గతేడాది ‘మిరాయ్’ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో అదరగొట్టారు ‘రా కింగ్’ మంచు మనోజ్. ప్రస్తుతం డేవిడ్ రెడ్డి అనే మరో భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్ లో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. చారిత్రక నేపథ్యంతో కూడిన పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది.యక్కంటి హనుమ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన “ది స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి” గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ గ్లింప్స్‌లో కనిపించిన విజువల్స్, యాక్షన్ టోన్, మనోజ్ లుక్ అన్ని సరికొత్తగా అనిపించాయి. ముఖ్యంగా మనోజ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ సినిమా టీజర్ విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటికే గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు టీజర్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోందని పోస్టర్లు, గ్లింప్స్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా పీరియాడికల్ సెట్స్, పోరాట సన్నీవేశాలు, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.ఈ చిత్రాన్నివెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ పతాకాలపై భరత్ మోతుకూరి, వెంకట్ రెడ్డి నల్లాగంగుల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఉక్రెయిన్ నటి మరియా ర్యబోషప్కా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమె పాత్ర కూడా కథలో చాలా ముఖ్యమైందిగా ఉండబోతుందని సమాచారం. అంతర్జాతీయ నటీనటులను తీసుకోవడం ద్వారా సినిమాకు మరింత కొత్తదనం తీసుకురావాలని దర్శకుడు ప్రయత్నిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కేజీఎఫ్, సలార్ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండడం కూడా ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు తీసుకొచ్చాయి. భారీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మాస్ ఎలివేషన్స్ ఇవ్వడంలో ఆయనకు ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఇప్పుడు డేవిడ్ రెడ్డి కి కూడా అదే రేంజ్ మ్యూజిక్ అభిమానులు ఆశిస్తున్నారు.
సామాజిక సేవలో తమ వంతు
ఇక సినిమాల విషయాన్ని పక్కన పెడితే… మంచు మనోజ్ వ్యక్తిగత జీవితంలో కూడా ఇప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయన, ఆయన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లోకి అడుగుపెట్టారు. తమ పుట్టినరోజు వేడుకలను కేవలం సెలబ్రేషన్స్‌కే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడేలా మార్చాలని నిర్ణయించుకున్న ఈ దంపతులు “ఐక్య… ధైర్య సేన సమితి” అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈ విషయాన్ని మంచు మనోజ్ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ సంస్థ ద్వారా రక్తదానం, అత్యవసర సహాయం, అవసరంలో ఉన్నవారికి అండగా నిలిచే కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు మనోజ్ తెలిపారు. భగవంతుడు తమకు ఇచ్చిన దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే ఆలోచనతో ఈ సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు.ఐక్య అంటే ఐకమత్యం. మనుషులు కలిసి నిలబడితేనే నిజమైన మార్పు వస్తుందని మనోజ్ పేర్కొన్నారు. ఈ సంస్థకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని… మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరి కోసం ఈ వేదిక అని తెలిపారు. మనోజ్ దంపతులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.