సౌదీకి ఏమాత్రం ఉపయోగపడని  పాకిస్తాన్..రంగంలోకి  ఫ్రాన్స్ 

Spread the love

పశ్చిమాసియాలో ఆధిపత్య పోరు ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతోంది. అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ఉంది. ఈ మాట ఇప్పుడు మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్ కు అక్షరాలా సరిపోతుంది. ఇన్నాళ్లూ తమకు రక్షణగా నిలుస్తాయని ప్రాణంగా నమ్మిన ఇస్లామిక్ దేశాలు మొహం చాటేయడంతో సౌదీ అరేబియా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా టార్గెట్ గా భీకరమైన దాడులకు దిగుతున్నారు. ఇరాన్ అండదండలతో రెచ్చిపోతున్న ఈ హౌతీలు.. ముఖ్యంగా సౌదీ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆయిల్ ఫీల్డ్స్ పై, ఆయిల్ రిఫైనింగ్ కర్మాగారాలపై డ్రోన్లు,  బాలిస్టిక్ మిస్సైల్స్ తో  విరుచుకుపడుతున్నారు. ఈ యుద్ధం ఈనాటిది కాదు. ఎన్నో ఏళ్లుగా యెమెన్ లో జరుగుతున్న ప్రాక్సీ వార్ లో ఇది ఒక కీలక భాగం. గతంలో కేవలం సరిహద్దులకే పరిమితమైన ఈ దాడులు.. ఇప్పుడు ఏకంగా సౌదీ అరేబియా కు అత్యంత కీలక నగరాలపై పడుతున్నాయి. దీనివల్ల సౌదీ అరేబియాకు భారీగా ఆర్థిక నష్టం జరుగుతోంది. కేవలం సౌదీకే కాదు.. అక్కడి నుంచి చమురు ఎగుమతులు ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు అమాంతం పెరిగిపోయి, గ్లోబల్ ఎకానమీపై ప్రభావం పడుతుంది. అందుకే ఈ దాడుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి సౌదీ అరేబియా గతంలో పాకిస్తాన్, టర్కీ దేశాలతో కలిసి మక్కా జాయింట్ అగ్రిమెంట్ ను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకుంది. అయితే  అసలైన ఆపద వచ్చినప్పుడు పాకిస్తాన్, టర్కీలు పెద్దగా చేసిందేమి లేదు.  పాకిస్తాన్ ఎప్పుడూ సౌదీ దగ్గర ఆర్థిక సాయం, అప్పులు తీసుకోవడానికి ముందుకి వస్తుంది కానీ.. సౌదీకి సైనిక అవసరం వస్తే మాత్రం చేసిందేమి లేదు. హౌతీల దాడులతో సౌదీ అరేబియా ఇబ్బందులు పడుతున్నా  ఈ రెండు దేశాలు కేవలం మాటలకే  పరిమితమయ్యాయి. ప్రత్యక్షంగా ఎలాంటి సైనిక సహాయాన్ని పంపలేదు. హౌతీల దాడుల తర్వాత ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రులు, సైనిక అధిపతుల మధ్య పలుమార్లు మంతనాలు జరిగినా కూడా.. సౌదీకి ఒరిగింది ఏమీ లేదు. తమకు ఎంతో అండగా నిలుస్తాయని భావించిన పాక్, టర్కీల తీరుతో సౌదీ అరేబియా ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది.

మిత్ర దేశాలు ముఖం చాటేయడంతో సౌదీ అరేబియా తన పాత మిత్రుడైన అగ్రరాజ్యం అమెరికా వైపు చూసింది. తమకు మద్దతుగా హౌతీలపై దాడులు చేయాలని సౌదీ అరేబియా ఏకంగా అమెరికాను అధికారికంగా కోరింది. కానీ అమెరికా కూడా సౌదీ కోరికను ఏమాత్రం పట్టించుకోలేదు. సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలోనే, అటు మక్కా కూటమి, ఇటు అమెరికా దూరంగా ఉన్న సమయంలో ఫ్రాన్స్ రూపంలో సౌదీకి ఒక పెద్ద భరోసా దొరికింది. కష్టకాలంలో సౌదీకి ఫ్రాన్స్ అండగా నిలుస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ సౌదీకి సైనిక సహాయాన్ని అధికారికంగా ప్రకటించారు. సౌదీ అరేబియాకు రక్షణ కల్పించేందుకు తమ దేశ సైనికులు, అత్యాధునిక రాడార్లు,  ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను పంపనున్నట్లు ఆయన స్వయంగా తెలిపారు. అయితే ఇక్కడ ఫ్రాన్స్ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. యెమెన్ లోపలికి వెళ్లి హౌతీలతో ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనడం ఫ్రాన్స్ లక్ష్యం కాదని, కేవలం సౌదీ అరేబియా ఇంధన మౌలిక సదుపాయాలను రక్షించడమే తమ ప్రధాన ఉద్దేశ్యం అని ఆయన స్పష్టం చేశారు. 

ఫ్రాన్స్ నిర్ణయం వినడానికి చాలా బాగుంది కదా. కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో ఏ దేశం కూడా తమ స్వార్థం లేకుండా మరో దేశానికి సైన్యాన్ని పంపదు. ఇక్కడ ఫ్రాన్స్ కు ఉన్న కీలక కారణం ఫ్యూయల్ సెక్యూరిటీ. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఒక మాట స్పష్టంగా చెప్పారు.. తమ మొదటి ప్రాధాన్యత యాన్బు పోర్ట్ ను రక్షించడమే అని ఆయన క్లారిటీ ఇచ్చారు. రెడ్ సీ  ఒడ్డున ఉన్న ఒక అతిపెద్ద వాణిజ్య నగరం. సౌదీ ఇంధన వ్యవస్థలో ఈ ఓడరేవు అత్యంత కీలకమైంది. ఇక్కడ అతిపెద్ద చమురు నిల్వ కేంద్రాలు,  చమురు శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. దీనికి తోడు తూర్పు-పశ్చిమ పైప్‌లైన్ ను  కూడా ఇక్కడే అనుసంధానించారు.  ఈ పైప్‌లైన్ పర్షియన్ గల్ఫ్ కు, హార్ముజ్ జలసంధికి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతోంది. ఒకవేళ  ఇరాన్ తో యుద్ధం వచ్చి హార్ముజ్ జలసంధి మూసుకుపోయినా సరే.. ఈ యాన్బు పోర్ట్ ద్వారానే చమురు ఎగుమతులు జరుగుతాయి. రోజుకు ఏకంగా 7 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా చేసే భారీ సామర్థ్యం ఈ పైప్ లైన్ కు ఉంది. ఎర్ర సముద్రం మీదుగా ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా యూరప్ కు చమురు వెళ్లే ఈ కీలమైన యాన్బు పోర్ట్ నే ఇప్పుడు హౌతీలు లక్ష్యంగా చేసుకున్నారు. ఒకవేళ యాన్బు పోర్ట్ ధ్వంసం అయితే, యూరప్ దేశాలకు చమురు సరఫరా ఆగిపోయి, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో పెట్రోల్ ధరలు పెరిగిపోతాయి. ఆ ఎనర్జీ క్రైసిస్ ను ముందే ఆపడానికే ఫ్రాన్స్ ఇప్పుడు అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ తో రంగంలోకి దిగింది. యాన్బు పోర్ట్ కు ముప్పు వాటిల్లితే అంతర్జాతీయంగా ఆయిల్ మార్కెట్ అస్థిరతకు లోనవుతుంది, దాని ప్రభావం తమ యూరప్ పై డైరెక్ట్ గా పడుతుంది కాబట్టే ఫ్రాన్స్ ఇంత వేగంగా రియాక్ట్ అయింది. ఏది ఏమైనా పాకిస్తాన్ లాంటి దేశాలను నమ్ముకుంటే కష్టకాలంలో నట్టేట మునగడం ఖాయమని సౌదీకి ఇప్పుడు అనుభవపూర్వకంగా అర్థమైనట్లే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *