విరాట్ 15 వేల రన్స్ రికార్డు…వెస్టిండీస్ తో వన్డే సిరీస్ భారత్ శుభారంభం

Spread the love

వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించి శుభారంభం చేసింది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగుల స్కోరు చేసింది. ఆ టీమ్ బ్యాటర్లలో జస్టిన్  గ్రీవ్స్ 101 (108 బంతుల్లో 12×4) సెంచరీతో రాణించాడు. జాన్ క్యాంప్బెల్ 62 (60; 6×4, 3×6), అమిర్ జాంగో 58 నాటౌట్ (43; 7×4, 1×6) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో ఒక మేడిన్ ఓవర్ వేసి 40 పరుగులు ఇచ్చి 4 వికెట్లతో సత్తా చాటాడు. ప్రసీద్ కృష్ణ 2 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి 1 వికెట్ పడగొట్టారు. ఇక భారత ఇన్నింగ్స్ లో కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 110 (108; 13×4, 1×6) సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 139 నాటౌట్ (88 బంతుల్లో 10×4, 9×6) వింటేజ్ కోహ్లీని గుర్తుకు తెస్తూ భారీ సెంచరీతో అదరగొట్టాడు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తూ ఛేజింగ్ లో మరోసారి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే వేగంగా ఈఫార్మట్ లో 15 వేల పరుగులను దాటిన ఆటగాడిగా నిలిచాడు. భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో 15,000 పరుగులు పూర్తి చేసి చరిత్ర సృష్టింసచిన్ టెండూల్కర్ (18,426 పరుగులు) తర్వాత వన్డేల్లో 15 వేల పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ నిలిచారు. అత్యంత వేగంగా అంటే  కేవలం 303 ఇన్నింగ్స్‌లలోనే ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. దిగ్గజ క్రికెటర్  సచిన్ (377 ఇన్నింగ్స్‌లు) రికార్డును కోహ్లీ అధిగమించారు.ఈ మ్యాచ్‌లో కోహ్లీ అజేయంగా సెంచరీ సాధించి (139 పరుగులు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయంగా 

నిలిచిపోయే మరో ఘట్టంగా నిలిచింది. రోహిత్ శర్మ (32), రుతురాజ్ గైక్వాడ్ 13 నాటౌట్ పరుగులు చేశారు.  వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్ చెరొక వికెట్ పడగొట్టారు. 2027 వన్డే ప్రపంచకప్ సమయానికి భారత జట్టు పూర్తి సన్నాహాలతో సిద్ధమవుతుండటం పట్ల అభిమానులు ఆనందం  వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరుగుతున్న వన్డే మ్యాచ్‌లలో టీమిండియా చూపిస్తున్న ఆధిపత్యం, ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటర్ల అద్భుత ఫామ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. మెగా టోర్నీకి ముందు బ్యాటింగ్ విభాగం ఈ స్థాయిలో రాణించడం, భారీ లక్ష్యాలను కూడా సులువుగా ఛేదించడం ప్రేక్షకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే, బ్యాటింగ్ లైనప్ ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ బౌలింగ్ విభాగంలో ఇంకా మెరుగుపడాల్సిన అంశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన పేసర్లతో పాటు స్పిన్నర్లు, పార్ట్-టైమ్ బౌలర్లు కూడా కీలక సమయాల్లో జట్టుకు తోడ్పాటు అందించాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా అంతర్జాతీయ వేదికలపై ట్రోఫీలు గెలవాలంటే బ్యాటింగ్, బౌలింగ్ రెండూ సమన్వయంతో రాణించాల్సిందే. బ్యాటర్ల విధ్వంసక ఫామ్ బాగున్నప్పటికీ  బౌలింగ్ విభాగాన్ని కూడా సరికొత్త వ్యూహాలతో పదును పెడితేనే 2027 ప్రపంచకప్‌లో భారత్‌ పటిష్టమైన జట్టులా ఉంటుంది. బౌలింగ్ లోపాలను అధిగమించి ముందుకు సాగితే రాబోయే టోర్నీలో భారత్ అజేయ శక్తిగా నిలవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *