నాని పారడైస్ సినిమా వెనుక ఇంత ప్లానింగ్ ఉందా… తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

Spread the love

తెలుగు సినిమా పరిశ్రమలో నాని తనదైన స్టైల్ తో  ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో. సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైన నాని ఒక్కో సినిమాతో తనకు ఒక ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని ఏర్పరచుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినదసరా  సినిమా ఆయన కెరీర్‌కు పెద్ద మలుపుగా మారింది. ఆ సినిమాలో పూర్తిగా మాస్, రఫ్ రగ్డ్ లుక్‌లో కనిపించిన నాని… ఇప్పటివరకు తాను చేయని తరహా పాత్రను ఎంతో నమ్మకంగా చేసి చూపించాడు. దీంతో ఆయన నటుడిగా మరో కొత్త కోణం ప్రేక్షకులకు కనిపించింది. ఆ తర్వాత కూడా నాని తన ఎంపికలలో కొత్తదనాన్ని కొనసాగిస్తున్నారు. గత ఏడాది విడుదలైన HIT: The Third Caseలో ఆయన పూర్తిగా భిన్నమైన అవతారంలో కనిపించారు. ఇప్పుడు ఆయన చేస్తున్న కొత్త సినిమా The Paradiseపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మొదటి గ్లింప్స్ విడుదలైనప్పుడే ఇది సాధారణ సినిమా కాదనే సంకేతాలు వచ్చాయి. విజువల్ టోన్, సెటప్, పాత్రల రూపకల్పన అన్నీ చూసినప్పుడు ఇది చాలా ప్రత్యేకంగా ఉండబోతుందనే భావన ప్రేక్షకుల్లో కలిగింది. ఆ తర్వాత సినిమా నుంచి ఒక్కో ప్రోమో విడుదల అవుతున్న కొద్దీ ఆ ఉత్సాహం మరింత పెరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన “ఆయా షేర్” అనే పాట అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ పాటను చూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సాధారణంగా భారీ బడ్జెట్‌తో, టాప్ స్టార్లు నటించే సినిమాల్లో కనిపించే విజువల్ గ్రాండియర్ ఆ పాటలో కనిపించింది. పాట కంపోజింగ్, ఫోక్ సింగర్స్ తో పాడించడం, షూట్ చేసిన విధానం, సెట్స్, డ్యాన్సులు — ప్రతి అంశం కూడా ఎంతో శ్రద్ధతో తీర్చిదిద్దినట్లు కనిపించింది. ఆ పాటను చూసిన తర్వాత ఈ సినిమా స్థాయి ఎంత పెద్దదో ప్రేక్షకులకు మరింత స్పష్టమైంది.

ఈ సినిమాలో నాని జడల్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. కథ ప్రకారం ఒక ప్రత్యేకమైన తెగలో జన్మించిన అతను తర్వాత ఆ తెగకు నాయకుడిగా ఎదుగుతాడు. ఆ తెగ జీవన విధానం, వారి సంస్కృతి, వేషధారణ ఇవి కథలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద గ్రామాన్ని సెట్ రూపంలో నిర్మించారు. దాదాపు రెండున్నర ఎకరాల స్థలాన్ని తీసుకుని అక్కడ పూర్తిగా ఒక ఊరిని తయారు చేశారు. నెల రోజుల పాటు సుమారు 50 మంది కార్మికులు కష్టపడి పని చేసి మొత్తం 60 ఇళ్లతో ఆ గ్రామాన్ని రూపొందించారు. ఆ సెట్స్‌ను చూసినప్పుడు నిజంగా అక్కడ 500 మంది నివసించగలిగే గ్రామంలా కనిపించేలా చాలా సహజంగా తీర్చిదిద్దారని తెలుస్తోంది.

ఈ గ్రామంలో నాని పాత్రకు సంబంధించిన ఇంటిని కూడా చాలా ప్రత్యేకంగా రూపొందించారు. కథలో కనిపించే తెగకు ఒక ప్రత్యేకమైన జీవన విధానం ఉంటుంది. వారి దుస్తులు, అలవాట్లు, ఇంటి నిర్మాణం అన్నీ సాధారణంగా మనం చూసే విధంగా ఉండవు. అందుకే సెట్స్‌ను వింటేజ్ స్టైల్‌లో, ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించని విధంగా రూపొందించారు. గ్రామంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి ప్రాపర్టీ కూడా ఆ తెగ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా తయారు చేశారు. ఇలా ది ప్యారడైజ్ సినిమాలో చూపించబోయే ప్రపంచాన్ని సృష్టించడానికి చిత్రబృందం చాలా కష్టపడింది. ఈ భారీ ప్రయత్నం వెనుక నిర్మాత సుధాకర్ చెరుకూరితో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మొత్తం టీమ్ ఎంతో శ్రమిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆ సెట్స్‌కు సంబంధించిన ఫోటోలు చూసినప్పుడే ఈ సినిమా కోసం ఎంత పెద్ద ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే ఇప్పుడు ప్రేక్షకులు కూడా ది ప్యారడైజ్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *