టాను బయటపెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఈ పరిణామాలు గమనిస్తున్న సామాన్య ప్రజలు తాము మోసపోయామా అని ఆలోచనలో పడ్డారు. విజయ్ దాము మద్దతుదారులు మాత్రం ఆయనను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అధికారిక పత్రాల్లో ఉన్న నిజాలు మాత్రం వేరే కథ చెబుతున్నాయి.
కేవలం విజయ్ దాము ఒక్కరే కాదు.. టీవీకే పార్టీలోని 40 శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉండటం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏడీఆర్ నివేదిక ప్రకారం 92 మంది అభ్యర్థులపై వివిధ రకాల కేసులు నమోదై ఉన్నాయి. అందులో 43 మందిపై హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసులు ఉండటం గమనార్హం. కొందరు అభ్యర్థులు తమపై ఉన్న పాత కేసుల వివరాలను కావాలనే దాచిపెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని ప్రకటించిన విజయ్.. ఇలాంటి వారిని పార్టీలో ఎలా చేర్చుకున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేర చరిత్ర ఉన్న వ్యక్తులు చట్టసభల్లోకి అడుగుపెట్టడంపై మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకు బలమైన ఆయుధంగా మారింది. ఇక ఎమ్మెల్యే తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న తీరు కూడా తీవ్ర వివాదాస్పదమైంది. ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి భారీ కత్తితో కేక్ కట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది ప్లాస్టిక్ కత్తి అని వారు చెబుతున్నా ఆ వీడియో మాత్రం నెట్టింట రచ్చ చేస్తోంది. రాజకీయాల్లో ఇమేజ్ అనేది చాలా ముఖ్యం. విజయ్ దాము గతంలో ఆటో డ్రైవర్‌గా పనిచేశారనేది నిజమే కావచ్చు కానీ ప్రస్తుతం ఆయన స్థితిగతులు వేరుగా ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పకుండా ఆటో డ్రైవర్ ముసుగు వేసుకోవడమే వివాదానికి మూలం. అఫిడవిట్ లోని అంశాలు కోర్టు పరిధిలోకి వెళ్తే ఆయన పదవికే ముప్పు వచ్చే అవకాశం ఉంది. నాయకుడిపై నమ్మకంతో గెలిపించిన ఓటర్లు ఇప్పుడు నిజాలు తెలుసుకుని విస్మయానికి గురవుతున్నారు.