గతేడాది పహల్గామ్ లో అమాయక టూరిస్ట్ లపై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడి తరువాత భారత్-పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి తెలిసిందే. పాక్ నుండి వచ్చే అన్ని దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే తాజాగా పాకిస్థాన్ నుండి భారత్ కు అక్రమంగా ఖర్జురాలను తరలిస్తున్న ముఠాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దేశానికి చెందిన 362 మెట్రిక్ టన్నుల ఎండు ఖర్జూరాలను నాసిక్ కు చేరుకున్నట్లు నిఘావర్గాల నుండి సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. మొత్తం పదమూడు కంటైనర్లలో దాచి ఉంచిన ఈ సరుకు విలువ కోట్లలో ఉంటుందని అంచనా. నిషేధం ఉన్నప్పటికీ ఈ అక్రమ దారులు ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే ముంబైకి చెందిన ఒక సంస్థ పాకిస్థాన్ నుంచి ఖర్జూరాలను తరలించేందుకు భారీ కుట్ర పన్నింది. కరాచీ ఓడరేవు నుంచి బయలుదేరిన వస్తువులను ముందుగా యూఏఈలోని జెబెల్ అలీ పోర్టుకు పంపారు. అక్కడ కంటైనర్లు మార్చి, కాగితాలపై యూఏఈ సరుకుగా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారు. సదరు సంస్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంక్షలు అమలులో ఉండగా శత్రు దేశం నుండి జరిగే ఇలాంటి అక్రమ దిగుమతులు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో దేశం ద్వారా సరుకులను పంపిస్తూ పన్నులు ఎగవేయడమే కాకుండా, దేశ భద్రతకు ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. పాకిస్థాన్ జాతీయుల నియంత్రణలో ఉన్న కొన్ని సంస్థలు ఈ అక్రమ రవాణా వెనుక ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, కంటైనర్ల మార్పిడి మరియు తప్పుడు డిక్లరేషన్ పత్రాల ద్వారా దేశీయ చట్టాలను మోసగించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన నిబంధనల వల్ల ఇలాంటి అక్రమ మార్గాలను అధికారులు సమర్థవంతంగా పసిగట్టగలుగుతున్నారూ.దేశంలోకి శత్రు దేశపు వస్తువులు ఏ రూపంలో ప్రవేశించినా ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సముద్ర మార్గాలు, కంటైనర్ డిపోలపై మరింత కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి మోసాలను అడ్డుకోవడానికి కస్టమ్స్, డీఆర్ఐ విభాగాలు కలిసి ప్రత్యేక తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నాయి. జాతీయ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అధికారులు చెబుతున్నారు.