ప్యారడైజ్ లో బిర్యానీ క్యారెక్టర్ తో అదరగొట్టనున్న సంపూర్ణేష్

Spread the love

సినిమా ఇండస్ట్రీలో తన టాలెంట్ తో, తన కామెడీ టైమింగ్ తో వెండితెరపై  బర్నింగ్ స్టార్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఏకైక నటుడు సంపూర్ణేష్ బాబు  . హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాలతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సంపూ.. ఇప్పుడు ఒక సరికొత్త అవతారంలో, ముందెన్నడూ చూడని ఒక సీరియస్ రోల్ లో మన ముందుకు రాబోతున్నాడు. న్యాచురల్ స్టార్ నాని  హీరోగా, శ్రీకాంత్ ఓదెల  దర్శకత్వంలో రాబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రం  ది ప్యారడైజ్ . ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు బిర్యానీ అనే ఒక పవర్ ఫుల్,  స్పెషల్ క్యారెక్టర్ లో నటించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంపూర్ణేష్ బాబు.. తన రియల్ లైఫ్ గురించి, తనకున్న స్టార్‌డమ్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ తన రియల్ లైఫ్ క్యారెక్టర్ ఏంటో కళ్లకు కట్టినట్లు వివరించారు. బయట ప్రపంచానికి, అభిమానులకు నేను ఎప్పటికీ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నే కావచ్చు. కానీ నా సన్నిహితుల మధ్య, నా కుటుంబ సభ్యుల మధ్య నేను ఎప్పటికీ పాత నరసింహాచారినే . కెమెరా ముందు ఉన్నంత సేపే నేను హీరోగా ఫీల్ అవుతాను. షూటింగ్ కంప్లీట్ అయిపోయి, కెమెరా ఆఫ్ అవ్వగానే ఆ హంగులు అన్నీ అక్కడే వదిలేస్తాను. నా సొంత మనుషులు, నా పిల్లలు, నా స్నేహితుల మధ్య నేను కేవలం ఒక సాధారణ నరసింహాచారిగానే ఉంటాను. బయట నాకున్న స్టార్‌డమ్‌ను నా చుట్టూ ఉన్నవాళ్లు ఎంజాయ్ చేస్తుంటారు కానీ, నాకు మాత్రం ఆ హంగులు, బిల్డప్ లు పెద్దగా పట్టవు  అని ఆయన తన మనసులోని మాటలను ఎంతో నిజాయితీగా పంచుకున్నారు. 

ప్రస్తుతం తన నేపథ్యాన్ని వివరిస్తూ నాకు సిద్దిపేటలో మంచి సొంత ఇల్లు ఉంది, రెండు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. బయట సొసైటీ దృష్టిలో నేను బాగా సెటిల్ అయినట్లే. కానీ నాకు ఎక్కడికైనా అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఒకవేళ నా డ్రైవర్ లేకపోయినా, లేదా నాకే సొంతంగా డ్రైవింగ్ చేసే ఓపిక లేకపోయినా.. నేను నా ప్రయాణాన్ని ఎప్పుడూ వాయిదా వేసుకోను. నా దగ్గర కారు ఉంది కదా అని మొహమాటపడను. వెంటనే వెళ్లి ఆర్టీసీ బస్   ఎక్కేసి నా ప్రయాణం స్టార్ట్ చేస్తాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్లడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు, అందులో నాకు ఎలాంటి భేషజాలు కూడా కనిపించవు అని ఆయన చాలా సింపుల్ గా చెప్పారు. అంతేకాకుండా.. ఈ సమాజం కోసం నేను బతకాల్సిన అవసరం నాకు లేదు. నా కుటుంబం, నన్ను ప్రాణంగా ఇష్టపడే వాళ్లతో నేను సంతోషంగా ఉంటే చాలు. ఇతరుల కోసమో, ఏదో వాళ్ల ముందు గొప్పకు పోయో నేను ఏది కొన్నా.. అది కొందరికి తక్కువగా కనిపిస్తుంది, మరికొందరికి ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ సమాజం నన్ను ఎలా చూస్తుందనే ఆలోచనతో రిస్క్ చేయడం, అప్పులు చేయడం శుద్ధ దండగ అంటూ నేటి ఆర్భాటాల ప్రపంచానికి ఒక పెద్ద కౌంటర్ ఇచ్చారు. ఈ డౌన్-టు-ఎర్త్ ఫిలాసఫీ చూసి ఆయన అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

ఇక  ది ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో సంపూర్ణేష్ బాబు పాత్ర ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రలకంటే భిన్నంగా ఉండబోతోంది. ప్యారడైజ్ బిర్యానీ ఎంత అద్భుతంగా ఉంటుందో, ఈ సినిమా అంత అద్భుతంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సినిమాలో నానితో, మోహన్ బాబుతో కలిసి వర్క్ చేయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. నాని అన్న నాకు సెట్ లో చాలా కంఫర్ట్ ఇచ్చారు. ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాలో ఇన్ని రోజులు పనిచేయడం నాకు ఇదే మొదటిసారి. నేను ఏదైనా సీన్ చక్కగా పర్ఫార్మ్ చేస్తే నాని అన్న వెంటనే దగ్గరకు వచ్చి మెచ్చుకునేవారు. ఇక మోహన్ బాబు గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా ఎప్పటినుంచో ఉన్న కల.. అది ఈ సినిమాతో నెరవేరింది అని ఆయన ఎమోషనల్ అయ్యారు. అయితే ఇంటర్వ్యూ చివర్లో ఆయన ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. నిజానికి ఇలాంటి సీరియస్ , బలమైన క్యారెక్టర్ నాకు మూడేళ్ల క్రితమే  వచ్చి ఉంటే.. నా కెరీర్ లో జరిగిన కొన్ని మిస్టేక్స్ జరిగేవి కావు అని ఆయన మనసులో మాట చెప్పారు. సినిమాల్లో హీరోగా ఎంత ఎదిగినా, రియల్ లైఫ్ లో తన మూలాలను, పల్లెటూరి మంచితనాన్ని మర్చిపోని సంపూర్ణేష్ బాబు లాంటి వాళ్లు ఇండస్ట్రీకి ఎంతో అవసరం.  ది ప్యారడైజ్  సినిమాతో ఆయనకు నటుడిగా మరో గొప్ప బ్రేక్ రావాలని, ఆయన కెరీర్ మరింత ముందుకు సాగాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *