సోషల్ మీడియా ‘షో-ఆఫ్’… కనిపించే మెరుపుల వెనుక పొంచి ఉన్న ప్రమాదం

Spread the love

సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్, ఫాలోవర్ల కోసం వ్యక్తిగత జీవితాన్ని ప్రపంచం ముందుకు పరిచయం చేయడం ఈ రోజుల్లో చాలామందికి  అలవాటుగా మారింది. కానీ, తమ వద్ద ఉన్న నగలు, డబ్బు, విలాసవంతమైన వస్తువులను ప్రదర్శించడం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఇటీవల ఒక యూట్యూబర్ ఇంట్లో జరిగిన దొంగతనం ఘటన స్పష్టం చేస్తోంది. తమిళనాడుకు చెందిన ఒక యూట్యూబర్  తన బంగారు నగలు, ఇంట్లో ఉండే డబ్బు కట్టలను చూపుతూ రీల్స్ చేసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పోస్టు చేశారు. తర్వాత ఏదో పని నిమిత్తం భర్తతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లి అర్ధరాత్రి ఇంటికి తిరిగొచ్చారు. ఆ సమయంలో ఇంటి వెనుకవైపు తలుపులకు తాళాలు పగులగొట్టి ఉండటంతో ఆందోళన చెందారు. లోపలికెళ్లి చూస్తే బీరువాలో ఉన్న భారీగా విలువైన బంగారు నగలు, రూ.50 వేల నగదు దొంగతనానికి  గురయ్యాయి. చేసేదేమీ లేక వారు  పోలీసులను ఆశ్రయించారు. వర్చువల్ ప్రపంచంలో లభించే తాత్కాలిక ప్రశంసల కోసం ఆడంబరాలను ప్రదర్శించడం అంటే, అసాంఘిక శక్తులకు సమాచారం అందించినట్లే అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  మనం అనవసరంగా షేర్ చేసే ఫోటోలు, వీడియోలు దొంగలకు ఖచ్చితమైన సమాచారాన్ని, పక్కా ప్రణాళికను అందించే సాధనాలుగా మారుతున్నాయనేది గుర్తుంచుకుని ప్రవర్తించడం మంచిది. 

సోషల్ మీడియాలో మనం ఒక్కోసారి ప్రవర్తించే తీరుతో ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే  మన ఇంట్లోని వస్తువులు, రోజువారీ అలవాట్లు, ప్రస్తుత లొకేషన్ (Live Location) వంటి వివరాలను ప్రతిక్షణం అప్‌డేట్ చేయడం వల్ల నిఘా పెట్టే క్రిమినల్స్‌కు పని తేలికవుతుంది. సోషల్ మీడియా అనేది సమాచారాన్ని పంచుకోవడానికి, కనెక్ట్ అయ్యేందుకు  ఉపయోగపడే వేదిక మాత్రమే గానీ, మన ఆర్థిక స్థితిగతులను ప్రదర్శించే షోకేస్ కాదని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  వ్యక్తిగత భద్రతను పణంగా పెట్టి సోషల్ మీడియాలో అన్ని విషయాలు పంచుకోవడం మంచిది కాదని నిపుణలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవడం అత్యంత అవసరం. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను, ప్రయాణ వివరాలను, ఆర్థిక సమాచారాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆన్‌లైన్‌లో షేర్ చేయకూడదు. ప్రైవసీ సెట్టింగ్స్‌ను యాక్టివ్ గా  ఉంచుకోవడంతో పాటు, వర్చువల్ గా లభించే ప్రశంసల కంటే నిజ జీవితంలో మన భద్రతే ముఖ్యమని గుర్తించాలి. వివేకవంతమైన డిజిటల్ అలవాట్లే మనకు, మన కుటుంబానికి నిజమైన రక్షణ కవచమని దృష్టిలో ఉంచుకోవాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *