పశ్చిమ బెంగాల్ పొలిటికల్ ట్విస్ట్ లు..!

Spread the love

నిన్నటివరకు బెంగాల్ తన అధికార బలంతో శాసిస్తూ విపక్షాలపై ఉగ్రరూపంతో విరుచుకుపడిన  ఫైర్ బ్రాండ్ నేత మమతా బెనర్జీ.. ఇప్పుడు సొంత ఇలాకాలోనే భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 2026 సాధారణ ఎన్నికల్లో తగిలిన ఘోర పరాభవం తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఒకవైపు మమతా బెనర్జీ వర్గం ఉంటే.. మరోవైపు అరూప్ రాయ్, రితబ్రత బెనర్జీల తిరుగుబాటు వర్గం అసలైన టీఎంసీ మాదే.. గుర్తు మాదే అంటూ ఢిల్లీ ఈసీ గడప తొక్కడం ఇలా పరిణామాలు మారాయి. 1998 నుంచి పశ్చిమ బెంగాల్ పల్లెపల్లెకూ చేరువైన రెండు పూలు, గడ్డి గుర్తును, అధికారిక ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పేరును అక్టోబర్ ఉప ఎన్నికలు ముగిసేవరకు ఫ్రీజ్ చేయబడింది. మమతా వర్గానికి పేరు మార్చి మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అని నామకరణం చేసి.. గుర్తుగా ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ గుర్తును ఇచ్చింది. ఇక ఉపఎన్నికల బరిలోకి నందిగ్రామ్ వంటి కీలక నియోజకవర్గంలో మమతా వర్గం ఒక లోకల్ టీచర్, మహిళా నాయకురాలు సంచితా ప్రధాన్ డేని బరిలోకి దించింది.  అయితే నామినేషన్ల ఉపసంహరణకు కొద్ది గంటల ముందు పఆమె సంచితా ప్రధాన్ తన భర్తతో కలిసి కోల్‌కతాలోని నబన్నా సెక్రటేరియట్‌కు వెళ్లి.. నేరుగా ముఖ్యమంత్రి సువేందు అధికారితో సుదీర్ఘంగా, అత్యంత రహస్యంగా మంతనాలు జరిపారు. అనంతరం నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఒకప్పుడు మమతా బెనర్జీ నీడలో నడిచిన సువేందు అధికారి.. 2021లో ఆమెను నందిగ్రామ్‌లో ఓడించారు. 2026లో ఏకంగా భవానీపూర్‌లో మట్టికరిపించి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు.  తాను గెలిచిన రెండు సీట్లలో భవానీపూర్‌ను ఉంచుకుని, నందిగ్రామ్‌ను ఖాళీ చేస్తే.. ఆ ఉప ఎన్నికలో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుందామని దీదీ భావిస్తే.. అసలు ఆమె అభ్యర్థి బరిలో నుండి తప్పుకున్నారు.   సరే, నందిగ్రామ్‌లో ఇలా జరిగింది అనుకుంటే .. పోనీ పక్కనే ఉన్న ముర్షిదాబాద్ జిల్లా రేజీనగర్‌లో పరిస్థితి ఏమైనా బాగుందా? అక్కడ హుమాయున్ కబీర్ రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ మమత వర్గం రబియుల్ ఆలం చౌదరిని నిలబెట్టింది. కానీ నందిగ్రామ్‌లో సంచిత తప్పుకున్న మరుసటి రోజే.. ఇక్కడ రబియుల్ ఆలం కూడా చేతులెత్తేశారు! ఆయన చెప్పిన రీజన్ వింటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కాదు.. అయ్యా.. ఆ ఫుట్‌బాల్ ప్లేయర్ గుర్తు పట్టుకుని ఊళ్లలోకి వెళ్తే కార్యకర్తలు రమ్మనట్లేదు.. జనం గుర్తుపట్టట్లేదు.. నా వల్ల కాదు అని ఆయన విత్‌డ్రా చేసుకున్నారు! అంటే రెండుకు రెండు సీట్లలో నామినేషన్లు వేసిన సొంత అభ్యర్థులే తోకముడిచేశారు. దీంతో మమతా బెనర్జీ అత్యవసరంగా కాళీఘాట్ నివాసంలో మీడియా సమావేశం పెట్టారు. అక్కడ ఆమె చేసిన ప్రకటన విని రాజకీయ పండితులు ముక్కున వేలేసుకున్నారు. బీజేపీని దేశం నుంచి తరిమికొట్టడమే మా లక్ష్యం! ఇండియా కూటమి విస్తృత ప్రయోజనాల కోసం, దేశ సమగ్రత కోసం నందిగ్రామ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌కు మా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం! అలాగే అస్సాంలోని నాగావ్ లోక్‌సభ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్‌కే మా మద్దతు అని ప్రకటించారు. 1998లో ఇదే కాంగ్రెస్ పార్టీ నన్ను అణగదొక్కుతోందని, ఆ పార్టీని చీల్చి తృణమూల్ కాంగ్రెస్ పెట్టిన అదే దీదీ.. బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు అని నిన్నటివరకు తేల్చిచెప్పిన అదే ఫైర్ బ్రాండ్ లీడర్.. ఈరోజు సొంత గుర్తు పోయి, అభ్యర్థులు పారిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ అదే కాంగ్రెస్ పంచన చేరాల్సి వచ్చింది. ఇంతలోనే మరో ట్విస్ట్ మమత కాంగ్రెస్‌కు మద్దతు పలికిన సరిగ్గా కొన్ని గంటలు కూడా గడవకముందే.. పుర్బా మేదినీపూర్ జిల్లా చాందీపూర్‌లోని ఓ హోటల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 19 ఏళ్ల క్రితం.. అంటే 2007 నాటి నందిగ్రామ్ భూసేకరణ ఉద్యమం నాటి పాత హత్య, అల్లర్ల కేసులు కారణంగా తెలుస్తోంది. 

దీంతో కాంగ్రెస్ అధిష్టానం నెత్తీనోరు బాదుకుంది.  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విరుచుకుపడుతూ.. మమతా బెనర్జీ మద్దతు ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే 19 ఏళ్ల పాత కేసులను బయటకు తీసి మా అభ్యర్థిని అరెస్ట్ చేయడం బీజేపీ దుర్మార్గపు రాజకీయాలకు నిదర్శనం అని మండిపడ్డారు. ప్రతి ఎత్తుగడలోనూ అధికార బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. నందిగ్రామ్ బరిలో ఇప్పుడు బీజేపీ అభ్యర్థి హాసిరాణి రథ్, సీపీఐ అభ్యర్థి శాంతి గోపాల్ గిరి మాత్రమే ప్రధానంగా కనిపిస్తున్నారు.  పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒక విచిత్రమైన సంధియుగంలోకి అడుగుపెట్టాయి. ఒకవైపు అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు బీజేపీ, సువేందు అధికారి వేస్తున్న దూకుడు ఎత్తుగడలు.. మరోవైపు మూడు దశాబ్దాల రాజకీయ ప్రాభవాన్ని, ఉనికిని కాపాడుకోవడానికి మమతా బెనర్జీ పడుతున్న ఆరాటం. రాజకీయాల్లో వ్యూహాలు మారొచ్చు, పొత్తులు మారొచ్చు, చివరకు చేతిలో ఉన్న గుర్తులే మారిపోవచ్చు. పాత కేసులు తిరగదోడటంపై విపక్షాలు కక్షసాధింపు అని ఆరోపిస్తుంటే.. చట్టం తన పని తాను చేసుకుపోతోందని పాలకపక్షం చెబుతోంది. కానీ ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడూ శాశ్వత విజేత కాదు.. ఏ పార్టీ కూడా శాశ్వతంగా ఓడిపోదు. ఈ రాజకీయ ఎత్తులు, పైఎత్తులు, వ్యూహాత్మక ఉపసంహరణలను ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఈ పరిణామాలు ఎవరికి లబ్ధి చేకూరుస్తాయి? అనేది అక్టోబర్ 6న జరిగే పోలింగ్, అక్టోబర్ 9న వెలువడే ఫలితాలే స్పష్టం చేయాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *