చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్ స్టార్ షిప్  

Spread the love

ఎలాన్ మస్క్ అత్యంత భారీ రాకెట్  స్టార్‌షిప్ . తాజాగా అంతరిక్ష యానంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. టెక్సాస్ లోని స్పేస్ బేస్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ భారీ రాకెట్ తొలిసారి విజయవంతంగా భూకక్ష్యలోకి  ప్రవేశించింది. అయితే ఈ ప్రయోగం అంత సాఫీగా ఏమీ జరగలేదు. మనిషిని ఇతర గ్రహాల మీదకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్పేస్ ఎక్స్ సంస్థ ఈ స్టార్‌షిప్ ప్రయోగాలను చేపట్టింది. అమెరికాలోని టెక్సాస్ లో ఉన్న స్పేస్ బేస్ నుంచి ఇప్పటివరకు 13 సార్లు దీని టెస్ట్ ఫ్లైట్స్ జరిగాయి. అయితే తాజాగా 14వ సారి ఈ భారీ రాకెట్ ను ప్రయోగించగా.. ఈసారి ప్రయోగం 100 శాతం విజయవంతమైంది. మొత్తం 124 మీటర్ల ఎత్తు ఉండే ఈ రాకెట్.. ఒక భారీ బిల్డింగ్ గాల్లోకి లేచినంత అద్భుతంగా నింగిలోకి దూసుకెళ్లింది. కానీ, రాకెట్ గాల్లోకి లేచిన కొద్ది నిమిషాలకే కంట్రోల్ రూమ్ లో టెన్షన్ మొదలైంది. రాకెట్ నింగిలోకి దూసుకెళ్తున్న సమయంలో దానికి అమర్చిన అత్యంత శక్తివంతమైన రాప్టర్ ఇంజిన్లలో ఒక ఇంజిన్ మధ్యలోనే మొరాయించింది .దీంతో ఇంజనీర్లు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. రాకెట్ ఎక్కడ పేలిపోతుందో, ఎక్కడ గతి తప్పుతుందో అని భయపడ్డారు. కానీ డేటాను నిశితంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు.. స్టార్ షిప్ లో ఉన్న అటానమస్ సిస్టమ్స్,  ప్రత్యామ్నాయ ఇంజిన్ల సహాయంతో ఆ లోపాన్ని సరిదిద్దారు పనిచేయని ఇంజిన్ బరువును మిగతా ఇంజిన్లు మోస్తూ, రాకెట్ కు అవసరమైన థ్రస్ట్ ను అందించి రాకెట్‌ను అనుకున్న లక్ష్యానికి, కక్ష్యలోకి చేర్చడంలో విజయవంతమైంది. నిర్ణీత కక్ష్యలోకి రాకెట్ చేరుకున్న తర్వాత తన వెంట తీసుకెళ్లిన సరికొత్త జెనరేషన్ కు చెందిన 26  స్టార్‌లింక్  శాటిలైట్స్ ను  విజయవంతంగా అంతరిక్షంలోకి వదిలింది. తద్వారా స్టార్‌షిప్ తన తొలి వాణిజ్య ప్రయోగాన్ని  కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు సైతం హైస్పీడ్ ఇంటర్నెట్ ను అందించే ఎలన్ మస్క్ స్టార్ లింక్ ప్రాజెక్ట్ కు ఈ 26 శాటిలైట్స్  మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. 

స్టార్‌షిప్ అనేది సాధారణ రాకెట్ల లాంటిది కాదు. దీని భారీ పరిమాణం, హెవీ థ్రస్ట్ , అగ్రగామి రీ-యూజబుల్ టెక్నాలజీ  దీనిని ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. భూమి దిగువ కక్ష్యలో ఒక రాకెట్ లేదా వస్తువు స్థిరంగా తిరగాలంటే అది గంటకు దాదాపు 28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. గతంలో స్పేస్ ఎక్స్ చేపట్టిన 13 టెస్ట్ ఫ్లైట్స్ అన్నీ కేవలం సబ్-ఆర్బిటాల్  మార్గంలోనే జరిగాయి. అయితే ఈ 14వ ప్రయోగంలో మాత్రం స్టార్‌షిప్ సరికొత్త రికార్డు సృష్టిస్తూ పూర్తిస్థాయి ఆర్బిట్‌ లోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఆ 28 వేల కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అయితే వాస్తవానికి ఈ టెస్ట్ ఫ్లైట్ దాదాపు 10 గంటల పాటు సాగాల్సి ఉంది. కానీ, లాంచ్ సమయంలో జరిగిన ఆ ఒక  ఇంజిన్ వైఫల్యం కారణంగా.. భద్రతా చర్యల్లో భాగంగా మిషన్‌ను కేవలం మూడు గంటలకే కుదించాల్సి వచ్చింది. అయినప్పటికీ, కక్ష్యలోకి చేరడం, శాటిలైట్లను విజయవంతంగా మోహరించడం వంటి టార్గెట్స్ అన్నీ పూర్తయ్యాయి. దీంతో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు. రాకెట్‌ను రోదసిలోకి తీసుకెళ్లిన సూపర్ హెవీ బూస్టర్ కూడా ఎలాంటి ప్రమాదాలు లేకుండా మెక్సికో గల్ఫ్‌  సముద్ర జలాల్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇక ప్రధాన అంతరిక్ష నౌక  మాత్రం పసిఫిక్ మహాసముద్రంలో పడనుంది. ఈ విజయంతో స్పేస్‌ఎక్స్ తన భవిష్యత్తు ప్రణాళికలపై పూర్తి విశ్వాసంతో ఉంది. రాబోయే రోజుల్లో మానవులను, భారీ సామాగ్రిని చంద్రుడిపైకి, అక్కడినుంచి అంగారక గ్రహంపైకి సురక్షితంగా చేరవేయడానికి ఈ స్టార్‌షిప్ రాకెట్ అత్యంత కీలకం కానుంది. మస్క్ పట్టుదల చూస్తుంటే.. కచ్చితంగా 2030 నాటికి అంగారక గ్రహంపై మనిషి కాలు మోపే అవకాశాలు కొట్టిపారేయలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *