రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తున్న ఐశ్వర్య.. తాజాగా జరిగిన ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో మెరిసి ఔరా అనిపించింది. అయితే ఈసారి ఆమె ర్యాంప్ వాక్ కు ఒక ప్రత్యేకత తోడైంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ లో ఐశ్వర్యారాయ్ తో పాటు, హాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మరో ఇండియన్ ఆరిజిన్ నటి, బ్రిడ్జర్టన్ వెబ్ సిరీస్ ఫేమ్ సిమోన్ యాష్లీ కూడా సందడి చేశారు. వీరిద్దరూ ఒకే వేదికను పంచుకోవడం, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని చేతులు పట్టుకుని ర్యాంప్ వాక్ చేయడం ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ప్రపంచంలోని టాప్ కాస్మెటిక్ బ్రాండ్లలో ఒకటైన లోరియల్ ప్యారిస్ ఏటా ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో ఒక భారీ ఈవెంట్ ను నిర్వహిస్తుంది. మహిళా సాధికారత, వైవిధ్యం, అందం అనే థీమ్స్ తో జరిగే ఈ షోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ బ్రాండ్ అంబాసిడర్లు అందరూ పాల్గొంటారు. ఈ వేదికపై ఐశ్వర్యారాయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్దాలుగా లోరియల్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న ఆమె.. ప్రతి ఏడాదీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తో పాటు ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో కూడా పాల్గొని తన గ్లోబల్ ఫాలోయింగ్ ను చాటుకుంటారు. ఈ ఏడాది నిర్వహించిన ఫ్యాషన్ షోలో కూడా ఐశ్వర్యారాయ్ తనదైన మార్క్ చూపించారు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అని నిరూపిస్తూ.. అత్యంత ఆత్మవిశ్వాసంతో, చిరునవ్వు చిందిస్తూ ఆమె చేసిన ర్యాంప్ వాక్ అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను స్వీకరిస్తూనే, తనదైన సాంప్రదాయ, హుందాతనాన్ని బ్యాలెన్స్ చేయడంలో ఐశ్వర్య ఎప్పుడూ ముందుంటారు. ఈ ఈవెంట్ లో కూడా ఆమె తన స్టైలిష్ అవుట్ ఫిట్ తో అభిమానులను అలరించారు.
ఇక ఈసారి ఫ్యాషన్ ప్రియుల దృష్టి మొత్తం ఒకే ఫ్రేమ్ లో కనిపించిన ఇద్దరు గ్లోబల్ స్టార్స్ మీద పడింది. ఒకరు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన సీనియర్ నటి ఐశ్వర్యారాయ్ అయితే.. మరొకరు హాలీవుడ్ వెబ్ సిరీస్ ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యువ నటి సిమోన్ యాష్లీ. వీరిద్దరూ లోరియల్ బ్రాండ్ కు గ్లోబల్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ ఇద్దరు తారలు ఈ ఫ్యాషన్ షోలో కలిసి పాల్గొన్నారు. ఆమె మూలాలు అన్నీ మన సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. సిమోన్ యాష్లీది తమిళనాడు నుంచి ఏళ్ల క్రితం బ్రిటన్ కు వలస వెళ్లిన ఒక సంప్రదాయ కుటుంబం.ముఖ్యంగా ఫైనల్ ర్యాంప్ వాక్ సమయంలో.. షోలో పాల్గొన్న మోడల్స్ అందరూ ఒకేసారి వేదికపైకి వస్తున్నప్పుడు, ఐశ్వర్యారాయ్ , సిమోన్ యాష్లీ ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని, నవ్వులు చిందిస్తూ నడవడం ఈ ఈవెంట్ కే హైలైట్ గా నిలిచింది. ఈ క్యూట్ మూమెంట్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.