కేంద్రప్రభుత్వం, ఎన్నికల సంఘంలపై మరోసారి కాంగ్రెస్ అగ్రనేత చేసిన ఆరోపణలు చర్చనీయంశంగా మారాయి. ప్రజా తీర్పును రక్షించడమే భారత ఎన్నికల సంఘం (ECI) రాజ్యాంగ బాధ్యత. కానీ, దానికి భిన్నంగా, ప్రజల తీర్పును తలకిందులు చేసే శక్తులకు అది సహకరిస్తోందని ఆరోపించారు. మొదట శివసేన, తర్వాత ఎన్సీపీ, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్. ప్రతిసారీ అదే తీరు. భారతీయ జనతా పార్టీ, ఎన్నికల సంఘం కలిసి ఒక పార్టీని చీల్చుతాయి. ఆ తర్వాత దాని ఎన్నికల గుర్తును గుంజుకుంటాయి.ఒక పూర్తి పార్టీనే దొంగిలించగలనప్పుడు, కోట్లాది మంది భారతీయుల ఓట్లను దొంగిలించడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదని రాహుల్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. ఓట్ల దొంగతనం, ప్రభుత్వం దొంగతనం, ఇప్పుడు పార్టీ దొంగతనం. ఇవి మన ప్రజాస్వామ్య పతనానికి గుర్తులుగా మారాయన్నారు. ఈ పోరాటం కేవలం మమతా బెనర్జీది మాత్రమే కాదని ఇది స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలను కోరుకునే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ఓటరు చేసే పోరాటమని పేర్కొన్నారు.
భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సంఘం పాత్ర ఎప్పుడూ అత్యంత కీలకమైనది. కానీ, ఇప్పుడు ఈ సంస్థ స్వయంప్రతిపత్తిపై మళ్లీ రాహుల్ గాంధీ తీవ్రమైన విమర్శలు చేశారు. రాహుల్ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు దారితీశాయి. ప్రజా తీర్పులను తలకిందులు చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.ఒక రాజకీయ పార్టీని పూర్తిగా అణచివేయడం లేదా దాని ఉనికిని దెబ్బతీయడం సాధ్యమైనప్పుడు, సామాన్య ప్రజల ఓట్లను తస్కరించడం పెద్ద విషయం కాదనేది రాహుల్ గాంధీ ప్రధాన వాదన. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ విశ్లేషకులను సైతం ఆలోచనలో పడేశాయి. ఈ ఆరోపణలను ప్రధాన ప్రతిపక్షం తీవ్రతరం చేస్తుండగా, అధికార భారతీయ జనతా పార్టీ మాత్రం వీటిని పూర్తిగా ఖండిస్తూ వస్తోంది. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలపై నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను, ఓటర్లను అవమానిస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఈసీపై ప్రతిపక్ష నేతల ఆరోపణలు నిరాధారమని, చట్టపరమైన నిబంధనలకు లోబడే కమిషన్ పనిచేస్తోందని స్పష్టం చేసింది.