మనవాళిపై ఏఐ ప్రభావం ఎలా ఉండబోతోంది?..టెక్ దిగ్గజాల భిన్న వాదనలు

Spread the love

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మానవాళికి ముప్పు తప్పదని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తుంటే అసలు ప్రమాదమేమీ లేదని మరికొందరు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రముఖ ఏఐ సంస్థ ‘ఏంథ్రోపిక్’కు చెందిన పరిశోధకుడు జాకబ్ కాక్సన్ తన పదవికి రాజీనామా చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాబోయే దశాబ్దం అంటే 2030 ముగిసేలోపే ఏఐ వల్ల మానవాళి పూర్తిగా అంతరించిపోయే అవకాశం 10% పైగా ఉందని హెచ్చరించడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఏఐ సంస్థలు ప్రస్తుతం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాయని  శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతికతపై మానవులు నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన నిపుణుల నుండి వ్యక్తమవుతుండడం కలవరపెడుతోంది. ఒక అతిపెద్ద టెక్ సంస్థకు చెందిన ఏఐ విభాగం నుండి తప్పుకున్న మరొక నిపుణుడు కూడా ఏఐ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ కంపెనీలు ఇప్పటివరకు ప్రజలకు పూర్తి వాస్తవాలు చెప్పడం లేదని ఏఐతో నిజమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయనేది వాస్తవమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మానవుల కంటే అత్యంత తెలివైన సూపర్ ఇంటెలిజెన్స్  వ్యవస్థలు వస్తే  అవి మానవుల ఆదేశాలను పక్కనబెట్టి సొంత నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉందనే వాదనా ఉంది. సమాజంలో ఏది నిజమో, ఏది అబద్ధమో గుర్తించలేనంతగా డీప్‌ఫేక్‌లు, అసత్య ప్రచారాలు  వ్యాప్తి చెంది అశాంతి నెలకొనే ప్రమాదం కూడా ఉందనే చర్చ కూడా జరుగుతోంది. అలాగే ఊహించని వేగంతో కోట్లాది ఉద్యోగాలు ఏఐ వల్ల కోల్పోయే పరిణామం కూడా ఉండవచ్చనేది మరి కొందరి అభిప్రాయం. అయితే మరోవైపు ఇటువంటి వాదనలను అసంబద్దమని కొట్టిపడేసే వారు కూడా ఉన్నారు. తాజాగా టెక్ దిగ్గజం ఎన్వీడియా సీఈవో జెన్సన్ హువాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మానవాళిని ఏఐ అంతం చేస్తుందన్న వాదనలను కొట్టిపడేశారు. అది జరిగే అవకాశం లేదన్నారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్  చేశారు. ఈ దశాబ్దం చివరి నాటికి ఏఐ వల్ల మానవళి అంతమవుతుందన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. ఏఐ టెక్నాలజీని  అందిపుచ్చుకోవాలి. ప్రమాదం ఉందన్న వార్తలతో పలు కంపెనీలు ఏఐ డెవలప్మెంట్ ను తగ్గించడం  సరికాదని అభిప్రాయపడ్డారు.  తమ సిస్టమ్ల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అలాగే సేఫ్ కాదని భావించే సిస్టమ్లను విడుదల చేయొద్దన్నారు.  ఇతరులతో సంబంధం లేకుండా సాధ్యమైనంత వేగంగా ఏఐ వైపు పయనించాలని స్పష్టం చేశారు. ఇలా సాంకేతిక దిగ్గజాల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏఐతో ఎటువంటి పరిస్థితులను మానవాళి ఎదుర్కొంటుందో కాలమే సమాధానం చెప్పాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *